విషాదాంధ్ర



బాధతో హృదయం ద్రవిస్తోంది !

గుండెల్లో నిరంతరం మార్మ్రోగి ఉత్తేజాన్ని రగిలించిన మా తెలుగుతల్లికీ మల్లెపూదండ నేడు రెండు ముక్కలైపోయి మూగబోయింది.

దేశానికే అన్నం పెట్టిన ఆంధ్రమాతా అన్నపూర్ణా, ఇకనుంచి నువ్వు ఢీల్లీ నడివీధుల్లో  అడుక్కుతినాలి.

నీ పిల్లలం మేం, నిధుల మెతుకుల కోసం కాట్లకుక్కల్లా  కొట్లాడుకుంటూ 
వైరివైషమ్యాలతో కలకాలం  వర్థిల్లుతాం. 

దేశ రాజకీయాల్లో ఇదో దుర్దశ.  


ఒకప్పటి భారతంలో వలువలు విప్పింది దుశ్శాసనుడొక్కడే, సహకరించింది మిగిలిన దుష్టచతుష్టయమే . నేటి భారతంలో ప్రజాస్వామ్యం ఓ పాంచాలి, అడుగడుక్కీ ఓ దుశ్శాసనుడు, అందరూ కౌరవులే. పాండవులు, పరమాత్మ శ్రీ కృష్ణుడే లేనే లేరు.

గోరంతను కొండంతలు చేసి,  కేవలం స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, అనేకమంది అమాయకుల బలిదానం సాక్షిగా  కొన్ని శక్తులు నడిపిన ప్రత్యేకవాద  ఉద్యమం అనేక దిశలు, దశలు దాటి ఆఖరి మజిలీ చేరుకుంది . 

ఎనభైలకు ముందు తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే కానీ  ఆ తర్వాత జరగడానికి పెద్దగా ఆస్కారాలు లేవు. కొన్ని సంఘటనలు జరిగినా అవి రాష్ట్రాన్ని విభజించేటంత తీవ్రమైనవి కావని నా ప్రగాఢ విశ్వాసం . అసలు ఏ ప్రాతిపదిక మీద తెలంగాణ ఇచ్చారో ఇప్పటికీ చెప్పుకోలేని స్థితిలో కేంద్ర ప్రభుత్వముంది. వెనుకబాటుతనం దోపిడీ కారణాలైతే  ముందు రాయలసీమ వేరుపడాలి. సెంటిమెంటు ప్రకారమైతే అనేక ప్రాంతాల్లో వేరుపడాలన్న సెంటిమెంటుంది. అంతకు రెట్టింపు ప్రాంతాల్లో కలిసుండాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. హేతుబద్ధత లేని ఇటువంటి విభజనలు మునుముందు దేశాన్ని ఏ సంక్షోభంలోకి నెడతాయో కాలమే సమాధానం చెప్పాలి.

సరే ..కారణాలేవైనా  ఒక ప్రాంతాన్ని విభజిద్దామనుకున్నాక  రెండు ప్రాంతాల వారికీ సమన్యాయం చెయ్యడం కనీస ధర్మం.  అలా కాకుండా విభజన కోరుతున్న వారి విజ్ఞప్తులన్నీ అంగీకరించి, అవశేష ఆంధ్రప్రదేశ్ వాసుల ఆక్రోశాన్ని పెడచెవిన పెట్టి కేంద్రం బిల్లును రూపొందించటం ఘోరం.  రాహుల్‌గాంధీని ప్రధానిని చెయ్యాలన్న ఏకైక లక్ష్యంతో తెరాస  అజెండాకు  అనుగుణంగా అసంబద్ధమైన బిల్లును హడావిడిగా రూపొందించి దాన్నే పదికోట్ల ఆంధ్రులపై ఏకపక్షంగా రుద్దాలనుకోవటం నీచాతి నీచం. సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్న తెలంగాణావాదులు కూడా లోపభూయిష్టమైన బిల్లును అక్కున చేర్చుకుని, సీమాంధ్రులు ఎలా పోయినా పర్లేదు ఇప్పటికిప్పుడు రాష్ట్రం దక్కితే చాలన్నట్లు ప్రవర్తించటం విడ్డూరం.

