పురాణాల్లోంచి కొన్ని వినాయక విశేషాలు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.పండుగ సందర్భంగా విఘ్నేశ్వరునికి సంబంధించిన పురాణ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

  1. 1.   మహావిష్ణువుకు జయ-విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయ,విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపూ అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను ఔదలదాల్చేవాడు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటిమీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది.

  2. 2.   గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో వున్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి వున్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు.

  3. 3.   వినాయకుడు ఎరుపు వర్ణంలో వుంటాడు. ఆయన ఏకదంతుడు. కుడిచేతివైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశున్ని ప్రార్థిస్తాడు వ్యాసభగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను వ్రాస్తానని షరతు విధిస్తాడు. వ్యాసుడు అంగీకరించి తను చెప్పినది అర్థం చేసుకొనే గణేశుడు వ్రాయాలని మెలిక పెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో,అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా వ్రాయాడానికి కావల్సిన ఘంటం లేదు కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు.

  4. 4.   విఘ్నాలు కల్పించేది, నశింపచేసేది విఘ్నేశుడే. ఒక దేవాలయంలో ఇద్దరు గణేశులుంటే ఒకరు విఘ్నాలు కల్పించేవారని(విఘ్నరాజని) మరొకరు విఘ్నాలు తొలగించేవారని (వినాయకుడని) అర్థం. ఇద్దరూ సమాన స్థాయిలో పూజలందుకుంటారు. ఆయనకు సంబంధించిన ప్రతి సంఖ్య 21తో ముడిపడి ఉంటుంది. దేవతలందరి చెవులు మకరకుండలాల చేత కప్పబడి ఉంటే వినాయకుని చెవులు మాత్రమే విస్తారంగా ఉండి ఎటువంటి అలంకరణలు లేకుండా దర్శనమిస్తాయి.మనం కోరిన కోర్కెలన్నీ ఆయన వింటాడన్న అంతరార్థం అందులో ఉంది.

  5. 5.   వినాయకుడు, ఆంజనేయుడు -ఈ ఇద్దరి మూర్తులను చందనంతో అలంకరించటం శ్రేష్ఠం .

  6. 6.   ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ ఆడుకుంటూ, భధ్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మ్రింగేస్తాడు బాల వినాయకుడు. చక్రం కోసం వెదికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతన్ని నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్ళు తీస్తాడు.ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే చక్రం బయటపడుతుంది.

  7. 7.   విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి బుద్ధి. ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగివచ్చిన వారికి వారినిద్దరినీ ఇచ్చి వివాహం చెయ్యాలని శివపార్వతులు నిర్ణయిస్తారు.కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావుడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు .

  8. 8.   గణేశుని సంతానంగా క్షేముడు, లాభుడు అనే ఇద్దరు కొడుకుల్ని చెబుతారు.

  9. 9.   గణేశుని ధ్వజంపై మూషికం గుర్తు రెపరెపలాడుతూంటుంది.

  10. 10.   భస్మాసురుని కొడుకు దురాసదనున్ని వక్రతుండావతారంతో హతమారుస్తాడు విఘ్నేశ్వరుడు. ఆ అవతారంలో ఆయనకు పంచమూఖాలు, పది బాహువులు, సిగలో నెలవంక, సింహ వాహనం ఉంటాయి.

