మా ఊరి వేసవి కబుర్లు


వేసవి అంటేనే పిల్లలకు ఆటవిడుపు బోలెడన్ని శెలవులు,బోల్డంత కబుర్లు బోలెడంత హంగామా.మా బాబాయిలు, వాళ్ళ పిల్లలు అందరూ పల్లెలోనే ఉండేవారు. దాంతో వార్షిక పరిక్షలైపోయిన దగ్గర్నుంచి ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని ఉబలాటంగా ఉండేది.

పొద్దున్నే చెఱువు గట్టుకు వెళ్ళడంతో దినచర్య మొదలయ్యేది (హి..హి..హి. ఆడువారి మాటలకు అర్థాలే వేరు లో వెంకటేష్ లా అన్నమాట). వస్తూ వస్తూ ఏ వేపపుల్లనో, కానుగ పుల్లనో నోట్లో ఆడిస్తూ,  ఆకాశం కడుపున అప్పుడే పుట్టిన పండటి ఎర్రటి సూరీన్ని  ముచ్చటపడి నీటి పొత్తిళ్ళలో పొదువుకున్న మా ఊరి చెఱువుని తిలకిస్తూ  , ఈ వార్తని వాడవాడలా వెల్లడించాలన్న ఉద్విగ్నతతో పంట పొలాల మీదుగా ఎగిరిపోతున్న కొంగలబారును పరికిస్తూ , చేదబావి గిలక చప్పుడు వింటూ మెల్లగా ఇంటికి చేరేవాళ్ళం. 

పెరట్లో స్నానాలు చేసి ఉపాహార వేళకు  పిల్లలందరం గిన్నెలు ముందేసుకు కూర్చుంటే నాయనమ్మో (నాన్నమ్మ) , పిన్నమ్మో (పిన్ని) వేడివేడిగా దోశెలు వడ్డించేది. దాన్లోకి రోట్లో చేసిన చట్నీ వేసుకొని ఆవురావురంటూ తినేవాళ్ళం. చట్నీలోకి చిన్న చిన్న ఉల్లిపాయాలు వాడేవాళ్ళు. ఇవి మాములు ఉల్లిపాయల కంటే చాలా చిన్నవిగా ఉన్నా అమోఘమైన రుచినిచ్చేవి. టిఫన్ల పట్ల మొహం మొత్తితే ఊరిబిండి (రోటితో చేసిన పచ్చడి) వేసుకుని చద్దన్నం తినేవాళ్ళం.

వీధిలో ఇతర పిల్లలు కనిపిస్తే జిల్ల - కోడి ఆడేవాళ్ళం (గోటీ - బిళ్ళ లేదా బిల్లంగోడు). లేకపోతే చిన్నాన్న పిల్లలతో కలిసి దగ్గర్లోని గుట్టల్లోకి పశువులను మేతకు తీసుకెళ్ళేవాళ్ళం. తలా కొన్ని పశువుల్ని పట్టుకొని, వాటిని అదిలిస్తూ గుట్టల్లోకి చేరేసరికి, ఊళ్ళో మాయమైన పిల్లగ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమయ్యేది. ఎవరి దగ్గరైనా బాలూ బ్యాటూ ఉంటే క్రికేట్ క్రీడకు చక చకా సన్నాహాలు జరిగిపోయేవి. గుట్టలకు దగ్గర్లోని చేలల్లో పశువులను వదిలేసి అక్కడే కాస్త చదునైన ప్రదేశంలో ఆటను మొదలుపెట్టేవాళ్ళం. మా ఊళ్ళో అంగళ్ళేమీ లేవు. కూతవేటు దూరంలో మరో పల్లె ఉంది. అక్కడ ఒకటి రెండు అంగళ్ళుండేవి. అక్కడి నుంచి రబ్బరు బాలును కొనుకొచ్చేవాళ్ళు. అక్కడ దొరకలేదంటే సైకిలెక్కి ఐదుమైళ్ళు  ప్రయాణించి పేట(అమ్మమ్మ వాళ్ళ ఊరు) లో బంతిని కొనుకొచ్చేవాళ్ళు. బ్యాటు మాత్రం చెక్కతో ఇంట్లోనే తయారు చేసుకొనేవాళ్ళు. బుర్ర మీసాలు సవరించుకుంటూ కొడవలితో చెక్కలు కొట్టి మా తాత ఎన్నో సార్లు బ్యాట్లను తయారు చేసి ఇచ్చేవాడు. అవి విరిగిపోతే ఎండిపోయిన కొబ్బరి మట్టలే మాకు దిక్కు. 