తెలంగాణా వ్యవహారం ద్వారా నాకు కొన్ని విషయాలు బోధపడ్డాయి.


విష రాజకీయాలలో కాంగెస్ పార్టీని తలదన్నే పార్టీ భారతదేశంలో లేదు.


 కాంగ్రెస్ పెద్దలకు అసాధ్యమైనదేదీ లేదు. పుట్టినరోజు కానుకలుగా రాష్ట్రాలనే పంచగలరు . ఎవరినైనా లొంగదీసుకోగలరు, లొంగని వాళ్ళను జైళ్ళకు పంపించగలరు, చివరికి అదే దొంగలతో జట్టు కట్టనూగలరు. అందుకే ఇన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నా కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలసిపోకుండా ఇంకా సజీవంగా ఉంది.


నోరున్న పదిమంది కలిసి అవాస్తవాలు ప్రచారం చేసి, దాన్నే చరిత్రగా వక్రీకరించి వందమందిని మభ్యపెట్టో , భయపెట్టో , బాధపెట్టో ఏమైనా సాధించుకోవచ్చు. అడిగే నాథుడు లేడు.



తెలంగాణా నేతలకున్న తెగువ, పోరాట స్ఫూర్తి సీమాంధ్ర నాయకులలో ఏ కోశానా లేవు.

నిమ్మరసం తాగి నిద్రపోదాం అనుకున్న కచరా నడ్డి విరిచి ఉద్యమ వీధుల్లోకి లాక్కొచ్చారు. తమ మాట లక్ష్యపెట్టని ఎంపిలను, ఎమ్మెల్యేలను సామదానబేధదండోపాయాలతో తమదారికి తెచ్చుకున్నారు. చివరకు అనుకున్నది సాధించారు. సీమాంధ్రుల శైలి వేరు,మా శైలి వేరంటే ఇన్నాళ్ళూ ఏదో అనుకున్నా కానీ ఈ రోజు ఆ మాటల్లో వాస్తవం తెలుస్తోంది. ఆంధ్రులు ఆరంభశూరులన్నమాట మరోసారి రుజువయ్యింది. ఐక్యతకు మనకూ ఆమడ దూరం. ఎవడి దారి వాడిదేసమైక్య సమావేశాలు సీమాంధ్రలో నిర్వహించే బదులు తెలంగాణలో నిర్వహించాల్సింది. జనం నాడి తెలిసేది. బలం పెరిగి సమైక్య నినాదానికున్న సత్తా తెలిసేది. విడిపోదామనుకున్నది తెలంగాణా వాదులు కానీ సీమాంధ్రులు కాదు కదా. సీమాంధ్ర వీధుల్లో స్వరతంత్రులు తెగేలా ఘోషించి, శోషించి పడిపోతే సమైక్యశక్తి లోకానికెలా తెలుస్తుంది ? ఏ.పి.ఎంజివోలు ఇతర ప్రజా సంఘాల నేతలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు ?


కోట్లు ఖర్చుబెట్టి ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులని ఎన్నుకోవటం శుద్ధదండగ. 

క్యూలలో బారులుతీరి ఓపికతో ఓట్లు వేసే వయసుడిగిపోయిన అవ్వలారా, తాతలారా ! ఏమిటి మీ వెఱ్ఱి తాపత్రయం ? ఎవరిని ఉద్ధరిద్దామని మీ సంకల్పం? మీకు గానీ, మీ చేత  ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు కానీ  రాష్ట్రం మీద ఎటువంటి హక్కులూ లేవు. మెజారిటీ తగ్గిందనిపిస్తే పది సీట్ల కోసం  అధికారంలో ఉన్న ఏ జాతీయ పార్టీయైన రాష్ట్రాన్ని ముక్కలు చేయవచ్చు. ఈ  లోగా అమాయకంగా మా రాష్ట్రం, మా తల్లి, మా జాతి అని భ్రమలు పెట్టుకుని భావగీతాలు పాడుకుని మురిసిపోవడం మూర్ఖత్వం. కేంద్రం తలుచుకుంటే తల్లికి చెల్లిని, అమ్మమ్మని సృష్టించగలదు. 