  11. 11.   శివపార్వతుల కళ్యాణం వీక్షించటానికి దేవ, దానవ, గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు, ఇతర సమస్తకోటి జీవరాశి తరలి రావటంతో బరువు తట్టుకోలేక ఉత్తరంవైపు భుమి క్రుంగిపోతుంది. దాన్ని సమతలం చెయ్యటానికి పరమశివుడు అగస్త్య మహర్షిని పిలిపించి ఆయన్ని దక్షిణ దిశకు వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. దక్షిణ దిశనుండే తన పెళ్ళిని చూడగలిగే శక్తిని ప్రసాదించి, తన జటాజూటంలోంచి ఒక జటను కావేరి నది రూపంలో లాగి అగస్త్యుని కమండలంలోకి ప్రవేశపెడతాడు. ఒకసారి దక్షిణభారత దేశమంతా తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొంటే, ప్రజల బాధలు తీర్చటానికి వినాయకుడు కాకి రూపం ధరించి వెళ్ళి అగస్త్యుని కమండలం కూలదోస్తాడు. అగస్త్యుడు ఆగ్రహించి దాన్ని తరిమితే పసిబాలుడుగా మారిపోయి పరుగులంకించుకుంటాడు. కొద్దిసేపు అలా ఆటలాడి తర్వాత నిజరూపంతో సాక్షాత్కరించి ఆయన్ని తరింపచేస్తాడు. అలా కావేరి నదిని భూమార్గం పట్టించినవాడవుతాడు.

  12. 12.   ముద్గల పురాణం ప్రకారం వినాయకుని అనేకావతారాలలో ఎనిమిది ప్రముఖమైనవి - వక్రతుండుడు (సింహ వాహనుడు,మత్సరాసుర సంహారి), ఏకదంతుడు(మూషిక వాహనుడు, మదాసుర సంహారి) ,మహోదరుడు(మూషిక వాహనుడు,మోహాసుర సంహారి), గజవక్త్రుడు(మూషిక వాహనుడు,లోభాసుర సంహారి), లంబోదరుడు(మూషిక వాహనుడు,క్రోధాసుర సంహారి),వికటుడు (మయూర వాహనుడు,కామాసుర సంహారి), విఘ్నరాజు(శేష వాహనుడు,మమాసుర సంహారి), ధూమ్రవర్ణుడు(అశ్వ వాహనుడు,అభిమానాసుర సంహారి).

  13. 13.   గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున నాలుగవతారాలు. మహోత్కట వినాయకుడు (కృత యుగంలో కశ్యపుడు,అదితిల కొడుకు. ఎర్రటి వర్ణంలో పది బాహువులతో సింహవాహనుడై ఉంటాడు ), మయూరేశ్వరుడు (త్రేతా యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. తెల్లని వర్ణంతో,ఆరు భుజములతో నెమలి వాహనుడై ఉంటాడు.), గజాననుడు (ద్వాపర యుగంలో శివపార్వతులకి జన్మించినవాడు. ఎర్రటి వర్ణంతో నాలుగు చేతులతో ఉంటాడు.మూషిక వాహనుడు), ధూమ్రకేతు (కలియుగాంతంలో నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్టశిక్షణ చేస్తాడు.బూడిద వర్ణంతో రెండు లేక నాలుగు చేతులతో ఉంటాడు).



2 comments

Post a Comment

కాంగ్రెస్ మార్కు మతసామరస్యం !



స్వతంత్ర భారద్దేశంలో సెక్యూలరిజం అనేది ఒక కొరుకుడుపడని పదం. ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయనాయకుల పదకోశంలో దీని అర్థాలు అతివేగంగా మారిపోయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెర్షన్లు విడుదలవుతూంటాయి. ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఈ విషయంలో మినహాయింపు. 125 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి యాభైఏళ్ళకు పైగా దేశాన్ని పరిపాలించి ఇంకా
శాసిస్తున్న పార్టీ, దేశసమస్యలపై నిర్దుష్టమైన అభిప్రాయాలు ఏర్పరుచుకోకపోయినా ఒక్క విషయం మీద మాత్రం ఆది నుంచి కుండబద్దలు కొట్టినట్లుగా తన వైఖరి స్పష్టం చేస్తునే ఉంది. మతసామరస్యమంటే కేవలం కొన్ని వర్గాలకి కొమ్ముకాయడమేనని కాంగ్రెస్ పెద్దల ఆభిప్రాయం. అందుకు తగ్గట్లుగానే కొత్తగా మతహింస నిరోధక బిల్లు (Prevention of Communal and Targetted voilence bill 2011)తో మన ముందుకు వస్తోంది.