కాసేపటికి ఇంటిదగ్గర్నుంచి బాబాయో, పిన్నమ్మో ఎవరో ఒకరు పశువుల వద్దకు వచ్చేవాళ్ళు. మేం ఇంటికి తిరిగివెళ్తూ మా తోటలోని మామిడికాయలను కొన్ని తెంపుకొని, పొలంలోంచి పచ్చి మిరపకాయలను కోసుకొని వెళ్ళేవాళ్ళం. ఇంటికెళ్ళి రోట్లో మామిడికాయలు, పచ్చి మిరప, రాళ్ళ ఉప్పు వేసి దంచి, ఆ దబ్బలును నోట్లో వేసుకుంటుంటే అద్భుతంగా ఉండేది. దట్టించిన కారం కళ్ళలో నీళ్ళు తెప్పిస్తూంటే దాన్నుంచి తప్పించుకోవటానికి చెంబులకొద్దీ నీళ్ళు తాగేవాళ్ళం. అప్పటికీ తగ్గేది కాదు. ఏ పంచదారో, బెల్లం ముక్కో నోట్లో వేసుకొన్నాక కాస్త తెరిపిన పడ్డట్లయ్యేది.

మధ్యహ్నాలు బెండుముక్కలు కట్టుకొని చెఱువులోకో బావిలోకో భయం భయంగా దిగేవాళ్ళం. లోపలికి వెళ్ళే ధైర్యం లేదు కాబట్టి గట్టు మీద చేతులుంచి నీళ్ళలో కాళ్ళు తపతపలాడించేవాళ్ళం. చెఱువు మొరవబోతే (పొంగితే. ఎప్పుడో గానీ మా ఊరి చెఱువు పొంగదు. పొంగితే మా సంబరానికి అంతుండేది కాదు ) చిన్న చిన్న కాలువల్లోకి నీళ్ళు వచ్చేవి. వాటిలో దిగి నడుము లోతు నీళ్ళలో కూర్చొని ఈత నేర్చుకోటానికి నానా తంటాలు పడేవాళ్ళం. కొన్ని సార్లు కాలువల్లోంచి పంటలకు గూడలేసేవాళ్ళు. మేమూ ఓ చెయ్యి వేసి సంతోషపడి పోయేవాళ్ళం.

 తగినన్ని నీళ్ళు లేకపోతే ఇంటిపట్టునే ఉండి పెద్దలు పిల్లలు జట్లు జట్లుగా విడిపోయి సరదాగా దాయాలు ( పాచికలు ) లేదా రాజు-రాణీ-దొంగ-పోలీస్ లాంటి ఆటలు ఆడేవాళ్ళం. వేసవిలోనే గానుగ ఆడేవాళ్ళు. అలాంటప్పుడు మా మకాం ఇక చెఱుకు తోటల్లోనే. ఓ వైపు మేం నోట్లో చెఱుకులు పరపరలాడిస్తూ మరో వైపు ఎద్దులు గానుగ యంత్రాన్ని తిప్పుతూంటే బెల్లం తయారు చేసే విధానాన్ని ఆసక్తిగా గమనించేవాళ్ళం ఎండలు మండిపోతూంటే మా వాళ్ళు కొబ్బరిబోండాలు కొట్టేవాళ్ళు. అవి తాగి సేదతీరేవాళ్ళం. 

గోధూళి వేళ ఊళ్ళో పెద్దలంతా మా ఊరి రాముడి దేవళం (చిన్న గుడి) ముందున్న కానుగ చెట్టు క్రింద సమావేశమయ్యేవాళ్ళు. అదే మాకు రచ్చబండ. పలకరింపులు పరాచికాలు బాగా ఉండేవి. దేవళం ప్రక్కనే మా తాతయ్య ఇల్లు కాబట్టి మేము అక్కడే పోగయ్యేవాళ్ళం. పట్నం నుంచి వచ్చిన మమ్మల్ని చూసి ' ఓరొరే ! మీరు పెద్దోడి కొడుకులు కూతుర్లా ' అని ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. ఓ సారి గుడి ముందు చిన్న తెరకట్టి లవకుశ సినిమా వేశారు. అప్పుడు నేను చాలా చిన్నవాన్ని అన్నమాట. చాలా గమ్మత్తుగా అనిపించింది.

