బాక్సాఫీస్ ఛత్రపతి రాజమౌళి బాహుబలి - సమీక్ష






మూడేళ్ళుగా తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బాహుబలి విడుదలయ్యింది. ప్రభాస్,రాణా,అనుష్క,తమన్నా లాంటి భారీ తారాగణమున్నా,మగధీర, మర్యాదరామన్న, ఈగ చిత్రాలతో  మాములు మాస్ దర్శకులకు తనకూ మధ్య వున్న వ్యత్యాసాన్ని విస్పష్టంగా లోకానికి చాటిచెప్పిన రాజమౌళి మీదే భారీ అంచనాలు  పెట్టుకున్నారు అందరూ. ప్రచార చిత్రాలు అంచనాలని మరింత రెట్టింపు చేసి ' మొదటి రోజు ఈ సినిమాని చూడకపోతే ఎలారా భగవంతుడా ' అనుకునే స్థాయికి సగటు ప్రేక్షకున్ని తీసుకెళ్ళాయి. మొదటి మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఫుల్లయిపోయి ఎక్కడా టికెట్లు దొరక్క థియేటర్లపై దాడి చేసే పరిస్థితి.

  • ఇన్నికోట్ల మంది భారీ అంచనాలని రాజమౌళి అందుకున్నాడా  ?
  • భారత చలనచిత్ర దశని దిశని మార్చగల సినిమా వచ్చిందా ?
  • తెలుగు సినిమా స్థాయి ఇది అని తెలుగోడు తొడగట్టగలిగాడా  ?

కథ:


రాజ్యం కోసం అన్నదమ్ములైన ఇద్దరు రాకుమారులు పోట్లాడుకున్న సాదా సీదా కథ. ఈ విషయం రాజమౌళే అనేక సందర్భాలలో చెప్పాడు. ఇంతకన్నా రెండు ముక్కలు ఎక్కువ చెబితే సినిమా మొత్తం చెప్పినవాన్నవుతాను కాబట్టి చెప్పను.

నటీనటులు, కథనం,దర్శకత్వం :

బాహుబలి లో మొదట చెప్పుకోవల్సినవి ఫోటోగ్రఫీ, విజ్యువల్ ఎఫెక్ట్స్. తర్వాత చెప్పుకోవల్సినవి యుద్ధసన్నివేశాలు.

జలపాతాల దగ్గర సన్నివేశాలు, మహీష్మతి నగరం, యుద్ధ సన్నివేశాలు నభూతో. వంద అడుగుల భళ్ళాలదేవుడి విగ్రహాన్ని నిలబెట్టడానికి చేసే యత్నాలు, అంతఃపురం నుంచి పారిపోతున్న శివున్ని పట్టుకోవడానికి సైనికులు దొర్లించే అగ్నిగోళాలు, యుద్ధంలో వాడే చిత్రవిచిత్రమైన ఆయుధాలు, పనిముట్లు అమోఘం. సినిమాలో ప్రతి షాటూ కన్నులవిందే. కొన్ని  వందల మంది రాత్రనక పగలనక పడిన కష్టం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒకటి రెండు సన్నివేశాల్లో గ్రాఫిక్స్ సరిగ్గా కుదరకపోయినా చాలా సన్నివేశాలు భారత చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచేవే. టైంమెషిన్ ఎక్కితే వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లు, ప్రతిభావంతులైన సాంకేతిక సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించి ప్రేక్షకుల కళ్ళెదుటే మహీష్మతీ నగరాన్ని ఆవిష్కరించాడు రాజమౌళి. సినిమాకు ప్రాణమైన యుద్ధ సన్నివేశాలలో అయితే విజృంభించాడు . యుద్ధ వ్యూహాలు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా వివరించడం, ఆయుధ సామగ్రిని తరలించడం, యుద్ధగజాల అలంకరణ నుంచి, పోరాటల చిత్రీకరణ వరకూ అతని పనితనంలో పతాక స్థాయి కనిపిస్తుంది.  యుద్ధసన్నివేశాలు నిస్సందేహంగా హాలీవుడ్‌స్థాయిలో ఉన్నాయి. భీముడు గదాధారియై యుద్ధరంగంలో అడుగుపెడితే ముందుగా భయపడేవి మత్తగజాలేనట-ఎక్కడ తమ  కుంభస్థలాలు  పగిలిపోతాయేమోనని. భళ్ళాలదేవుడు  గదాధారియై  కాలకేయుడి యుద్ధగజాన్ని నేల కూల్చినప్పుడు ఆ సన్నివేశం గుర్తొచ్చింది.  అమరేంద్ర బాహుబాలి సవ్యసాచిలా శూలపాణియై శత్రుసేన తలలు తురుముకుంటూ వెళ్తూంటే అలా చూస్తూండిపోవాల్సిందే. 