మతహింస కేవలం ఒక వర్గానికే పరిమితం కాదు. కవ్వించేది ఎవరైనా అల్లర్లంటూ చెలరేగాక ఆస్తినష్టం ప్రాణనష్టం రెండువైపులా ఉంటుంది. ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా నిజనిర్ధారణ చేసి కులమతాలకు అతీతంగా శిక్షలు విధించాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. అలా కాకుండా వోటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, పక్షపాత బుద్ధులతో ఒక వర్గాన్ని చిన్నచూపు చూసి, మరో వర్గంపై వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తేనే వస్తుంది చిక్కు. అందుకే ఈ బిల్లు వివాదాస్పదమయ్యింది.

ముందుగా బిల్లులోని ముఖ్యాంశాలు చదవండి (పూర్తి బిల్లు ఇక్కడ )
  • సెక్షన్ 3 ప్రకారం ఒక వర్గానికి చెందారన్న కారణంగా దానికి చెందిన వ్యక్తిని కాని, ఆస్తిని కానీ అసంకల్పితంగా గానీ, పథకం ప్రకారం గానీ దాడిచేయ్యటం నేరం.
  •  క్లాజ్ 7 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులపై శారీరకమైన వేధింపులకు పాల్పడటం నేరం.
  • క్లాజ్ 8 ప్రకారం ఆ వర్గం పైన కానీ, ఆ వర్గానికి చెందిన వ్యక్తిపై కానీ మాటల ద్వారా గానీ, వ్రాతల ద్వారా కంటికి కనిపించే మరే విధమైన పనుల ద్వారా కానీ ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యడం నేరం.
  • క్లాజ్ 9 ప్రకారం వ్యక్తిగా గానీ, సామూహికంగా గానీ ఆ వర్గం మీద పథకం ప్రకారం దాడి చెయ్యటం నేరం.
  • క్లాజ్ 10 ప్రకారం ఆ వర్గానికి వ్యతిరేకంగా ధనసహాయం గానీ మరే విధమైన సహాయం గానీ చెయ్యటం నేరం.
  • క్లాజ్ 12 ప్రకారం ప్రభుత్వోద్యోగులెవరైనా ఆ వర్గానికి చెందిన వ్యక్తులను మానసికంగా గానీ,శారీరకంగా గానీ హింసించడం నేరం.
  • క్లాజ్ 13 మరియు 14 ప్రకారం ఆ వర్గానికి చెందిన వ్యక్తులను రక్షించకుండా అలసత్వం ప్రదర్శించిన ప్రభుత్వోద్యోగులను కఠినంగా శిక్షించవచ్చు  
  • క్లాజ్ 15 ప్రకారం ఈ విషయంలో తన క్రింది ఉద్యోగులు సరిగ్గా పనిచెయ్యకపోయినా వారి పైనున్న అధికారి అందుకు బాధ్యుడవుతాడు.
  • క్లాజ్ 16 ప్రకారం ఉన్నతాధికారుల ఆజ్ఞలను సాకుగా చూపడానికి వీల్లేదు .
  • సెక్షన్ 58 ప్రకారం నిందితులకు బెయిల్ కూడా రాదు.ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చెయ్యవచ్చు.
  • సెక్షన్ 66 ప్రకారం ఫోటోలు,వీడియోలను సాక్ష్యాలుగా ప్రవేశపెట్టవచ్చు  
సెక్షన్లు క్లాజులు బాగానే ఉన్నాయనిపిస్తుందా? ఇక్కడే అసలైన మెలిక ఉంది. మతకల్లోలాలు జరిగినప్పుడు మెజారిటీ వర్గాన్ని అందుకు బాధ్యులుగా బిల్లు రూపకల్పన చేశారు. సెక్షన్ 3 ప్రకారం వర్గం అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మతపరంగా లేదా భాషాపరంగా మైనారిటికి చెందిన వారు మరియు షెడ్యూల్డు కులాలు లేదా తెగలకు చెందిన వారు . మనదేశంలో ఒక్క హిందువులు తప్ప మిగతా
అన్ని మతాల వారు మతపరమైన మైనారిటి క్రిందకు వస్తారు. కొత్తగా ప్రతిపాదించిన ఈ చట్టం ప్రకారం ఎప్పుడైనా మతఘర్షణలు జరిగితే న్యాయం కోసం పోరాడే హక్కు కేవలం మైనారిటీలకే ఉంది. సబ్ క్లాజ్ 3j ప్రకారం మైనారిటి ప్రజలనే బాధితులుగా పేర్కొన్నారు కాబట్టి అధిక సంఖ్యాక వర్గాల ప్రజలు నష్టపోయినా కిక్కురుమనడానికి వీలు లేదు . మెజారిటీ వర్గం ప్రజలే మతకల్లోలాలు ప్రేరేపిస్తారని, 
వారికి  ఎటువంటి ఆపదలు కలగవని ఈ బిల్లు ఉద్దేశ్యం కాబోలు. అలాగే వర్గం అన్న పదానికిచ్చిన నిర్వచనం కారణంగా మైనారిటీ ప్రజలు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినా, మానసికమైన, శారీరికమైన చిత్రహింసలకు పాల్పడినా, ఆస్తుల పై దాడులు చేసినా, అందుకు సహాయం చేసినా, ఈ బిల్లు పరిధిలోకి రారు.