జగన్ కాంగ్రెస్‌ల రుణానుబంధం 


 సీమాంధ్ర ఏ గంగలో కలిసినా పర్లేదన్నట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందంటే దానికి  మూలకారకుడు ఆర్థిక ఉగ్రవాది వైయస్‌జగనే. కాంగ్రెస్ ఎంపీలే నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్న నగ్నసత్యం ఇది. జగన్‌కున్న ఏకైక అజెండా ఎలాగైనా ముఖ్యమంత్రి అవటం .శవరాజకీయాలు, ఓదార్పు యాత్రలు చేసి అధిష్ఠానాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చటంతో సీమాంధ్రలో తన నూకలు చెల్లాయనే సత్యం కాంగ్రెస్ పార్టికీ బోధపడింది. నెంబర్‌గేంలో భాగంగా అటు బాబుకు,ఇటు జగన్‌కు చెక్‌పెట్టడానికి తెలంగాణను ముందుకు తీసుకొచ్చింది. సీమాంధ్ర ప్రజలు వినోదప్రియులు. జగన్ ద్వారా అది పుష్కలంగా లభిస్తూండటంతో అభిమానంతో కొంతమంది, ఆవేశంతో కొంతమంది ఓట్లవర్షం గుప్పించారు. విజయం తలకెక్కించిన ధీమాతో జగన్ తనకు తిరుగులేదనుకున్నాడు. జేడి లక్ష్మీనారాయణ రూపంలో అతని జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. కటకటాలపాలై ఏడాదికిపైగా ఊచలు లెక్కబెట్టేసరికి వాస్తవం కళ్ళముందు సాక్షాత్కరించింది. తనపై పెట్టిన కేసుల తీవ్రత తెలిసొచ్చి తప్పించుకొనే దారులు వెదకటం ప్రారంభించాడు. సోనియా ముంగిట సాష్టాంగప్రణామం చేసి త్వమేవ శరణం మమ అనటం తప్ప మరో గత్యంతరం లేకపోయింది. అందుకు తగ్గట్లుగానే విజయమ్మ పలుమార్లు ఢిల్లీయాత్రలు చేసి బేరసారాలు కుదుర్చుకున్నారు. సోనియానే హంతకురాలన్న నోటితోనే సార్వత్రిక ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని జాతీయ మీడియాలో ప్రకటనలు చేశారు. జగన్‌కు స్వేచ్ఛా జీవితం లభించింది.  ఆపైన అధిష్థానం ఆదేశాలకు అనుగుణంగా సమైక్యనినాదాన్ని తలకెత్తుకోవటం, రాజీనామాలు చెయ్యటం, సభలు సమావేశాలు నిర్వహించటం చకచకా జరిగిపోయాయి. డిగ్గీరాజా కనిపిస్తే చెంప పగలగొట్టాలని తొడగొట్టి హూంకరించిన మడమతిప్పని పోరాటయోధుడు జగన్, స్వయంగా పీకల్లోతు బురదలో కూరుకుపోయి మళ్ళీ మిగతావారిపై బురదజల్లే ఆయన ఎం.పీ లు పార్లమెంటులో కుక్కిన పేనుల్లాగ ఎందుకు పడి ఉన్నారో తెలుసుకోలేనంత తెలివితక్కువ దద్దమ్మలుకారు తెలుగు ప్రజలు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి శృంగభంగం కలిగించాలకున్న అసమ్మతినేతలకు ఎటువంటి సాయం చేయకుండా మొహం చాటేయ్యడమూ మర్చిపోదగింది కాదు. ఈ రోజు ఎంత బుకాయించినా నివురుగప్పిన నిప్పు దహించక మానదు .   


ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల సొమ్ముతో పోషింపబడుతున్న ప్రజాప్రతినిధులు ఆ ప్రజల భావోద్వేగాలకు కట్టుబడాల్సిన పని లేదు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. 


ప్రజలని నమ్ముకుంటే ఏమొస్తుంది బూడిద ! ఇవాళ గుర్తించుకుంటారు, రేపు మర్చిపోతారు. అదే అధిష్టానం కాళ్ళముందర  అతివినయంతో తోకూపితే రాజ్యసభ బిస్కెట్టో, గవర్నరుగిరీ బిర్యానియో దక్కుతుంది. 





సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఆత్మాభిమానం అంటూ ఏమీ లేదు. ఎప్పుడో అధినేత్రి ముంగిట్లో తాకట్టు పెట్టేశారు .

ఒకవైపు సీమాంధ్ర తగలబడుతున్నా, సోనియాగాంధీని ఒక్కమాటంటే శివాలెత్తినట్టు చిందులువేసే వీళ్ళని తిట్టాలంటే తెలుగు భాష సరిపోదు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే బిల్లును టేబుల్ఐటెంగా తెచ్చినప్పుడు, చదువుకోవడానికి రెండురోజుల సమయం కోరితే కుదరదన్నప్పుడు, ఆంటోనీ కమిటి పేరుతో ప్రజలను మభ్యపెట్టినప్పుడు, యుద్ధవిమానంలో ఆఘమేఘాల మీద బిల్లు తరలించినప్పుడు, ఇతర రాష్ట్రాల ఎం.పిలను ఉసిగొల్పి ముష్టిఘాతాలు కురిపించినప్పుడు, ప్రసారాలు నిలిపేసి బిల్లును నెగ్గించుకున్నప్పుడు ఆవేశంతో స్పందించిన సీమాంధ్ర నేతల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆస్తులు తగలబెట్టినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అధిష్టానాన్నే నమ్ముకుంటున్న బొత్స సత్యానారాయణ, ఇంత జరిగినా ఇంకా ఏదో వెలగబెట్టాలని పదవులు పట్టుకువేలాడుతున్న చిరంజీవి , ఆనం, రఘువీరా, డొక్కా లాంటి నేతల్ని చూస్తూంటే  జుగుప్స కలుగుతోంది.  నాటకమో నిజమో కిరణ్‌కుమార్ రెడ్డి తన ప్రయత్నమంటూ తను చేశాడు. బెనిఫిట్ ఆఫ్ డవుట్ కింద ప్రస్తుతానికి ఆయన్ని వదిలేద్దాం. మీరేం ఒరగబెట్టారని ఆయన్ని విమర్శిస్తున్నారు? యూ.టి వల్ల ఎవరికి ఉపయోగం ? సీమాంధ్రుల ఈగో చల్లారాలంటే యూ.టి చెయ్యాలా ? ఇంతకంటే మెరుగైన ప్రతిపాదనలేవీ లేవా మీ దగ్గర ? ముఖ్యమంత్రి పీఠం మీద మరీ ఇంత అలవిమాలిన మోజా ?


ఈ దేశంలో అధికారపక్షం ప్రతిపక్షం అంటూ రెండు లేవు. ఉన్నది ఒకే పక్షం. అది అధికారదాహ పక్షం.