రాత్రిళ్ళు వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవాళ్ళం. అదయ్యాక మళ్ళీ ఆటలు. అలసిపోయాక పిల్లందరం మిద్దే పైనే చాపలు, దిండ్లు పరుచుకొనేవాళ్ళం. మాకు తోడుగా కొంత మంది పెద్దవాళ్ళు వచ్చి పడుకొనేవాళ్ళు. రాత్రి పూట వెన్నెల్లో వెల్లకిల్లా పడుకొని , చల్లగా గాలి వీస్తూంటే, ఆ గాలికి కొబ్బరాకులు ఊగుతూంటే, ఆకాశంలో మబ్బుల వెనుక నక్కి తారలతో దాగుడుమూతలాడుతున్న చంద్రున్ని చూస్తూ తన్మయత్వంతో మెల్లగా నిద్రలోకి జారుకుని ఆ రోజుకి వీడ్కోలు పలికేవాళ్ళం.


వేసవి శెలవుల్లో మరో ముఖ్యమైన అంకం మహాభారత ఉత్సవాలు. మా పల్లెకు నాలుగు మైళ్ళ దూరంలో రహదారిని ఆనుకొని ఒ పల్లెటూరుంది. అక్కడ ప్రతి వేసవిలోనూ పద్దెనిమిది రోజుల పాటూ మహభారత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.  ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా కలిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని ఓ నమ్మకం. వరుసగా ఐదేళ్ళు అనావృష్టి తాండవిచ్చినప్పుడూ ఈ విశ్వాసం చెక్కుచెదరలేదు .

ఆ ఊళ్ళో ద్రౌపది సమేత ధర్మరాజ దేవాలయం ఉంది. పద్దెనిమిది రోజులు సాగిన మహాభారత యుద్ధానికి  సంకేతంగా అన్నట్లు పద్దెనిమిది రోజుల పాటూ అక్కడ మధ్యాహ్నాలు హరికథా కాలక్షేపం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పేరొందిన హరికథా విద్వాంసులు  భుక్తాయాసంలో సైతం అలవోకగా పద్యాలు పాడుతూంటే, వాద్యగాళ్ళు తాళయుక్తంగా హార్మోనియం, తబలా, మ్రోగిస్తూంటే ముసలీ ముతకా, పిల్లా జెల్లా ఆలయ మండపంలో కూర్చొని ఒళ్ళంతా చెవులు చేసుకొని మంచిని వంటబట్టించుకొనే ప్రయత్నం చేసేవాళ్ళు.

హరికథలో వివరించిన ఘట్టాలనే కళాకారులు రాత్రిళ్ళు స్టేజి మీద ప్రదర్శించేవాళ్ళు. ఈ ప్రదర్శన రాత్రంతా కొనసాగేది . చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు బళ్ళు కట్టుకొని మరీ వచ్చేవాళ్ళు. చాపలు దుప్పట్లు తెచ్చుకొని వేదిక ముందున్న విశాలమైన మైదానంలో పరుచుకొని వీక్షణకు ఉపక్రమించేవాళ్ళు. తీరిక చిక్కిన ఆడవాళ్ళు తాంబూలం నములుతూ ఇరుగమ్మ పొరుగమ్మలతో కబుర్లలో పడితే చిన్న పిల్లలు మైదానం నలు వైపుల పరుగులు తీస్తూ ఆటలు ఆడేవాళ్ళు. ఈ గోలలో తొమ్మిది-పది గంటల మధ్య ప్రదర్శన మొదలయ్యేది. ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు.. ఇలా పాత్రలు ప్రవేశించేవి. నడిరాత్రి నిద్రలో జోగుతున్న ప్రజలని మేల్కొల్పటానికి మేళతాళాలతో  హాస్యగాడు రంగప్రవేశం చేసేవాడు. అతను రాగానే మళ్ళీ కలకలం మొదలయ్యేది. రాగయుక్తంగా  పద్యాలు పాడి మంచి నటన కనబరిచిన నటులకు (సాధారణంగా ఈ ట్రూపులో అంతా మగవాళ్ళే ఉంటారు) నోట్ల దండలతో తక్షణ గుర్తింపు లభించేది. ఒకవైపు ఈ తతంగం సాగుతూంటే  మరో వైపు మైదానం దగ్గర్లో వెలసిన తాత్కాలిక దుకాణాల వద్ద తినుబండారాలు , ఆట బొమ్మల వ్యాపారం జోరుగా సాగేది. తాగుబోతుల కోలాహలం చెప్పనక్కర్లేదు . బకాసుర వధ, వస్త్రాపహరణ, అర్జున తపస్మాను, ఉత్తర గోగ్రహణం, దుర్యోధన వధ ప్రదర్శించే రోజులలో ఇసుక వేస్తే నేలరాలనంత జనం పోగయ్యేవారు. ఇప్పుడంటే లెక్కలేనన్ని ఛానలున్నాయి కానీ దూరదర్శన్ తప్ప దిక్కులేని రోజుల్లో ప్రజలకు అదే పెద్ద వినోదం.  

