రుద్రవీణ





నేను సైతం విశ్వవీణపు తంత్రినై మూర్ఛనలు పోతాను
నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక నిచ్చి మ్రోశాను
నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను

                                     -మహకవి శ్రీశ్రీ , జయభేరి.

వయసుడిగిపోయి చిక్కిశల్యమైన ఒక అంధురాలు, కోనేటి మెట్ల పై కూర్చొని బిచ్చమెత్తుకుంటోంది.

అటుగా వెళ్తున్న బ్రాహ్మణుడొకడు దయతలచి ' ఇదిగో అరటిపండు ' అంటూ ఒక అరటిపండును ఆమె ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంధురాలు దాన్ని అందుకోబోతే అది జారి క్రింది మెట్ల పై పడిపోయింది. చేతిదాకా వచ్చిన తిండి నోటి దాకా రాకపోయేసరికి అంధురాలు ఆందోళన చెంది, శరీరాన్ని మరింత వంచి  పటుత్వం లేని చేతులతో తడుముకుంటూ వెదుకుతోంది.

మంత్ర జపం చేసుకుంటూ  వెళ్తున్న పిల్లవాడొకడు ఆ దీనావస్థను చూశాడు. శిలలా బిగుసుకుపోయి చూస్తూన్నాడు కానీ సాయం చెయ్యాలన్న ఆలోచన కలుగలేదు.

దూరం నుంచి ఈ తతంగాన్నంతా కాసేపు గమనించిన తత్వాలు పాడుకొనే వృద్ధుడొకడు పైకిలేచి అరటిపండును అంధురాలికి అందజేశాడు. వెళ్ళిపోతున్న పిల్లవాన్ని ఆపి కళ్ళముందే అవస్థపడుతున్న అంధురాలికి సాయం చెయ్యలేదేమని ప్రశ్నించాడు. భగవంతుడు మనకిచ్చిన రెండు చేతులలో ఒకటి మనకి ఇంకొకటి పొరుగువాడి చేయుతకి  అని బోధించాడు.

ఇది ఉపోద్ఘాతం !

                *                                             *          

పచ్చని తివాచీ పరిచినట్టున ఓ అచ్చమైన పల్లెటూళ్ళోకి ఎక్కడినుంచో ఒక తెల్లటి అంబాసిడర్ కారోచ్చి ఆగింది. కార్లోంచి ఎం.పి గారి వ్యక్తిగత సహాయకుడు హడావుడిగా క్రిందకి దిగి చెట్టు క్రింద కూర్చోనున్న ఓ వ్యక్తిని
" ఏవయ్యా ! ఇట్రావయ్య " అంటూ పిలిచాడు.
ఆ వ్యక్తి పరుగులాంటి నడకతో వచ్చి నమస్కరించి వినయంగా చేతులు కట్టుకున్నాడు.
" ఏ ఊరిది ? "
" రామాపురమండి "
" అవునూ, ఈ ఊర్లో పోలీస్‌స్టేషన్ ఎక్కడుంది? ఫోన్ చేయ్యాలి. కార్లో ఎం.పి గారున్నారు".
ఆ వ్యక్తి కారువేపు వినయంగా వంగి నమస్కరించి " ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ లేదండి " అన్నాడు.
" పోనీ ఈ చుట్టుపక్కలెక్కడైనా పోలీస్ స్టేషన్లున్నాయా ? "
" పాతిక మైళ్ళ దూరంలో పోలీస్ స్టేషన్ ఉండదండి ."
" ఏమిటి ?! పోలీస్ స్టేషనే లేదా ? అయితే ఇది బాగా వెనుకబడిన ప్రాంతంలా ఉందే ! "
" కాదండి. కాదండి. ఈ ఊళ్ళో ఏదైనా నేరాలు జరిగితేనే కదండి పోలీస్ ‌స్టేషన్లు కావాలి. అట్టాంటివన్నీ ఇక్కడ జరగవండి."
అప్పటిదాకా వింటూన్న ఎం.పి గారు  విస్మయాన్ని ఆపుకోలేక కార్లోంచి  క్రిందకు దిగి పల్లెటూరి వ్యక్తిని దగ్గరికి పిలిచారు .
" ఈ ఊర్లో నేరాలే జరగవా? "
" జరగవండయ్యా "
ఇంతలో ఎం.పి గారి మరో సహాయకుడు కలుగజేసుకొని  " పోనీ టౌనుకెళ్ళి ఫోను చేసుకుందాం " అని సలహా ఇచ్చాడు. ఎం.పి గారికి అది రుచించలేదు .
" నువ్వండవయ్యా. ఈ ఊరు వరస చూస్తూంటే చాలా విచిత్రంగా ఉంది."
" ఇదే కాదండి .ఇట్టాంటి చిత్రాలు శానా ఉన్నాయండి మా ఊళ్ళో  "

వీళ్ళిలా మాట్లాడుతుండగానే ప్రక్కన  కలకలం రేగింది.  మద్యం సీసాలో ఎం.పి గారి సహాయకుడు తెచ్చుకున్న మంచి నీళ్ళను మద్యం గా భావించిన జనం ఆ సీసాని ఒడిసిపట్టుకొని ఊళ్ళో మద్యం తాగడానికి వీళ్ళేదని, ఎవరినీ తాగనీయమని భీష్మించారు. మద్యం కాదు నీళ్ళేనని రుజువు చేశాక పంతం విడిచిపెట్టి వెళ్ళిపోయారు.