ధికార దాహంతో విలువలకు తిలోదకాలు ఇచ్చి అడ్డమైన గడ్డీ కరచి   ' మేము ప్రత్యేకం ' అంటూ మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది. అనిల్ అంబానీ విషయంలో కాంగ్రేస్‌తో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయిన భాజపా, తెలంగాణ బిల్లు విషయంలో మరింత నిర్లజ్జగా పట్టుబడిపోయింది. విపక్ష  పార్టీ నాయకురాలై ఉండి సీమాంధ్రులు  భారతీయులే కానట్ట్లు వారి కోసం ఒక్క అమెండుమెంటూ ప్రతిపాదించకుండా తెలంగాణాకు తలూపి, 'నన్ను గుర్తించుకోండి ' అని అధికారపక్షాన్ని దేబరించటం దిగజారిన విలువలకు పరాకాష్ట. ప్రజాగ్రహం వెల్లువెత్తాక కూడా  'అన్యాయం జరిగిన మాట వాస్తవమే. వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి  మేం చూసుకుంటాం ' అని ఎటువంటి సిగ్గూ బిడియం లేకుండా మాట్లాడుతున్న వీళ్ళని చూస్తే సిగ్గుకే సిగ్గొస్తుందేమో. రాజ్యసభలో ఓ వైపు సుశీల్‌కుమార్ షిండే్ ప్రభృతులు మేం విసిరే ఎంగిలి మెతుకులు ఇవే ,ఇష్టముంటే తీసుకోండి లేకపోతే ఇదీ లేదన్నట్లు  అహంకరిస్తూంటే సీమాంధ్రుడై ఉండీ సాటి సీమాంధ్రుల మేలు కోసం పట్టుబడకుండా చేతులెత్తేసి సంధి చేసుకున్న వెంకయ్య గారూ, వృద్ధాప్యంతో మీకు పౌరుషం పోతే పోయింది, కనీసం  సీమాంధ్రుల పట్ల జాలి కుడా కలుగలేదా ? తృణమూల్ కాంగ్రెస్  పార్టీ సభ్యులకున్న శక్తి కూడా మీ పార్టీకి  లేదా ? ఉమ్మడి రాజధాని నిధులు ఒక రాష్ట్రానికే పంచటం ఎంత దుర్మార్గమని నోరు తెరిచి అడిగిన పాపాన పోయారా ? అణు ఒప్పందం నుంచి తెలంగాణ బిల్లు వరకు ప్రతీ బిల్లూ  లోపభూయిష్టమైనవే  అంటూ అన్నిటికీ సహకరించి బిల్లులు పాస్ చేయించిన  మీకూ, కాంగ్రెస్‌కు తేడా ఏంటి ? అభివృద్ధి పేరుతో చిన్న రాష్ట్రాలకు మద్దతు పలికే మీకు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గురుంచి మాట్లాడే హక్కు ఎక్కడిది ?


ప్రతిపక్షనాయకుడు మంచి పరిపాలనాదక్షుడైతే సరిపోదు అతనికి నాయకత్వ లక్షణాలూ ఉండాలి. 


తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రినని తంబూరా మీటే రెండుకళ్ళ సిద్ధాంతకర్త చంద్రబాబులో ఇదే లోపించింది.  తెలంగాణకు మద్దతిచ్చి  తెరాసతో పొత్తుపెట్టుకోవటం చారిత్రాత్మిక తప్పిదం.  పోనీ  మేధోపరమైన చర్చలు జరిపి, విడిపోతే తెలంగాణ, సీమాంధ్ర భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని లెక్కలు వేసి ఈ నిర్ణయం తీసుకున్నారా అంటే అదీ లేదు. కేవలం చిరంజీవి చీల్చబోయే ఓట్ల శాతాన్ని తగ్గించటానికి తెలంగాణకు జైకొట్టారు. విభజన సాకారమవుతున్న దశలో కుడా స్పష్టత లేకుండా రెండు కళ్ళు, రెండు కొడుకుల సిద్ధాంతాలతో ముందుకొచ్చారు. సమన్యాయమంటే ఏమిటని జాతీయ మీడియా ప్రశ్నిస్తే ఉక్కిరి బిక్కిరయ్యి నీళ్ళునమిలారు. మీకు నిజంగా సమన్యాయమే కావల్సి వస్తే 'తెలంగాణకు కావల్సినవివీ, సీమాంధ్రకు కావల్సినవివీ, అప్పుడే మేం విభజనకు అనుకూలం ' అని ముందే ఎందుకు  ధైర్యంగా చెప్పలేకపోయారు ? అలా చేసుంటే మీ క్రెడిబిలిటీ పెరిగేది కదా ? సమైక్యతే మీ నినాదమైతే తెలంగాణలో ఉంటూ ' సమైక్య రాష్ట్రానికే నా ఓటు ' అని నిబ్బరంగా చెప్పుకున్న తూర్పు జయప్రకాష్‌రెడ్డికున్న కన్విక్షన్ మీకు లోపించిందా ? ఓ వైపు తెరాస నాయకులు వాగ్ధాటితో విజృంభిస్తూ చెడుగుడు ఆడుకుంటూంటే  ఆంగ్లం ఒక్క ముక్కారాని, సి.ఎం.రమేశ్ లాంటి వాళ్ళని  రాజ్యసభకు, జాతీయ మీడియాలో చర్చావేదికలకు పంపి మీరు సాధించిందేమిటి, మరింత గందరగోళం సృష్టించటం, నవ్వులపాలవటం తప్ప. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి పీఠంపైనా, పదేళ్ళు ప్రతిపక్షంలోనూ కూర్చున్న మీనుంచి ఇంత అపరిపక్వత ఆశించలేదు. పుసుక్కుమని పాదయాత్రలకు బయలదేరేముందు ఒంటరిగా కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోండి. లోపం ఎక్కడుందో తెలుస్తుంది. 