సెక్షన్ 74 మరింత వివాదాస్పదంగా ఉంది. భారతీయ న్యాయసుత్రాల ప్రకారం నేరం నిరూపింపబడేవరకు ముద్దాయిని నేరస్తుడిగా భావించడానికి వీల్లేదు. సెక్షన్ 74 ఈ సుత్రానికి విరుద్ధంగా ఉంది. దీని ప్రకారం పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను నేరస్తులగానే భావిస్తారు. నిజంగా నేరస్తులు కానివారు ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మతకలహాలను, జాతుల మధ్య
వైరాన్ని విచారించటానికి ప్రభుత్వం National Authority for Communal Harmony, Justice and Reparation అనే సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థకు వున్న విశేషాధికారాల ప్రకారం అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల్లోనే కాదు, జరుగవచ్చని భావిస్తున్న ప్రదేశాల్లో పనిచేస్తున్న ప్రభుత్వాధికారుల పనితీరులో కూడా ఇష్టనుసారం జోక్యం చేసుకోవచ్చు. ఎవరినైనా విచారించే అధికారం అర్హత ఉంది. వీళ్ళ ఆదేశాలను సమీక్షించే అధికారం ఎవరికీ లేదు. పథకం ప్రకారం జరిగే ఘర్షణలను అంతఃకలహాలుగా పేర్కొంటూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంది. దీనివల్ల ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్రకు పరిమితమైపోవాల్సి ఉంటుంది. అమోదం పొందిన పక్షంలో ఈ బిల్లు జమ్మూ కాశ్మీర్‌కు తప్ప తక్కిన అన్నీ రాష్ట్రాలకూ వర్తిస్తుంది. హిందువులు తక్కువగా ఉండే జమ్మూ కాశ్మీర్‌లో మాత్రం అక్కడి ప్రభుత్వ అనుమతి అవసరం.


 ఇంతటి మోసపూరితమైన బిల్లు మరొకటుంటుందా? ఇది ఏ రకమైన మతసామరస్యానికి ప్రతీక ? అసలిటువంటి బిల్లుల వల్ల మతసహనం పరిఢవిల్లుతుందా ? మెతక వైఖరితో మతపరమైన రిజర్వేషన్లతో విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండాలనే ఇంగితజ్ఞానం ఎప్పుడలవడుతుంది ?