ఎం.పి గారు ఊరివాళ్ళతో కలిసి నడుస్తూ
" ఈ ఊళ్ళో పోలీస్ స్టేషనే లేదట. ఎవ్వరూ నేరాలే చెయ్యరట. ఎవ్వరూ తాగరట. ఎవ్వరినీ తాగించరట. అయితే పార్టీ బాగానే పనిచేస్తోందనమాట. ఈ ఊళ్ళో ఏ పార్టీ బాగా స్ట్రాంగ్‌గా ఉందయ్యా ? కాంగ్రెస్సా ? " అని ఆడిగాడు.
"కాదండి."
" తెలుగుదేశమా ?"
" కాదండి."
" జనతా నా ? "
" కాదండి. ఇండిపెండెంటండి "
" ఇండిపెండెంటా? "
" అవునండి. అందరు చినబాబు పార్టీయేనండి "
" ఎవ్వరయ్యా చినబాబు ? ".
శిథిలావస్థలో ఉన్న ఆలయ గోపురంపై పిచ్చి మొక్కలు పీకేస్తున్న ఒక వ్యక్తిని చూపించి
" ఆరేనండి చినబాబు గారు " అన్నాడు ఊరతను .
"దేవుడి  కన్నా ఎత్తులో నిలబడ్డాడే " ఆశ్చర్యపోయారు ఎం.పి గారు.
" మా ఊరికి ఆయనే దేవుడండి "

 సమాజమే దేవాలయం అనుకుంటే అందులోని రుగ్మతలను ఏరిపారేసేవాడు దేవుడే ! ఇది ప్రారంభం.
                                                           *                                                     * 

సినిమాలు రెండు రకాలు - మనస్సుకు హత్తుకునేవి, మదిని మెలిపెట్టేవి.

రుద్రవీణ మొదటి కోవకు చెందిన సినిమా. చిరంజీవి, బాలచందర్, ఇళయరాజా, గణేష్‌పాత్రో, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి హేమాహేమీల కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ . మహరాష్ట్రలో రాలెగావ్‌సిద్ధి అనే గ్రామాన్ని సంస్కరించిన అన్నాహజారేని, ఆంధ్రదేశంలో ఒక ఐ.ఏ.యస్ అఫీసర్ సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని అల్లుకున్న కథ. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడైన బిలహరి గణపతిశాస్త్రి తనయుడిగా జన్మించి, ఓ వైపు సాంప్రదాయరీతులలో సంగీతాన్ని అభ్యసిస్తూ, మరో వేపు సమాజంలోని అపసవ్య ధోరణులకు ఆవేదన చెందుతూ, అటు తండ్రిని ధిక్కరించలేక, ఇటు అంతఃకల్లోలాన్ని అణుచుకోలేక సతమతమవుతూ చివరికి తెగించి తిరుగుబాటు చేసి నవసమాజ నిర్మాణం వేపు అడుగులు వేసి, సామజిక చైతన్యం తీసుకొచ్చిన యువకుడి చరిత్రే  రుద్రవీణ.  

ఉదాత్తమైన కథకు ఊపిరిపోయాలంటే అందుకు తగ్గ నటీనటులు కుదరాలి.  అటువంటి వాళ్ళందరూ ఈ చిత్రానికి సరిగ్గా అమరిపోయి పదికాలాల పాటూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే చిత్రానికి ప్రాణప్రతిష్ట చేశారు. సాంప్రదాయాన్ని సంగీతాన్ని రెండు కళ్ళుగా భావించే తండ్రిగా జెమినీ గణేశన్, సంఘంలో మార్పు కోసం నిత్యం రగిలిపోయే నిప్పుకణిక లాంటి యువకుడిగా చిరంజీవి పోటీపడి నటించారు. వీరిద్దరి కలయికలో వచ్చే సన్నివేశాల్లో సంభాషణలు, భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. చిరంజీవి స్వతహాగా చక్కని నటుడు. బాలచందర్ లాంటి మేటి దర్శకుల చేతిలో పడితే ఇక చెప్పేదేముంది. సంగీత సాధన చేస్తూ దీనురాలి ఆకలి కేకలు విని ఏకాగ్రత చెదిరే సన్నివేశాల్లో ,' అలగా జనానికీ ఆటపాటలు కావాలి నాన్నా'  అని వాదిస్తున్నప్పుడు ,'  మానవసేవ ద్రోహమా ? ' అని తండ్రిని ధిక్కరించి కచేరిలో పాడినప్పుడు, ఎలక్ట్రిషియన్ చావుకు కారణమైనప్పుడు,  ' నేను మీ కొడుకు మాత్రమే కాదు , మీ శిష్యున్ని, పెద్ద అభిమానిని కూడా, ఇంతగా అభిమానించే ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత చక్రవర్తి బిలహరి గణపతి శాస్త్రి గారు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సంగీత పంజరంలో బందీ కావటమే నాకు నచ్చలేదు. అదే నన్ను బాధిస్తోందని ' అని బాధపడినప్పుడు, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఊరిబాగు కోసం వివాహాన్ని రద్దు చేసుకొనే సన్నివేశాల్లో సూర్యనారాయణ శాస్త్రి కనిపిస్తాడు కానీ చిరంజీవి కనిపించడు.