సీమాంధ్రులకున్న కులపిచ్చి తెలంగాణావాదులకు లేదు


కమ్మ, కాపు, రెడ్డి..ఇలా టాగ్‌ని బట్టి టోకున ఓట్లు కుమ్మరించే సీమాంధ్రలో ఇంతకంటే గొప్ప నాయకులని ఊహించటం ప్రజల అవివేకం. మనకులపోడు అందలమెక్కితే అదే మనకు గర్వకారణం. వాడెంత అసమర్థుడైనా, అయోగ్యుడైనా ,లక్షల కోట్లు దిగమింగినా మనకక్కర్లేదు. 'ఎందుకింత రాద్ధాంతం ? మావోడు ఒక్కడే తిన్నాడా ? ఎవడు తినటం లేదు ఈ లోకంలో ? .ఎంత దుర్మార్గుడైనా మన కులపోన్ని మనం చాకిరేవు పెట్టి కులానికి చెడ్డపేరు తీసుకురాకూడదు. మనోడికి మనమే మద్దతివ్వకపోతే ఇంకెవరు మద్ధతిస్తారు ' . ఇదీ.. .మన ఆలోచనా ధోరణి. చదువురానివాడి దగ్గర్నుంచి చదువుకున్నవాడి వరకు ఇదే మైండ్‌సెట్. ఇది మారనంత వరకు అద్భుతాలు ఊహించటం గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిది.

ఏతావాతా తెలంగాణ పదేళ్ళు ,సీమాంధ్ర ముప్పైయేళ్ళు వెనక్కి నెట్టివేయబడ్డాయి !

సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోయిన సీమాంధ్రులారా ! ఇకనైనా కళ్ళు తెరిచి సరైన నాయకులని ఎన్నుకోండి !

సినిమా నటుల మీద వ్యామోహాన్ని సినిమాల వరకే పరిమితం చేయండి. మీకో నటుడు నచ్చితే అతని సినిమాను వందసార్లు చూడండి. దానివల్ల దేశానికొచ్చిన నష్టమేమీ లేదు. కానీ అతనికి లేనిపోని విశేషణాలు తగిలించి వ్యక్తి పూజలు చేయకండి. కులమతాల కంపునుంచి వెలుపలికి వచ్చి కొత్తలోకాన్ని సృష్టించడానికి శాయశక్తులా ప్రయత్నించండి. మిమ్మల్ని మళ్ళీ బుట్టలో వేసుకోవాలనే నేతలకు మీ కాళ్ళకు చెప్పులున్నాయనే వాస్తవం తెలియజేయండి. ఇప్పటి మీ నడవడిక మీదే మీ పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందన్న సత్యాన్ని మరచిపోకండి.


అంతవరకూ జై తెలుగు జాతి !






4 comments

Post a Comment

తెలుగు వెలుగులో నా కవిత ' ఏటిగట్టున '

తెలుగు వెలుగు ఫిబ్రవరి 14 సంచిక లో నా కవితను ప్రచురించినందుకు ఈనాడు యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. 

చదివిన వెంటనే  ఐజ,గద్వాల్ నుంచి ఈనాడు ఏజెంటొకరు ఫోన్ చేసి అభినందించారు. ఇది నాకొచ్చిన మొదటి ప్రతిస్పందన. తర్వాత తిరుపతి నుంచి ప్రధానోపాధ్యాయుడొకరు, తాడేపల్లిగూడెం నుంచి అడ్వకేటుగారొకరు ఫోన్ చేసి తమ సంతోషాన్ని తెలియజేశారు.  నాకిదో కొత్త అనుభూతి. వారికీ నా కృతజ్ఞతలు.



