రుద్రమదేవి - సమీక్ష




వెయ్యేళ్ళ పాటు తమ విజయపతాకాన్ని రెపరెపలాడించి శాతవాహనుల తర్వాత తెలుగుదేశాన్నంతా ఒక్క తాటిపై నడిపి జాతి సంస్కృతి సంప్రదాయాలపై బలమైన ముద్ర వేసిన ఘనత కాకతీయులది. ఆ ఇంటపుట్టిన శార్దూలం రాణీ రుద్రమదేవి. వంశరక్షణతో పాటూ రాజ్యసంరక్షణ అనే బృహత్తర ఆశయాన్ని తన భుజస్కందాల పై వేసుకొని,అబలగా తనను సమకట్టిన శత్రుసమూహానికి సబలనని నిరూపించి, తాత తండ్రుల కీర్తికి ఏ మాత్రం తగ్గకుండా రాజ్యపాలన చేసి సుస్థిర యశోచంద్రికలందుకొన్న ధీర వనిత ఆమె. ఆమె చరిత్ర నిత్యస్మరణీయం . భావితరాలకి ఆదర్శప్రాయం. 

ఇటువంటి ఉత్కృష్టమైన కథను ఎన్నుకొని తెరకెక్కించే సాహసం చేశారు దర్శకుడు గుణశేఖర్. మరి ఆయన ప్రయత్నం ఫలించిందా ?

చరిత్ర చెప్పిన రుద్రమదేవి కథకు చిత్రంలో చూపెట్టిన కథకూ ఉన్న వ్యత్యాసాలేమిటి ?

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితనం ఎలా ఉంది ?


చరిత్ర చెప్పిన కథ

తెలుగువాళ్ళ ఇంటిపేర్లు సాధారణంగా గ్రామాల పేర్లతోనో, లేక వాళ్ళు ఆరాధించిన దేవతల పేర్లతోనో ప్రారంభమవుతూంటాయి. కాకతి పేరుతో చాలా గ్రామాలున్నాయి కాబట్టి వీటిలో కాకతీయులు ఏ గ్రామానికి చెందినవారో చెప్పటం కష్టం. అయితే వీళ్ళు కాకతి అనే కులదేవతను ఆరాధించటం చేత కాకతీయులైనారని ప్రామాణికాలు చెబుతున్నాయి. కాకతీయులు గుమ్మడితీగకు పుట్టినవాళ్ళని ఒక అద్భుతమైన కథ శాసనాల్లో ఉంది. ఈ వంశపు మూలపురుషుడైన మాధవవర్మ మహారాజు కొడుకు పద్మసేనుడికి చాలా కాలం సంతానం కలుగలేదు. చివరకి ఆయన గుమ్మడికాయలతో అనుమకొండ పద్మాక్షిదేవిని పూజిస్తే ఆ దేవి అనుగ్రహంతో సంతానం కలిగిందట. వీళ్ళ వంశం అనుమకొండలో వేయ్యేళ్ళు వర్ధిల్లుతుందని దేవి అభయం ఇచ్చిందట. పద్మసేనుడి తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు కానీ వీరిలో కాకతి గుండ్యనను కాకతీయ సామ్రాజ్యానికి బాటలు వేసిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ వంశంలో ప్రఖ్యాతి కెక్కిన మహారాజులలో గణపతిదేవ మహారాజు ఒకడు. కాకతీయుల స్వర్ణయుగం ఆయనతోనే ప్రారంభమయ్యింది. ఆయనకు, సోమదేవికి కలిగిన ప్రథమ సంతానమే రుద్రమదేవి.


అమిత పరాక్రమవంతుడు,సుపరిపాలనా దక్షుడైన  మహారాజుకు పుత్ర సంతానం లేదన్న వార్త ప్రజలకు ఆశనిపాతం,శత్రురాజులకు ఆనందదాయకం. ఈ విషయం గ్రహించిన గణపతిదేవుడు శివదేవయ్య మంత్రి సూచనలతో రుద్రమదేవిని పురుషుడిగానే పెంచుతాడు.  రుద్రదేవ మహారాజుగా తన కూతురుని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. తండ్రి ఆశయాలను అర్థం చేసుకున్న రుద్రమదేవి తదణుగుణంగానే ఎన్నో త్యాగాలకోర్చి రాటుదేలుతుంది. యుక్తవయస్సు వచ్చాక ,రాజ్య రహస్యం తెలిసినవాడు, సర్వ సైన్యాధ్యక్షుడైన జయాపసేనాని కుతురు ముమ్ముడమ్మను రుద్రమ్మదేవికిచ్చి వివాహం జరిపిస్తాడు గణపతిదేవుడు. ముమ్ముడమ్మకు విషయం తెలియనివ్వకుండా తానొక వ్రతం చేస్తున్నానని అంతవరకూ దీక్షలో ఉండాలని చెబుతుంది రుద్రమదేవి.