ప్రదర్శన చూడాలనుకున్న రోజు రాత్రి పిల్లలందరం జట్టుగా ఏర్పడి బయలుదేరేవాళ్ళం. దారిలో మమ్మల్ని మేము కాపాడుకోవటానికన్నట్లు చేతిలో టార్చిలైటు, చంకలో చాపలు, చేతుల్లో కఱ్ఱలు పట్టుకోని గట్టిగా పాటలు పద్యాలు పాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం.స్వాతంత్ర్యం వచ్చిన అరవై ఏళ్ళకు మా ఊరికి తారురోడ్డొచ్చింది కానీ ఒకప్పుడది రాళ్ళు రప్పలతో నిండిన మట్టిబాటే. ప్రదర్శన జరుగుతూండగా నిద్రోస్తే పక్కనే ఉన్న మా పిన్ని వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ పడుకొనేవాళ్ళం. 

అమ్మమ్మ వాళ్ళింట్లో పెద్దగా పొద్దుపోయేది కాదు. నా కంటే కేవలం సంవత్సరమన్నర పెద్దాడైనా, మా మామ మాతో పెద్దగా ఆడేవాడు కాదు. మరదళ్ళకు కాస్త తీరిక దొరికితే అచ్చంగాయలు, నేల - బండ (ఆంగ్లంలో మడ్ అండ్ స్టోన్) లాంటి ఆటలు ఆడేవాళ్ళు. 

ఆ ఊళ్ళో ఒక సినిమా టెంటుండేది. ఒక పొడవాటి కొట్టంలో తెల్లటి వస్త్రాన్ని కట్టి ప్రొజెక్టరులోంచి సినిమాని తెరపైకి ప్రసరింపజేసేవాళ్ళు. నేల క్లాసు, బెంచి అని రెండు తరగతులుండేవి. ఒక బండిలో పోస్టర్లు వేసుకొని చుట్టు పక్కల గ్రామాలకు వెళ్ళి వాల్‌పోస్టర్లు అంటించి ప్రచారం చేసి వచ్చేవాళ్ళు. సాయంత్రం ముస్లింల నమాజు పూర్తయ్యాక ప్రదర్శన ప్రారంభమయ్యేది. జనంతో హాలు కిటకిటలాడిపొయ్యేది. ఎక్కువగా ఎంటివోడు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వేసేవాళ్ళు. అన్నీ పాతసినిమాలే. కొండవీటి సింహం, అగ్నిపర్వతం, అడవి దొంగ, సాహస సామ్రాట్ లాంటివన్నమాట. మసాలా బొరుగులు (మరమరాలు) తింటూ పల్లెటూరి జనం మధ్య కూర్చొని వాళ్ళ ఈలలు కేకలు, వ్యాఖ్యానాల మధ్య సినిమా చూట్టం మంచి అనుభూతి. రాత్రి పూట సినిమా కార్యక్రమం లేకపోతే మా అమ్మమ్మే మా పక్కన పడుకొని పాత పౌరాణిక తెలుగు సినిమాల కథలు (శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణపాండవీయం లాంటివి) చెప్పేది. అది వింటూ నిద్రపోయేవాళ్ళం.


ఆ రోజులన్ని ఇప్పుడు తలచుకొంటూంటే అదొక స్వర్ణయుగంలా అనిపిస్తుంది. బాల్యం బాల్యమే.


5 comments

Post a Comment