తెలుగు వెలుగుకు కవితను పంపించాక ప్రచురణకు ఎంపికయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ఏడాది పాటు నీరీక్షించవలసి వచ్చింది. ఏడాది కాలం ఎక్కువే. ఈలోగా ఆశలు వదిలేసుకొని కవితకు ఇంకొన్ని మార్పులు చేసి ఓ అంతర్జాల సాహిత్య వారపత్రికకు పంపాను.అక్కడా అమోదం పొందింది.  ' హమ్మయ్య ఇక  ప్రచురితమవబోతోంది ' అనుకుంటూండగా తెలుగు వెలుగు  నుంచి సంక్షిప్త సమాచారం ..' మీ కవిత ఫిబ్రవరి సంచికలో ప్రచురితమయ్యింది. వివరాలు పంపించండి ' అంటూ..


ఫిబ్రవరి సంచికలో చివరి మూడు వాక్యాలు ప్రచురించలేదు.

పూర్తి కవిత ఇక్కడ


టిగట్టున కూర్చున్నాను
కోటి ఊసులు వింటూ
ఈ ఏరు నా కన్నతల్లి
మమతానురాగాల పాలవెల్లి

ఊయలూగే శైశవంలో
ఉలిక్కిపడి గుక్కపడితే
చేలోఉన్న తండ్రి చెంగున చెంతకు చేరేలోగా
గలగలల లల్లాయి పాడి సుఖనిద్ర పుచ్చింది
జోల కాదది విమల గాంధర్వ డోల
మాతృహృదయానంద పారవశ్య హేల

ఉరకలేసే బాల్యంలో
కుప్పించి దుమికి కాళ్ళు తాటిస్తే
ఉప్పొంగిన ప్రేమై ఉవ్వెత్తున పైకిలేచి
అలల చేతులతో ఆశీర్వదించింది
ఈ ఏటి పొత్తిళ్ళలో కేరింతలు కొట్టి
సంబరపడిపోయారు సూరీడూ చంద్రుడు

అరకదున్నే ప్రాయంలో
మెరికనై వొళ్ళు వంచి
తూములు కట్టి తనువును తోడేస్తే
స్తన్యమిచ్చిన తల్లై సస్యాన్ని సజీవం చేసింది
పిండారబోసిన వెన్నెల్లో నిండార మెరిసే ఏటి తరగలు
మట్టి మనుషుల వెట్టి బ్రతుకుల్లో వెలిగించిన మతాబా దివ్వెలు

రెక్కలొచ్చీ  నేను
రేవు దాటెళ్ళబోతూంటే
అక్కరగా ఆవలిగట్టు చేర్చి బుంగమూతి పెట్టింది
సుళ్ళు తిరిగే దుఃఖాన్ని స్తబ్ధతలో దాచిపేట్టి సాగనంపింది  


ప్రవాసంలో ...రాలిన  ప్రతి చినుకులోనూ నా తల్లి పలకరింపు విన్నాను

ఆవాసం చేరి ఆశీస్సులు కోరబోతే అర్థమయ్యిందది పరామర్శ కాదు పరివేదనని !


 నాగరికత నేర్పిన ఏరు
నేడు నిరాదరణకు గురైన తల్లిలా నిర్వేదంగా ఉంది
ధనమదాంధులై మానవాధములు కొందరు
దురాక్రమణ చేసీ దోచుకుంటూంటే
బొమికల రేణువులు మిగిల్చుకొని బిక్కుబిక్కుమంటోంది
జీవవైవిధ్యం జాతర చేసిన చోట
శూన్యనైరాశ్యం తాండవిస్తూంటే
అశ్రుపూరిత నయనాలతో
ఎండిపోయిన ఏటిగుండెను తడిమాను
మూగబోయిన ఇసుకరేణువుల్లో మెల్లగా ఏదో ప్రతిస్పందన !
ఏదో సంచలనం ! !
ఉబికి జారిన నా కన్నీరు ఊటగా మారుతుందా ?
ఉద్రేక గంగాతరంగినియై నా తల్లి ఈ ఊరిని ముంచెత్తుతుందా ?
చరిత మరచిన ఈ జాతికి భవితనిస్తుందా ? ?



4 comments

Post a Comment