గణపతిదేవుడు వృద్ధుడవుతాడు. రుద్రమ్మదేవి కాకతీయ సింహాసనం అధిరోహిస్తుంది. రాజ్యంలో అల్లకల్లోలం బయలుదేరుతుంది. గోనగన్నారెడ్డి తండ్రి గోనబుద్ధారెడ్డి. ఈయన కాకతీయులకున్న అనేకానేక సామంత రాజులలో ఒకడు. రంగనాథ రామాయణం అనే ప్రసిద్ధమైన కావ్యాన్ని కూడా వ్రాసి కవిగానూ తన సత్తా చాటిన వాడు. అతని తమ్ముడు లకుమయారెడ్డి. బుద్ధారెడ్డి ప్రభుభక్తి పరాయణుడు. యాభై యేళ్ళకు అతనికి సంతానం కలుగుతారు. వారు కుప్పాంబ, గన్నారెడ్డి, విఠలరెడ్డి. వయోభారం పెరిగి అవసానదశకి చేరిన బుద్ధారెడ్డి, తమ్ముడు లకుమయ్యని పిలిచి, తన పెద్ద కొడుకు గన్నారెడ్డి పేరుతో రాజ్యపాలన చెయ్యమని, అతను పెద్దయ్యాక రాజ్యం అతనికే అప్పగించి, వేరొక నగరం పరిపాలించుకొమ్మని చెప్పి కన్నుమూస్తాడు. లకుమయ్య తన అన్నకుమారులను   విద్యాభ్యాసం కోసం ఓరుగల్లు పంపి తనే రాజులా చెలామణి అవుతాడు. రుద్రమ్మ పీఠం ఎక్కాక, ‘ఒక ఆడదాని మోచేతినీళ్ళు తాగాలా’ అని హుంకరించి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనలాగే స్త్రీపాలనలో తలదాచుకోవడానికి ఇష్టపడని మిగతా సామంతరాజులతో, రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహరదేవులు, మురారిదేవులు, ఇతర శత్రురాజులతో చర్చలు జరుపుతూంటాడు.

గోనగన్నారెడ్డి తండ్రిలాగే కాకతీయవంశ వీరాభిమాని. పినతండ్రి తనకు చేసిన అన్యాయం, దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనించి కొంతమంది వీరులను తయారుచేసి, రుద్రమ్మదేవిని కలుస్తాడు. తామంతా గజదొంగలగా అవతారమెత్తి, రాజ్యంలో చెలరేగుతున్న అక్రమాలను పారద్రోలి, తిరుగుబాట్లను అణిచివేస్తామని, అందుకు అనుజ్ఞ ఇవ్వమని కోరుతాడు. రుద్రమ్మదేవి సరేనంటుంది. గన్నారెడ్డి నల్లమల అడవులలో ఒక పాడుబడిన దుర్గాన్ని బాగుచేయించి, తన సేనతో రహస్యంగా అక్కడ ఉంటూ అధర్మనిర్మూలనం చేస్తూంటాడు.

లకుమయ్య తన కుమారుడు వరదారెడ్డిని ఆదవోని రాకుమారి అన్నాంబికకిచ్చి వివాహం చెయ్యాలని తలపోస్తాడు. అన్నాంబికకు ఆ పెళ్ళి ఇష్టం ఉండదు. గన్నారెడ్డి మెరుపులా వచ్చి వరదారెడ్డిని అపహరించుకుపోయి, కొంతకాలానికి విడిచిపెడతాడు. లకుమయ్య మళ్ళీ వివాహ ప్రయత్నం చెయ్యబోగా, గన్నారెడ్డి ఈ సారి వధువైన అన్నాంబికను అపహరించి, అక్క కుప్పాంబను తోడునిచ్చి బావగారి రాజ్యానికి చేరవేస్తాడు. కుప్పాంబ అన్నాంబికను ఓరుగల్లులో రుద్రమ్మ దగ్గర చేర్చి తిరిగి వస్తుంది.


