గోదావరి యాత్ర -1




నీటి ఆవశ్యకత దేహానికి ఎంత ముఖ్యమో, నాగరికత వికసించి ప్రజలు వర్థిల్లాలన్నా ఒక ప్రాంతానికి అంతే ముఖ్యం. నీరు పుష్కలంగా ఉన్న చోట పంటలు సమృద్ధిగా పండుతాయి. పంటలు సమృద్ధిగా పండిన చోట సుఖసంతోషాలు తాండవిస్తాయి. కడుపు నిండిన చోట కళాభివృద్ధికి కొదవేముంది?

భారతీయ సంస్కృతిలో నదీనదాల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ' గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ' అని శ్లోకం. సప్తనదులలో ఒకటైన గోదావరి నదిని, ఆ మహానది ఒడ్డున వెలసిన శ్రీరామచంద్రున్నిదర్శించుకోవాలన్న కోర్కె చాలాకాలంగా అలాగే ఉండిపోయింది. దాన్ని తీర్చుకొనే అవకాశం ఈ వేసవిలో దక్కింది .సాక్షాత్తూ గంగానదికి ప్రతిరూపమైన గోదావరినది గొప్పదనం గురుంచి అనేక విధాలుగా ముందే విని ఉన్నాను. నాటి ' మూగమనసులు ' నుంచి నేటి ' గుండెల్లో గోదారి ' వరకు అటు మన తెలుగు సినిమా దర్శకులు, ఇటు ఇతర మీడియా వాళ్ళు గోదావరి అందాలని యథాశక్తి దృశ్యరూపంలో బంధించి కనువిందు చేశారు. దీంతో గోదావరిని చూడాలన్న కోరిక మరింత బలపడింది . కావల్సిన సమాచారం సేకరించి వారం రోజుల ప్రణాళిక వేసుకున్నాం. రాజమండ్రిలో దిగి ముందు గోదావరి జిల్లాల్లోని ముఖ్యప్రదేశాలు సందర్శించి , ఒక రోజు విశ్రాంతి తీసుకొని తర్వాత తమ్ముడి కుటుంబంతో కలిసి భద్రాద్రి  రామున్ని దర్శించుకుందామని ప్లాన్ వేశాం. బెంగుళూరు నుంచి బయలుదేరి వారం రోజులలో ఒంటికి శ్రమ తెలియకుండా అన్ని ఊళ్ళూ చుట్టి రావాలంటే విమాన ప్రయాణమే శ్రేయస్కరం అనిపించింది. ఆఫీసులో ఎల్.టి.ఏ క్లెయిం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరికీ రానూపోను ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేశాను. 

రెక్కలిచ్చిన తల్లిదండ్రులతో కలిసి రెక్కలున్న లోహవిహంగంలో ప్రయాణించడం ఒక మధురమైన అనుభూతి. మా తల్లిదండ్రులకి, మా పాపకి అదే మొదటి విమానప్రయాణం. మా పాప అయితే  ఉత్సాహంతో గంతులు వేస్తునే ఉంది. విమానాశ్రయంలో ప్రవేశించాక చుట్టూ ఉన్న విమానాలను అబ్బురంగా చూడటం, టేకాఫ్, ల్యాండ్ అవుతున్న విమానాలను ఆసక్తితో గమనించటం, సీటులో కూర్చున్నాక ఎప్పుడెప్పుడా అని ఎదురుచుడటం, టేకాఫ్ అవుతున్నప్పుడు ఆ వేగానికి బెదిరిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, సర్ది చెప్పాక స్థిమితపడి కిటికిలోంచి ప్రక్కనే కనిపిస్తున్న మబ్బుడొంకలను , క్రింద లీలగా కనిపిస్తున్న ఊళ్ళను చూస్తూ ఆశ్చర్యపోవడం..ఇలా తన ప్రతిచర్యా అపురూపమైన క్షణాలే. ఇక అమ్మానాన్నల ముఖాల్లో ప్రస్ఫుటమైన భావావేశాలు చాలు జీవితాంతం పదిలపరచుకోడానికి.   