3 comments

Post a Comment

జగదానందకారకంగా శ్రీరామరాజ్యం పాటలు



శ్రీరామరాజ్యం పాటల కోసం నేను ఆత్రంగా ఎదురుచూడ్డానికి ప్రధాన కారణం బాపు-రమణ ,ఇళయరాజాల కాంబినేషన్. నేను ఇళయరాజాకు వీరాభిమానిని. ఆయన కూనిరాగం కూడా నాకు మహాప్రసాదమే. ఇక రాముడంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు రామాయణమంటే ఉప్పూ-కారం లేని కూరలా చప్పగా ఉంటుందని ఈసడించుకొన్న మాట నిజమే కానీ గత రెండు మూడేళ్ళుగా రామాయణం మీద రకరకాల పుస్తకాలు చదవటం వల్లనైతేనేమి, ప్రవచనాలు వినడం వల్లనైతే నేమి, నా అవగాహన మెరుగుపడి పాత్రల ఔచిత్యం బోధపడి, గౌరవం, భక్తిభావం రెండు కలిగాయి. సీతాసమేత రామలక్ష్మణ హనుమంతులకు నా మదిలో మందిరమే కట్టేశాను. ఇక హనుమంతుడిలాగా రామనామాన్ని నరనరాన జీర్ణించుకున్న భక్తులు బాపు-రమణలు. ఇద్దరికీ పౌరాణికాల మీద మంచి పట్టుంది. అంతకు మించి నిబద్ధత ఉంది. కథ ఏదైనా కమర్షియల్ ఫార్ములా పేరుతో చవకబారు శృంగారం కుమ్మరించే దర్శకేంద్రులు కోకొల్లలుగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంకా మనుగడగలుగుతున్నారంటే అందుకు కారణం కేవలం వృత్తి పట్ల వాళ్ళకున్న నిజాయితీనే. ఇటువంటి అరుదైన వ్యక్తుల కలయికలో తయారవుతున్న  చిత్రమంటే ఎవరికి మాత్రం ఉత్కంఠత ఉండదు ?

గీత రచయితగా జొన్నవిత్తుల గారి పేరు ప్రకటించినప్పుడు నేను తెల్లబోయాను. ఆనాటి లవకుశ పాటల స్థాయిలో  సాహిత్యం సమకూర్చగలరా అన్న సందేహం కలిగింది. తెలుగు భాష గొప్పదనం గురుంచి వ్రాసిన పాట తప్ప,ఆయన పేరు వినగానే ఠక్కున స్ఫురింపజేసే పాటలేవి నాకు తెలియవు. వేటూరి గారి చేత పాటలు వ్రాయిద్దామనుకుంటే అప్పటికే ఆయన స్వర్గస్థులైపోయారు. ఇక ఆ స్థాయిలో వ్రాయగలిగింది సిరివెన్నల సీతారామశాస్త్రి గారొక్కరే అని నా ప్రగాఢ నమ్మకం. జొన్నవిత్తులకు అవకాశమిచ్చి తప్పు చేస్తున్నారేమో అనుకున్నాను కాని ఆయన అద్భుతంగా గేయ రచన చేసి నన్ను ఆశ్చర్యానికి గురి చేశారు. పాటలన్నీ పామరులకు సైతం అర్థమయ్యేలా సరళంగా వ్రాసారు.దండకం వంటివి వ్రాయల్సి వచ్చినప్పుడు కాస్త విజృంభించారు. ఆయన సినీ జీవితంలో చిరస్థాయిలో నిలిచిపోయేలా సాహిత్యమందించారు. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పినట్లు ఈ పాటలన్నీ ముందు జొన్నవిత్తుల గారి చేత వ్రాయబడి, రమణ గారి అంగీకారం పొంది తర్వాత ఇళయరాజా చేత స్వరాల సొగసులు అందుకున్నవే.


ఇక పాటల్లోకి వెళ్దాం.