ఒకనాడు రుద్రమ్మదేవి, అన్నాంబిక కొంతమంది వీరులతో కలిసి మొగిలిచెర్ల వెళ్ళి కాకతమ్మకు పూజలు చేస్తారు. తిరిగివస్తూండగా రుద్రమ్మదేవికి వరుసకు అన్నలైన హరిహర మురారిదేవులు సైన్యంతో విరుచుకపడతారు. సామంత రాజైన చాళుక్య వీరభధ్రుడు సుడిగాలిలా ఊడిపడి వారిని తుదముట్టించి ఆమెను రక్షిస్తాడు. దేవగిరి యాదవ మహాదేవరాజు ఎనిమిది లక్షల మాహాసైన్యం పోగుచేసుకోని ఓరుగల్లు మీద దండయాత్రకు వస్తాడు. గన్నారెడ్డి అతని సైన్యంపై పడి అపారమైన ప్రాణనష్టం కలిగిస్తాడు. రుద్రమ్మదేవి మంత్ర దండనాయకులతో సమావేశం ఏర్పాటుచేసి పక్కా ప్రణాళికతో, హోరాహోరీగా యుద్ధం చేసి అతన్ని తరిమికొడుతుంది. పారిపోతున్న అతని సైన్యాలని కొండలమాటున దాగి గన్నారెడ్డి సర్వనాశనం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో మహదేవరాజు రుద్రమ్మదేవి శరణుకోరి బ్రతికి బయటపడతాడు.


ఓరుగల్లులో సంబరాలు మిన్నంటుతాయి. నిండుసభలో గన్నారెడ్డి గజదొంగ కాదని స్పష్టం చేస్తాడు శివదేవయ్య మంత్రి. లకుమయ్యను, ఇతర స్వామిద్రోహులను క్షమించి విడిచిపెడతారు. రుద్రమ్మదేవి మారుపెళ్ళికి గణపతిదేవుడు విధించిన షరతులు మూడు. రుద్రమ్మను పెళ్ళాడిన పురుషుడు ఎంతగొప్పవాడైనా చక్రవర్తి కారాదు. రుద్రమ్మదేవియే రాజ్యాన్ని పాలించాలి. ఆమె కుమారుడు రాజ్యం వహించబోయే ముందు కాకతి వంశానికి దత్తత రావాలి. ఆ షరతులకన్నీ ఒప్పుకొని చాళుక్య వీరభధ్రుడు ఆమెను పెళ్ళిచేసుకుంటాడు. తను ఇదివరకే పెళ్ళి చేసుకున్న ముమ్ముడమ్మను దత్తత తీసుకుని భర్త సోదరునితో ఆమెకు వివాహం చేయిస్తుంది రుద్రమ్మదేవి. మరో వైపు  అన్నాంబికకు గన్నారెడ్డికి వివాహం జరిపిస్తుంది. గోనగన్నారెడ్డి వర్ధమానపురం(నేటి మహబూబ్‌నగర్ జిల్లాలోని వడ్డిమాని) రాజుగా పట్టాభిషక్తుడవుతాడు.

 రుద్రమదేవి దంపతులకు ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమె పేరు రుయ్యమ్మ .రుద్రమదేవి దత్తపుత్రిక అయిన ముమ్ముడమ్మ కుమారుడే ప్రతాపరుద్రుడు. ఇతన్నే భావి చక్రవర్తిగా బాల్యం నుంచి తీర్చిదిద్దుతుంది రుద్రమదేవి. విధివశాత్తూ పెళ్ళైన కొన్నేళ్ళకే చాళుక్య వీరభద్రుడు మరణిస్తాడు. భర్త మరణంతో కుమిలిపోతున్న రుద్రమదేవి వయోవృద్ధుడైన తండ్రి శివైక్యం చెందటంతో మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోతుంది. పరిపరివిధాలా శోకించి ఒక దశలో ఆత్మహత్యా ప్రయత్నం చేయబోయి అంతలోనే కుదుటబడి ప్రతాపరుద్రుడి రక్షణభారాన్ని నెత్తిన వేసుకొంటుంది. స్వయంగా రణరంగంలోకి ఉరికి అనేక యుద్ధాలలో పాల్గొని విజయాలు సాధించి సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. చివరికి అదే ప్రయత్నంలో కళ్ళుమూస్తుంది.