రాయలసీమ ఎండలకు రాళ్ళు కూడా ఆవిరైపోతాయని తెలుసు కానీ కోస్తా ఎండలకు కొండలైనా కరిగిపోతాయని కొత్తగా తెలిసింది. రాజమండ్రి విమానాశ్రయం నుంచి హోటల్‌కు కారులో వెళ్తూంటే వెచ్చటి గాలులు మొహంపై వాతలు పెట్టాయి .అసలే వేసవి. కాసేపు ఎండలో నిల్చుంటే చాలు గోదావరిలో స్నానం చేసినట్లే. దానికి తోడు విపరీతమైన విద్యుత్‌కోతలు. ఇంతటి ఉక్కబోతలో సామాన్యజనం జీవితాలు ఎలా వెళ్ళదీస్తున్నారో అర్థం కాలేదు. విద్యుత్ మీదే అధారపడి నడిచే జిరాక్స్‌సెంటర్లు, జ్యూస్‌షాపులు వగైరా వేసవిలో ఉచితంగా సర్వీస్ చేసినట్లే లెక్క. వచ్చే రాబడి జనరేటర్ డీజల్ ఖర్చులకే సరిపోదు. ఏప్రిల్ మాసాంతంలోనే రాజమండ్రి లాంటి పట్టణాలలో ఇంత అధ్వానంగా ఉంటే ఇక మారుమూలపల్లెల్లో పరిస్థితి ఊహించుకోవచ్చు. నేల నలుచెరగులా నీరున్నా విద్యుత్‌కు నోచుకోని దుస్థితికి కారణం నాయకులా? నిగ్గదీసి అడగలేని ప్రజలా ? 

ప్రకృతి ఎంత గొప్పదో ఆ సాయంత్రం పుష్కరఘాట్‌లో మళ్ళీ బోధపడింది.





సంధ్య వెలుగులో స్నానాలాచరిస్తూ కొందరు, బోటు షికారు చేస్తూ ఇంకొందరు, నీళ్ళలో ఆటలాడుకొంటూ మరికొందరు, ఘాట్ ప్రక్కనున్న 


పాత బ్రిడ్జినెక్కి అంత ఎత్తు నుంచి గోదావరిలో దూకి ఈతకొడుతూ కేరింతలు కొడుతూ ఇంకొందరు, ఒడ్డున నిల్చుని పిల్లల్ని పర్యవేక్షించే తల్లిలా పవిత్ర గోదావరి విగ్రహం, ఈ సందడికంతా కాస్త దూరంగా ముఖద్వారం వద్ద  సర్వం నాకు తెలుసన్నట్లు  తపస్సమాధిలోని పరమశివునిలా గంభీరంగా ఉన్న ఎత్తైన శివలింగం. పడవలో విహరిస్తున్నంతసేపు నాలో 'వేదంలా ఘోషించే 


గోదావరి '  మార్మ్రోగుతూనే ఉంది. తిరిగి వస్తూ రేవు గట్టునున్న గోదారమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించాను. నిజంగా ఈ గోదావరి నదే లేకపోతే వేసవిలో ఈ ప్రజలకు ఉపశాంతి ఎక్కడిది?


..(సశేషం)


3 comments

August 19, 2014 at 10:44 PM

ఏప్రిల్‌లో అనగా వెళ్ళి ఇప్పుడా వ్రాయడం! ఇన్నాళ్ళ బడలికా? :)). మీ వ్యాఖ్యానం బాగుందండీ..ఫొటోలు కూడానూ. గతవారం నేనూ అమ్మానాన్నగార్లతో కలిసి భద్రాద్రి రాముణ్ణి దర్శించుకుని వచ్చాను. మీ మాటల్లో మళ్ళీ చూడాలంటే ఎన్నాళ్ళు ఆగాలీ?
(సశేషం అన్నారు మరి)

Reply
August 20, 2014 at 12:40 AM

Baavundi..nice....even I wanted to plan a trip with my parents ...it would be real helpful if u can make a detailed post like where did u stay, what places to visit,,do's n dont's, etc...

Reply

@మానస గారు,

:-) పనుల ఒత్తిడి,కాస్త బద్ధకమూను. మీరు నన్ను మునగచెట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. మిగతా భాగాలు త్వరలోనే.

@నీరు గారు,

థాంక్సండి. మీరడిగిన వివరాలు మిగతా భాగాల్లో వివరించే ప్రయత్నం చేస్తాను.

Reply
Post a Comment