  • జగదానంద కారక (5/5) - ఈ పాటను ఆల్బంకే హైలైట్‌గా చెప్పుకోవచ్చు. త్యాగరాజ కృతిలోని పల్లవిని మాత్రం తీసుకొని విడిగా చరణాలు వ్రాసుకొని స్వరాలు సమకూర్చారు. ఇదే పల్లవితో   పెళ్ళిపుస్తకం  , త్యాగయ్య  సినిమాలలోను పాటలున్నాయి. ఆ పాటలకు ఈ పాటకు తేడా గమనించండి. ఆపారమైన ఇళయరాజా స్వరసంపత్తికి ఇదొక మెచ్చుతునక. పాట చివరలో జగదానంద కారకా అని ప్లెయిన్ వాయిస్‌లో వచ్చే బాలు గారి స్వరం ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది . ఈ పాటకున్న ఏకైక అపశృతి శ్రేయఘోషల్ 'శ' ను 'ష' గా ఉచ్ఛరించటం. సాహిత్యాన్ని బట్టి ఇది సినిమాలో మొదటిపాట, శ్రీ రామ పట్టాభిషేకం జరిగే సమయంలో వచ్చే పాట అనుకుంటున్నాను.

  • శ్రీ రామా లేరా ఓ రామా (5/5) -మరొక అద్బుతమైన పాట. ఇది రెండవ పాట కావొచ్చు.రాముడి దైనందిన జీవితం, సీతాదేవితో ఏకాంతంగా గడిపే క్షణాలను మోంటేజ్‌ పద్ధతిలో చిత్రీకరించి వుండే అవకాశముంది. వర్థమాన గాయకుడు రాము చాలా చక్కగా పాడారు.

  •  కలయా నిజమా వైష్ణవ మాయా (5/5) -ఇదొక బిట్ సాంగ్. ఒక మంచి పాటను చిన్నదిగా కుదించి అన్యాయమే చేశారు. టిప్పు ఇంత అద్భుతంగా పాడగలరని ఈ పాట ద్వారే తెలిసింది. ఇది కూడా మొదటి భాగంలో వచ్చే పాటే.  సీతను అడవుల పాలుచెయ్యనున్నారని తెలిసి ఆంజనేయుడు పడే మానసిక క్షోభను ఈ పాటలో ప్రతిబింబించారు.

  • సీతారామ చరితం (5/5) -దండకారణ్యం నుంచి మొదలై రావణ వధ వరకు సాగే సన్నివేశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వర్ణించిన పాట. అనిత, కీర్తన చాలా బాగా పాడారు. 'ఎందుకు ఈ పరీక్ష, ఎవ్వరికీ పరీక్ష? శ్రీరాముని భార్యకా శీలపరీక్ష,అయోనిజకి అవనిజకా అగ్నిపరిక్షా ? ' అంటూ ప్రశ్నలు అడిగే విధానం చాలా నచ్చింది. సినిమా రెండవ భాగంలో కుశలవులు పాడే పాటల్లో ఒకటి కావచ్చు.

  •  దండకం (5/5) - క్లైమాక్స్ ??

  • సీతా సీమంతం (4/5) -సీతాదేవి సీమంతానికి సంబంధించినది.  సాహిత్యాన్ని జాగ్రత్తగా వింటే ఇది సినిమాలో రెండుసార్లు వస్తుందని తెలిసిపోతుంది. మొదటి సగం అయోధ్యలో, రెండవ సగం వాల్మీకి ఆశ్రమంలో.

  •  గాలి నింగీ నీరు
    (4/5) -ఇది మరో మోంటేజ్ సాంగ్. లవకుశలో ' ఏ నిమిషానికి ఏమి జరుగునో' లా సీతాదేవిని అడవుల పాల్జేసే సమయంలో వచ్చే పాట. ఈ పాటమీదున్న ఏకైక ఫిర్యాదు అధునిక సంగీత వాయిద్యాలు వాడటం.

  • దేవుళ్ళే మెచ్చి(4/5) -రామ కథపై ఇంకొక పాట.