శోభన కళ్ళతోనే నటించిన సన్నివేశాలు రెండు. అంటరానిదానివి కదూ అని ప్రశ్నింపబడినప్పుడు ఒకసారి, వివాహాన్ని త్యజించబోతూ వరుడైన కథానాయకుడు తన అభిప్రాయం కోరినప్పుడు మరోసారి, కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికించి శభాషనిపించుకుంది. 

బాలచందర్ దర్శకత్వ ప్రతిభ గురుంచి చెప్పాలంటే మరో టపా వ్రాయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ' ఎవరిమాట విన్నావో, రావో, ఇందు లేవో, భళి, భళి  ' అన్న త్యాగరాజ కృతిని సందర్భానుసారంగా వాడుకున్నారు దర్శకుడు. ఎవరి సలహా విని నా వద్దకు రాకుండా ఉన్నావో, అసలున్నావో లేవో అంటూ త్యాగరాజు శ్రీరామున్ని విమర్శిస్తూ అల్లిన కృతి అది. ఆ కృతిని తండ్రితో కలిసి సాధన చేస్తూంటే బిచ్చగత్తె అన్నం కోసం అరుస్తూంటుంది. ఏకాగ్రత కోల్పోయిన సూర్యాన్ని తండ్రి కోప్పడి సంగీతం మీదే మనస్సు లగ్నం చెయ్యమంటాడు. ఇక్కడ బిచ్చగత్తె (సమాజం) అన్నం (సాయం) కోసం ప్రార్థిస్తోంది . కథానాయకుడికి సమాజ సేవ చెయ్యాలనే తపన ఉంది. కానీ తండ్రి అడ్డుపడుతూ సలహాలిస్తున్నాడు. ఇలా త్యాగరాజ కృతిని అటు సంగీతానికి ఇటు సన్నివేశానికి తగ్గట్టుగా వాడుకోవడం డర్శకుని ప్రతిభా పాటవాన్ని తేటతెల్లం చేస్తోంది. అలాగే, ప్రమాదంలో గాయపడి చావుబ్రతుకుల్లో ఉన్న విద్యుత్‌కార్మికున్ని, కథానాయకుడు కారులో కచేరీకి వెళ్తూ చూసే సన్నివేశం నాకు గౌతమ బుద్ధుని కథను జ్ఞప్తికి తెచ్చింది.

గణేష్‌పాత్రో సంభాషణలు ఈ చిత్రానికి ఆయువుపట్టు. ప్రటి మాటా శక్తివంతంగా ఉంది. కొన్ని సంభాషణలిక్కడ పొందుపరిచాను.

ఆకలి కేకలు నిన్నాకట్టుకోడానికి అవేమన్నా ఆలాపనలా ఆవృత్తాలా, అపశృతులు.
      దీనుల వేదనని అపశృతులనకండి నాన్నా.
ముష్టిదాని అరుపు నీకు మృష్టాన్నభోజనంలా ఉంటే సంగీతామృతం నీ జిహ్వకు సరిపడదు.
    గోదావరిలో  గొట్టికాలువ కలిస్తే అది సంగమం కాదు రా సంకరమే. 