అయితే నాణేనికి మరోవైపూ ఉంది. 

నేపథ్య సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. ట్రైలర్‌లో వాడిన మ్యూజిక్ బిట్‌నే కీరవాణి సినిమా మొత్తం తిప్పి కొట్టాడు. ఇక పాటల సంగతి సరే సరి. దీనికి తోడు డాల్బీ అట్మోస్ టెక్నాలజి వాడారు. ఇది ఎన్ని థియేటర్లలో పనిచేస్తుందన్నది ఓ ప్రశ్న .బెంగుళూరు లాంటి మహా నగరంలోనే డాల్బీ అట్మోస్ సర్టిఫైడ్ థియేటర్ ఒక్కటే ఉంది. సరైన సౌండ్ సిస్టం లేకపోతే మొదటి ముప్ఫై నిమిషాలు నేపథ్య సంగీతం ఇంత బలహీనంగా ఉందేంటి అని ప్రేక్షకుడు ఆశ్చర్యపోయినా తప్పులేదు.

రాజమౌళి చిత్రాలలో ప్రతినాయకుడు బలంగా ఉంటాడు. అతని మనస్తత్వం కౄరం హావభావాలు వికృతంగా ఉండి ప్రేక్షకులను భయభ్రాంతులను చేస్తాయి. ఛత్రపతిలో కాట్రాజ్ అయినా, విక్రమార్కుడులో విలన్ అయినా అటువంటివాడే. అతను పెట్టే చిత్రహింసలు భరించలేక ప్రజలు అవస్థలు పడుతూంటే ప్రేక్షకుడు కన్నీరు పెట్టుకుంటాడు. ప్రజల పట్ల జాలి, కథానాయకుడి మీద అభిమానం పెంచుకొని ఎప్పుడెప్పుడు అతను ప్రతినాయకుడి మీద తిరగబడతాడా అని ఉత్కంఠతో ఎదురుచూస్తాడు. కథానాయకుడు ఆవేశంతో సంభాషణలు పలుకుతూ ఒంటిచేత్తో కలియబడితే ' ఇది కదరా మనకు కావల్సిన ఎమోషన్' అని పూనకంతో ఉగిపోతాడు. అతను గెలిచిన ప్రతిసారి ఉత్సాహంతో చప్పట్లు కొడతాడు.

బాహుబలిలో అదీ లోపించింది. సువాసన లేని స్వర్ణరత్నఖచిత పుష్పం బాహుబలి.


బాహుబలిలో ప్రతినాయకుడు భళ్ళాలదేవుడు(రాణా). అతని పాత్ర మహాభారతంలో దుర్యోధనున్ని పోలి ఉంటుంది. అతనికి ఉన్నట్లే ఇతనికీ ఒక బలమైన గద ఆయుధంగా ఉంది. రాజమౌళి పొందిన ప్రేరణ అక్కడితోనే అంతమైనట్లు అనిపిస్తుంది. భళ్ళాలదేవుడి పాత్రపోషణ తేలిపోయింది. అసూయ, కౄరత్వం చాటుకునే బలమైన సన్నివేశాలు లేవు. ఉన్న ఒకటీ అరా సరైన సంభాషణలు, హావభావాలు పలక్క చప్పబడిపోయిపోయాయి. సాంకేతికంగా ప్రతి చిన్న విషయాన్ని అద్భుతంగా రాబట్టుకునే రాజమౌళి, భావోద్వేగాలకు సంబంధించిన ఇంత మౌలికమైన అంశాన్ని పట్టించుకోలేదెందుకో . రాణాని ఇంతకంటే కౄరంగా చూపెడితే భవిష్యత్తులో అతని హీరోయిజానికి ఇబ్బందని సందేహించాడో లేదో తెలియదు. నిజానికి బలమైన నటుడికి సంభాషణలు సన్నివేశాలతో పనిలేదు. కేవలం ముఖకవళికలు మాటవిరుపులతో సాధారణ సన్నివేశాన్ని అసాధరణంగా మలచగలడు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడున్న యువతరం నటుల్లో ఒకరికో ఇద్దరికో తప్ప మిగతావాళ్ళెవరికీ మొహంలో అన్ని భావాలూ పలకవు. అటువంటప్పుడు సన్నివేశాలు సంభాషణలు బలంగా ఉండాలి. బాహుబలిలో చెప్పుకోదగ్గ సంభాషణలు ఏవంటే తడుముకోవాలి . అయితే పరిచయ సన్నివేశాలలో,యుద్ధ సన్నివేశాలలో రాణా నటన బాగుంది.