సినిమాలో కథ

నాటకీయత కోసం మార్పులు చేర్పులు చేసుకున్నామని, ఎవరి మనసునైనా నొప్పిస్తే క్షంతవ్యులమని సినిమా ప్రారంభంలోనే ప్రకటించి ముందు జాగ్రత్త పడ్డారు గుణశేఖర్. తమ రాజ్యంలో పుత్ర సంతానం లేకపోవటం వల్ల కలిగిన పరిస్థితి గురుంచి విశ్లేషిస్తూ హిందూ దేశంలో ఒక మహరాజుకు ఇటువంటి పరిస్థితే ఎదురైతే ఆయనేం చేశాడో  ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. రుద్రమదేవి బాల్యాన్ని,చాళుక్య వీరభద్రుడితో ఆమె ప్రణయాన్ని, ముమ్ముడమ్మతో పెళ్ళిని స్పృశిస్తూ చివరకు మహదేవ రాజును ఓడించి ఆమె పట్టాభిషక్తురాలవటంతో చిత్రం సుఖాంతమవుతుంది. మిగతా కథను ఈ చిత్రానికి కొనసాగింపుగా తీయబోయే 'ప్రతాపరుద్రుడు ' కోసం అట్టి పెట్టారు దర్శకుడు.  కమర్షియల్ సక్సెస్ కోసం గోనగన్నారెడ్డి సన్నివేశాలను మార్చి వ్రాశారు. ఎక్కడో జరిగాల్సిన అన్నాంబిక (సినిమాలో అనామిక-కేథరీన్ థెరెసా ),వరదారెడ్డి సన్నివేశాలను  రుద్రమ్మదేవి సమక్షంలో జరిగినట్లు చూపించారు. అలాగే రుద్రమ్మదేవిని చంపడానికి హరిహర మురారిదేవులు ఏనుగుబొమ్మ ద్వారా పథకం పన్నితే గోనగన్నారెడ్డి వచ్చి రక్షించినట్లు చూపించారు. చాళుక్య వీరభద్రుడు-రుద్రమ్మదేవి ప్రణయ సన్నివేశాలు ,నాగదేవుడి పాత్ర వాణిజ్య అంశాల కోశమే. తమను పరిపాలిస్తున్నది యువరాణి కానీ యువరాజు కాదని తెలిసి ప్రజలు తిరుగుబాటు చేసినట్లు చూపించారు. ఇన్నాళ్ళూ మగవాడిగా తమను మభ్యపెట్టినందుకు ప్రతిగా మరణశిక్షకు సమానమైన రాజ్యబహిష్కరణ శిక్ష విధించినట్లు చరిత్రను తిరగ వ్రాశారు.

నటీనటులు , సాంకేతిక నిపుణులు, దర్శకత్వం 

రుద్రమ్మదేవి తన చిరాకాల స్వప్నమని,చిత్రం కోసం చాలా పరిశోధనలు చేశానని ఉద్వేగంగా చెప్పుకున్నారు గుణశేఖర్ . ఆయన ఆశయాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే.  వెకిలి హాస్యం, ప్రత్యేక గీతాలున్న ఫార్ములా చిత్రాలే రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో తెలుగు వాడికి తన మూలాలు గుర్తుచేసే ఒక చారిత్రాత్మక చిత్రం,అందునా స్త్రీ ప్రాధాన్యత ఎక్కువున్న చిత్రాన్ని  ఇవ్వాలనుకోవడం , దాని కోసం సర్వశక్తులూ ఒడ్డి చిత్రాన్ని నిర్మించటం నిజంగా చాలా ధైర్యసాహసాలతో కూడుకున్న పని. ఇందుకు ఆయన్ని తప్పకుండా అభినందించాల్సిందే. 