   అమ్మనే  అమ్ముకు తిరిగేవాడికి పుట్టగతులుండవు. అది అపచారం
  కాదురా వ్యభిచారం.
నేను అమ్మను అమ్ముకునేవాన్ని కాదు నాన్నా. అమ్మ అందరికీ అమ్మే అని నమ్మినవాన్ని.
     మన గుమ్మంలోకొచ్చి శుభవార్త చెప్పినవారికి దారి ఖర్చులివ్వటం
     ఆనవాయితీ.
ఆయన నోటికే చిల్లుపడిందనుకున్నాను. నోటుకీ చిల్లు పడింది. చిల్లు పడినవి చెల్లవండి.
సీతారామశాస్త్రి సృజించిన సిరివెన్నలలో సాహితీప్రియులందరూ తేలి వివశులయ్యారు. బంగారానికి తావి అబ్బినట్టు ఇళయరాజా సంగీతం, కే.జే.జేసుదాస్, బాలు, చిత్ర ల గానమాధుర్యం తోడై ఈ చిత్రంలోని పాటలని అజరామరం చేసాయి. నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
తరలిరాదా తనే వసంతం
తన దరికి రాని వనాల కోసం
గగనాల దాకా అల సాగకుంటే
మేఘాల రాగం ఇల చేరుకోదా


వెన్నెల దీపం కొందరిదా
అడవికి సైతం వెలుగు కదా
బ్రతుకున లేని శృతి కలదా
ఎద సడి లోనే లయ లేదా

కూసే కోయిల పోతే కాలం ఆగిందా
పారే ఏరే పాడే మరో పదం రాదా
మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా


ఆకాశం తాకే ఏ నేలకైనా ఆధారం లేదా ఈ నేలలో
పుడమిని చూడని కన్ను
నడపదు ముందుకు నిన్ను
నిరసన చూపకు నువ్వు ఏ నాటికీ
పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండ
ఏ హాయీ రాదోయి నీ వైపు మరువకు


శీతాకాలంలో ఏ కోయిలైనా
రాగం తీసేనా ఏకాకిలా
మురిసే పువ్వులు లేక
విరిసే నవ్వులు లేక
మురళికి చెందని గానం సాగించునా
పదుగురి సౌఖ్యం పండే దినమే 
పండుగ కాదా

ఆనాడు వాసంత గీతాలు పలుకును

కరుణను మరపించేదా  చదువు సంస్కారం అంటే
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే


లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని (కథానాయుక పేరు లలిత)
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జలధిని

తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం


ఈ పాటలన్నీ ఒక ఎత్తైతే మహాకవి శ్రీశ్రీ పదాలను ప్రేరణగా తీసుకొని వ్రాసిన  ' చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది ' పాట మరొక ఎత్తు. సంగీతం నేర్చుకుంటూ వచ్చీరానీ సంగీత జ్ఞానంతో ఈ పాటను ఎన్ని సార్లు పాడుకొన్నానో గుర్తులేదు. ఎప్పుడు విన్నా ఏదో తెలియని అనుభూతి.
ఒక ముసలివాడు ఒంటరిగా ఉలి చేతబట్టి కొండను తొలచి తన ఊరికి  రహదారిని నిర్మించాడన్న వార్త విన్నప్పుడో, చిన్న మొక్క మొలవని ప్రాంతంలో ఒక వ్యక్తి, అన్నీ తానే అయ్యి, ముప్పైఏళ్ళు కష్టపడి 1360 ఎకరాల్లో అడవిని సృష్టించాడని తెలిసినప్పుడో కలిగే స్పందన.
 అనిర్వచనీయమైన ఆవేదనతో మనస్సంతా నిండిపోయి ఆ ట్రాన్స్‌లో నుండి రావటానికి కొంత సమయం పడుతుంది. సంఘజీవిగా నా బాధ్యతను గుర్తుచేస్తుంది. నా కంటే చిన్నవాళ్ళు, నేనెరిగిన వాళ్ళు సమాజానికి తమ వంతుగా ఎంతో చేస్తున్నారు.

వాళ్ళు చేసేదానిలో పదో వంతు చేసినా నా జన్మ ధన్యమైనట్లే.


*                                                              *

ఈ సినిమాని తమిళంలో పునర్నిర్మించారు. సీత, కమలహాసన్ నాయికానాయకులు. తమిళ శైలికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అన్నా చెల్లెళ్ళ బాంధవ్యాన్ని బలోపేతం చేశారు.' రండి  దయచేయండి, చెప్పాలని ఉంది' పాటలు లేవు. కథానాయకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూంటే అక్కడ నాయిక పరిచయం అవుతుంది. పాటలలో డాన్సులు అవీ పెట్టారు. తెలుగువాన్ని కాబట్టి నాకు తెలుగు సినిమానే నచ్చినా తమిళం కూడా ఫర్వాలేదనిపించింది.

రుద్రవీణ జాయాపజయాల మీద చర్చ అనవసరం. అప్పుడున్న సమస్యలు ఇప్పుడూ ఉండవచ్చు. నా లాంటి వాళ్ళపై ఈ సినిమా చూపిన ప్రభావం చాలు కలకాలం నిలిచిపోడానికి. అవార్డులు రివార్డులు అన్నీ తర్వాతే.

మానవవాదానికి ముగింపు లేదు.


5 comments

Post a Comment