ధృతరాష్ట్రుడు, శకుని ప్రేరణతో అల్లుకున్న బిజ్జలదేవుడి పాత్ర (నాజర్) కుడా అంతంతమాత్రమే. చెడు ఎంతో తీవ్రంగా ఉంటే తప్ప మంచి విలువ తెలియదు. బిజ్జలదేవుడిలో ఆ కుటిలత్వం చూపించే సన్నివేశాలు బలంగా లేవు. నాజర్ కంటే కోటశ్రీనివాసరావుకి ఇటువంటి పాత్రలు కొట్టిన పిండి.


దేవసేన (అనుష్క) దైన్యం వెనుక ఉన్న కారణాలేమిటో తెలిస్తే తప్ప ప్రేక్షకుడికి సానుభూతి కలగదు. ఈ సన్నివేశాలన్నీ రెండవ భాగంలో ఉన్నాయి కాబట్టి అంతవరకూ కేవలం కథానాయకుడి కన్నతల్లిని కట్టిపడేశారన్న కారణంతో జాలి చూపించాలి.

మమతల తల్లిగా శివగామి(రమ్యకృష్ణ), కళ్ళముందు ఎంత ఘోరం జరుగుతున్నా రాజరికానికి కట్టుబడిన బానిస నాయకుడిగా కట్టప్ప(సత్యరాజ్),కౄరత్వం మూర్తీభవించిన రాజ్యాధినేత కాలకేయ (ప్రభాకర్) పాత్రలు బావున్నాయి. రమ్యకృష్ణ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. తను సహజంగా మంచి నటి కాబట్టి బాగా చేసింది. గొంతు కూడా తనదే. ప్రతినాయకుడు తనే అనుకునేలా ఉన్న కాసేపూ గొప్పగా చేశాడు ప్రభాకర్. అతనికి ఇచ్చిన విచిత్రమైన భాష అదనపు ఆకర్షణ. మాస్ ప్రేక్షకులకు ఇట్టే నచ్చుతుంది. పర్షియా ఆయుధవ్యాపారి అస్లాం ఖాన్(సుదీప్) పాత్ర నిడివి చాలా తక్కువ. రెండవ భాగంలో పరిధి పెంచుతారేమో.

అవంతికగా తమన్నా నటన ఆకట్టుకుంటుంది. మొదటి సారి రౌద్రరస ప్రధానమైన పాత్ర పోషించినా మంచి మార్కులే కొట్టేసింది.


కథానాయకుడికి ఉండాల్సిన కనీసార్హతలు అన్నీ ప్రభాస్‌కు ఉన్నాయి. తన ' కటౌట్‌ ' కి ఏ వేషమైనా నప్పుతుంది. ఇక యువరాజుగా కత్తి చేతబట్టి జవనాశ్వం ఎక్కి యుద్ధవిన్యాసాలు చేస్తే అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలుంటాయా ? శివుడిగా ప్రభాస్ మెప్పించాడు. ఇంతెత్తున్న శివలింగాన్ని అలవోకగా ఎత్తి రెండు చేతులతో పట్టుకొని వచ్చే సన్నివేశాల్లో అతన్ని చూసి మనసు పారేసుకోని టీనేజీ అమ్మాయిలుండరు. భద్రుడి(అడవి శేష్) తల ఎగరగొట్టే సన్నివేశంలో అతని హావభావాలు బాగా పండాయి. అమరేంద్ర బాహుబలిగా మాత్రం ఇంకాస్త బాగా చేసి ఉండొచ్చని అనిపించింది. వాచకం చాలా మెరుగవ్వాలి. పతాక సన్నివేశాల్లో వచ్చే కొన్ని శక్తిమంతమైన సంభాషణలను అస్పష్టంగా చెప్పి మమ అనిపించాడు. రచయితలు గంభీరమైన సంభాషణలు వ్రాయకపోబట్టి సరిపోయింది కాని లేకపోతే అల్లరిపాలయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో రాణా కొంత నయం. 

ముగింపు: 

సమీక్షలతో సంబంధం లేకుండా సినిమా కనకవర్షం కురిపించడం ఖాయం. మొదటి భాగం చూసిన ప్రతి ప్రేక్షకుడికీ రెండవ భాగం ఎలా ఉండబోతుందో ఇట్టే తెలిసిపోతుంది-ఎమైనా ఊహించని మలుపులుంటే తప్ప. నాకు మాత్రం రెండవ భాగాన్ని మొదటి భాగంగా విడుదల చేసి అరచేతిపై శిశువు తేలుతున్న సన్నివేశం దగ్గర సశేషం అని పడి ఉంటే బాగుండేదని అనిపించింది.నా అభిప్రాయం తప్పని రాజమౌళి నిరూపిస్తే మరీ మంచిది.