అయితే గుణశేఖర్ అంటే సగటు ప్రేక్షకుడికి ముందుగా గుర్తుకొచ్చేది సెట్టింగులు. ఈ చిత్రంలో కూడా కథనం, పాత్ర పోషణ మీద కంటే అదనపు హంగుల మీదే ఆయన ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది. ఒక్క గోనగన్నారెడ్డికి తప్ప ఇతరులందరికీ ఆహార్యం చాలా బాగా కుదిరింది. గన్నారెడ్డి వస్త్రధారణలో మాత్రం తెలుగుదనం కంటే ఇటీవల విడుదలైన పాశ్చ్యాత్య సినిమా పోకడలు కనిపించాయి. అలాగే అంతఃపుర మందిరాలు, గ్రామాలు, అడవులలో వేసిన సెట్లు బాగా ఉన్నాయి. గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయాయి. సన్నివేశానికి అవసరం లేకపోయినా భారీతనం ఉట్టిపడటం కోసం చాలా చోట్ల అనవసరమైన గ్రాఫిక్స్ వాడారు. ఉదాహరణకు చిత్రంలో ప్రతినాయకుడైన మహదేవరాజును చూపించిన ప్రతిసారీ అతనో ఎత్తైన ఒంటిస్తంభపు మేడపై ఉన్నట్లు గ్రాఫిక్స్ వాడారు. అలాగే రుద్రమదేవి పరిచయ సన్నివేశాలు, క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు అతుకుల బొంతలా ఉన్నాయి. 3D సాంకేతికత ఇంకో అనవసర ఆకర్షణ . ఆ డబ్బును ముఖ్యమైన గ్రాఫిక్స్ కోసం వాడుకున్నా ఫలం దక్కేది. 

చారిత్రాత్మక సినిమాలకు కథనం, సంగీతం రెండుకళ్ళని చెప్పుకోవచ్చు. కథాపరంగా రుద్రమదేవిలో ప్రేక్షకులను భావోద్వేగాలకు గురిచేసే బలమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో  ఏ సన్నివేశమూ వీక్షకుడిపై ఎటువంటి ప్రభావం చూపదు. నటీనటులు కూడా ఆ స్థాయి నటన ప్రదర్శించలేదు. సినిమా అంతా డాక్యుమెంటరీలా నిదానంగా సాగుతూ వెళ్తుంది. ప్రథమార్థంలో ఉన్న ఆసక్తి ద్వితీయార్థంలో సన్నగిల్లుతుంది.  ఇది దర్శకుడి వైఫల్యం .నేపథ్య సంగీతం మరో ప్రధాన లోపం . సగటు సంగీత దర్శకుడు సైతం సాధారణ సన్నివేశాలకు  నేపథ్య సంగీతంతో ప్రాణం పోసే  ఈ రోజుల్లో, సంగీతజ్ఞాని ఇళయరాజా అందించిన సంగీతం పూర్తిగా నిరాశపరుస్తుంది.  ఇళయరాజా అభిమానులైన నాలాంటి వాళ్ళు సైతం రాజా ఇంత నాసిరకంగా ఎలా కొట్టారని ఆశ్చర్యపోకతప్పదు.   ఒక్క రి-రికార్డింగ్‌కే రెండుకోట్లు ఖర్చుబెట్టారన్నారు . విదేశాల్లో రి-రికార్డింగులు చేసి ఏం ప్రయోజనం స్వదేశీ పామరున్ని ఆకట్టుకోలేకపోతే ?


రుద్రమదేవిగా అనుష్క చక్కగా ఇమిడిపోయింది. అందానికి తగ్గ ఒడ్డూ, పొడవూ, ఠీవి తనలో ఉన్నాయి. తనకు తప్ప ఇతర ఏ నటీమణులకీ ఈ మేకప్ నప్పదేమో అనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే మేకప్ కుదరటం వేరు నటనలో మెప్పించటం వేరు. అనుష్క నటన గొప్పగా లేకున్నా ఫర్వాలేదనిపిస్తుంది. గంభీరమైన ముఖకవళికలతో సినిమా మొత్తం నెట్టుకొచ్చింది. వీరోచిత సన్నివేశాలలో ఇంకాస్త బాగా చేసి ఉండొచ్చు. ముమ్ముడమ్మతో తొలిరాత్రి సన్నివేశాలలో అంతర్మథనాన్ని, ప్రజలంతా తనను తిరస్కరించినప్పుడు హావభావాలను ఒకేలా పలికించింది. పోరాట విన్యాసాలలో ఆమె పడ్డ కష్టం తెలుస్తుంది.