  • రామాయణము (4/5) -రామ కథను కీర్తిస్తూ కుశలవులు పాడే మరొక పాట.
  • రామరామ (3.75/5) -ఈ పాట రెండవ భాగంలో వస్తుంది. అల్లరి చేసినందుకు కోప్పడిన తల్లిని అనునయిస్తూ రాముడి బాల్య చేష్టలను వర్ణిస్తూ కుశలవులు గానం చేసే పాట.
  • ఎవడున్నాడు (3.5/5) -అక్కినేని వ్యాఖ్యానంతో ఈ చిన్న పాట ఆరంభమవుతుంది. తనకు నారదునికి మధ్య జరిగిన సంవాదం రామాయణ రచనకు ఎలా పురిగొల్పింది వివరిస్తూ వాల్మీకి చెప్పే సన్నివేశం ఈ పాటలో పొందుపరిచారు. ' ఓంకారానికి సరిజోదు' అంటూ రాముడి గుణగణాలను అలతి పదాలలో అందంగా సాక్షత్కరించారు.
  • మంగళం రామునకు (3.5/5) -శ్రీరామునికి మాంగళాశ్వాసం.పట్టాభిషేకమయ్యాక వచ్చే చిన్న గేయం
  • సప్తాశ్వరూఢం (3.5/5) -సూర్యభగవానుడు, శ్రీ రాముడు మీద పద్యాలు .ఇది చిత్ర ప్రథమార్థంలో పట్టాభిషేకానికి ముందో తర్వాతో వచ్చే పద్యాలు.
  • ఇది పట్టాభి రాముడు,శంఖు చక్రాలు పోలిన -(3.25/5) -ఇవి రెండు ఒకే బాణీలో ఉన్నాయి.కుశలవులు అయోధ్య వచ్చినప్పుడు రాచనగరును చూపిస్తూ రాముని పరివారంలోని వారో లేక, కూడా వచ్చిన మునికుమారులో పాడే పాటలా ఉంది.జానపదులు పాడుకొనే శైలిలో ఉంది.  


 పాటలన్నీ విన్నాక ఇళయరాజా మాత్రమే ఇటువంటి చిత్రానికి న్యాయం చేకూర్చగలరనిపించింది. శంఖుచక్రాలు పోలిన, గాలి నింగి నీరు పాటలు ఆధునిక శైలిలో ఉన్నప్పటికీ అన్ని పాటలు బావున్నాయి.  కీరవాణి బాణీలు నాకు పెద్దగా నచ్చలేదు. 'అన్నమయ్య' లో కీర్తనలన్నీ అంతకుముందే ప్రాచుర్యంలో ఉన్నవే. అందులో మూడు పాటలకే స్వంతంగా స్వరాలు సమకూర్చారు (తెలుగుదనానికిది, ఏలే ఏలే, అస్మదీయ మగటిమి).' శ్రీరామదాసు' లో కొన్ని మాత్రామే బావున్నాయి. 'పాండురంగడు' లో అంతంత మాత్రం .  అలా కాకుండా చేస్తున్నది మొదటి పౌరాణిక చిత్రమైనా, మేరుపర్వతం లాంటి 'లవకుశ' తో పోటీపడుతున్నా ఏ మాత్రం తొణక్కుండా ఇంత ఆహ్లాదభరితమైన సంగీతాన్ని అందించటం ఒక్క స్వరరాజాకే చెల్లింది. ఈ పాటలకు బాపు దర్శకత్వ ప్రతిభ తోడైతే ఆకాశమే హద్దు. ఆస్తిలో కొంతభాగం పోయినా ఫర్వాలేదు కానీ సినిమా మాత్రం కావ్యంలా మిగిలిపోవాలని తపనపడే నిర్మాత యలమంచలి సాయిబాబా అభిరుచిని అభినందించక తప్పదు. ఈ చిత్రం  అపూర్వవిజయం సాధించి రమణ గారికి ఘననివాళి అర్పించాలని మనసారా కోరుకుంటున్నాను.


1 comment

Post a Comment