చిత్రంలో కరువైన వినోదాన్ని గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ప్రేక్షకులకు పంచిపెట్టాడు. గన్నారెడ్డికున్న మహబూబ్‌నగర్ జిల్లా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అతని సంభాషణలు తెలంగాణా యాసలో చెప్పించారు.  కొన్ని డైలాగులు పట్టి 



చెప్పినట్లున్నాయి,ఇంకొన్ని బాగానే చెప్పాడు. అయితే గొంతు బలహీనమవ్వటం వల్ల అవీ ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని లేకి సంభాషణలు కూడా ఉన్నాయి. ' గమ్ముండవోయ్' అన్న ఊతపదం బాగా పేలింది. క్లైమాక్స్లో  శిరస్త్రాణం ధరించి యుద్ధం చేస్తున్న సన్నివేశాలు తన మూర్తిమత్వాని(personality)కి నప్పలేదు. గన్నారెడ్డి ఒక రాజకుమారుడని,  పర్యవసానాల కారణంగానే అతను బందిపోటుగా మారాడనే విషయం స్పష్టంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. గన్నారెడ్డి గురుంచి తెలియని వాళ్ళు సినిమా పూర్తయ్యాక అతనొక బందిపోటు ముఠా నాయకుడని,శత్రు సంహారంలో రుద్రమ్మదేవికి సహాయం చేశాడనే అనుకుంటారు కాని అతనో రాజకుమారుడని తెలుసుకోలేరు. చిత్ర జయాపజయాలతో నిమిత్తం లేకుండా కేవలం దర్శకుడి మీద గౌరవంతో ఎంతో ఆసక్తితో ఆగిపోయిన చిత్రంలో నటించి, చిత్రాన్ని పునరుద్ధరించి, విడుదలకు నోచుకునేలా చేసిన అర్జున్ నిజంగా అభినందనీయుడు. 

రుద్రమదేవి ప్రియుడు చాళుక్య వీరభద్రుడిగా రాణా నటన గురుంచి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. శివదేవయ్య మంత్రిగా ప్రకాష్‌రాజ్ సాంఘిక సినిమాలకు మల్లే తనదైన శైలిలో సంభాషణలు పలికినా ఉన్నంతలో కాస్త న్యాయం చేశాడు. గణపతిదేవుడుగా కృష్ణంరాజు, ముమ్ముడమ్మగా నిత్యమీనన్ పాత్రోచితంగా నటించారు. సుమన్ జయప్రకాష్ రెడ్డి తదితరులు ఆయా పాత్రలకు సరిపోయారు.

చివరగా 
రుద్రమదేవి అంతా గొప్పగా లేదు,అంత నాసిరకంగానూ లేదు. అలాగని రుద్రమదేవి కథ మీద గుణశేఖర్‌కున్న అంకితభావాన్ని కొట్టిపారెయ్యడానికి వీల్లేదు. కానీ అంకితభావంతో పాటూ ఆలోచన కూడా అవసరం. ముఖ్యంగా ఏది అవసరమో,ఏది అనవసరమోనన్న స్పష్టత చాలా అవసరం.ఎంత అవసరమంటే నాగదేవుడు లాంటి ప్రాముఖ్యత లేని పాత్రకు బాబాసైగల్ లాంటి పరభాషా గాయకున్ని నటుడిగా పెట్టుకోవడమే అవివేకం అనుకుంటే, అతనికో ప్రత్యేక గీతాన్ని పెట్టి చివరకి దాన్ని తొలగించడం ఇంకా అవివేకం అని తెలుసుకునేంత. కొసరు హంగుల కంటే అసలు కథ, కథనం ముఖ్యమని తెలుసుకునేంత . రుద్రమదేవి కథలో వీరరసం ప్రధానమని, ఆమె పెంపకం, ప్రణయం, మరో స్త్రీతో పెళ్ళి ఇవన్ని ఆసక్తికరమైన అంశాలే అయినప్పటికీ వాటికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతవరకే ఇచ్చి మిగతా భాగాన్ని రుద్రమ విజయాలపై, కార్యనిర్వహణా దక్షతపై కేంద్రీకరించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలుసుకునేంత.

( కాకతీయుల చరిత్రకు ఆధారాలు- ఖండవల్లి లక్ష్మీరంజనం  గారి కాకతీయ యుగము, ఏకామ్రనాధుని ప్రతాపరుద్ర చరిత్రం
గోనగన్నారెడ్డి - అడవి బాపిరాజు గారి గోనగన్నారెడ్డి నవల అధారంగా.ఈ పుస్తకం పై నా సమీక్షను ఇక్కడ చదవండి.)


3 comments

Post a Comment