ఎవర్ని ఉద్ధరించటానికి ఈ కామన్‌మెన్ వెల్త్



పంతొమ్మిదవ కామన్వెల్త్ ఆటలపోటీల నిర్వహణ కోసం కెనడాతో పోటీపడి మనదేశం అవకాశం దక్కించుకున్నప్పుడు ఎంతో మంది సంతోషించి ఉంటారు.వారం రోజుల నుంచి ఆ ఆనందమంతా ఆవిరైపోతోంది.

ఈ క్రింది గణాంకాలు చూడండి

  • 2003లో బిడ్ గెలిచినప్పుడు ప్రభుత్వం అంచనా - 1835 కోట్లు
  • 2007 ఏప్రిల్ లో బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఖర్చు -3566 కోట్లు
  • 2010 మార్చిలో కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ జనరల్ వి.కె.వర్మ ప్రకారం -10,000 కోట్లు
  • ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం -11,494 కోట్లు

అనధికార లెక్కల ప్రకారం ఈ ఖర్చు 30,000 నుంచి 35,000 కోట్లకు మధ్యలో ఉండొచ్చు.ప్రభుత్వ లెక్కలు ప్రామాణికంగా తీసుకున్నా ఏడేళ్ళలో,ఈ అంచనాలు, ఖర్చులు 600 శాతం పైనే పెరిగాయి.ఇక అనధికారిక వర్గాల సంఖ్యలు పరిగణనలోకి తీసుకుంటే కళ్ళుబైర్లు కమ్మి మూర్ఛపోవటం ఖాయం.పోనీ ఇంత ఖర్చు పెట్టి మనవాళ్ళు ఏ విశ్వకర్మ సృష్టించిన మయసభా భవన సముదాయాల్లాంటి
క్రీడాప్రాంగాణాలో,అతిథిగృహాలో నిర్మించారా అంటే అదీ లేదు.వివిధ వెబ్సైట్లలో దర్శనమిస్తున్న ఛాయాచిత్రాలు దేశప్రతిష్ఠని మంటగొలిపేలా ఉన్నాయి.విదేశీ ఆటగాళ్ళు కాదు కదా కనీసం స్వదేశీ సెంట్రీలు సైతం కాలుమోపలేనంత దుర్గంధభూయిష్టంగా ఉన్నాయి.

మరి..ఇంత డబ్బూ ఏమైపోయినట్లు?
అంచనాలకి,వాస్తవ ఖర్చులకి ఎందుకింత వ్యత్యాసం?

ఇదే అనుమానాన్ని ముందు పెడితే 'బీజింగ్ ఒలంపిక్స్ కోసం చైనా 140,000 కోట్లు ఖర్చు పెడితే మనం కేవలం 10,000కోట్లతో ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నామ'ని వి.కె.వర్మ గారు శెలవిచ్చారు.అయ్యా, చైనా ఆర్థిక పరిస్థితి ఏంటి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? చైనీయుల క్రమశిక్షణ ఎంత? మన నిర్మాణాల్లో అవినీతి ఎంత?  సగటు చైనీయుడి దినసరి బత్తెం ఎంత, భారతీయుడి రోజు కూలీ ఎంత?  ప్రభుత్వ కేటాయింపుల్లో వాస్తవంగా ఖర్చు పెట్టిందెంత? స్వాహా చేసిందెంత?  చైనాతో పోటీపడవల్సింది ఇలాగేనా? మనం చీద్కరించుకున్న చైనా నవంబరులో జరుగబోయే ఏషియన్ క్రీడల కోసం రెండు నెలలముందే సర్వసన్నద్ధంగా ఉంది.మరి మన ప్రగల్భాలు ఏమయ్యాయి? ఏడేళ్ళుగా ఏం చేస్తునట్లు?

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు, ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రెటరి లలిత్ భానోట్ గారు ఇంకొకడుగు ముందుకేసి పదితరాలు గుర్తించుకోవాల్సిన మాటనేశారు. 'మీకూ,మాకు అవి పరిశుభ్రంగానే ఉన్నాయి.విదేశీయుల  ప్రమాణాలు వేరుగా ఉంటాయి.ఏదైనా మనం చూసే విధానంలో ఉంది.' అని తేల్చేశారు.నిజమే మరి.అక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేదనుకుంటే లేదు.సర్వం మిథ్య అయినప్పుడు అలా అనుకోవడంలో తప్పేముంది? వెనకటికొక శిష్యుడు 'దేవుడనే వాడున్నాడా' అని సందేహం వెల్లబుచ్చితే ఆ గురువుగారు వెంటనే శిష్యుడి గూబ గుయ్యిమనిపించారట. ' అదేమిటి గురువు గారు,అలా పీకారంటే ' , ' శిష్యా ! ఇప్పుడు నీ చెంప పగలగొట్టినప్పుడొచ్చిన శబ్దం ఏ రూపంలో ఉందో చెప్పగలవా,అలానే దేవుడు కూడా.అంతా మన భావనలో ఉంది' అన్నాట్ట.కాబట్టి మనకి తెలియని విషయాల గురుంచి ఆట్టే అడిగి ప్రయోజనం లేదు,మన బుద్ధికి ఇంకా అంతటి పరిపక్వత కలుగలేదు అని సరిపెట్టుకోవటం తప్ప.కర్మసిద్ధంతాన్ని ఇంతబాగా వంటబట్టించుకున్న అధికారులు అత్యున్నత పదవులలో ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ఇంతటి స్థితప్రజ్ఞత ఉంది కాబట్టే ' చేసేదెవ్వడు, చేయించునదెవ్వడు ' అనుకుంటూ మనవాళ్ళు వారం రోజుల ముందు కూడా ముఖ్యక్రీడాంగణం ముందు తాపీగా పేవ్‌మెంట్లు, 
రోడ్లు నిర్మిస్తున్నారు.లీగు మ్యాచుల్లో అలసత్వంగా ఆడి ఓడిపోయి, చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచుల్లో చెమటోడ్చటం మనకు అలవాటే.అలాగే ఐదేళ్ళు అలసత్వం ప్రదర్శించిన ఘనత వహించిన షీలా దీక్షిత్ ప్రభుత్వం,రెండేళ్ళకు ముందు నిద్ర మేల్కొని,ఇప్పుడు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తోంది.అదీ ప్రధానమంత్రి స్వయంగా జ్యోక్యం చేసుకున్నాక.అడిగేవాడుంటేనే వొళ్ళు దగ్గర పెట్టుకుంటాం.లేకపొటే మనమే రాజు,మనమే మంత్రి.ఒక విధంగా ఇది మన సంస్కృతి.పాశ్చాత్యులకి ఇది విడ్డూరంగా అనిపిస్తే అది వాళ్ళ అజ్ఞానం.ఈ సమయంలో మనం చెయ్యగలిగిందొక్కటే. ఈ దేశాన్ని నవ్వులపాలు చేసే సంఘాటనలేవీ జరక్కుండా ఆటలపోటీలు సాఫీగా సాగిపోవాలని ఆ పరమాత్మున్ని ప్రార్థించటం.

కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

  • గేమ్స్ ముగిశాక క్రీడాగ్రామం పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇలాంటి ఇంకో కార్యక్రమం జరిగే వరకు అదలా ఉత్సవ విగ్రహంలా పడుండాల్సిందేనా?
  • కోట్లాది మంది ప్రజలు దారిద్ర్యంలో మగ్గుతున్న ఈ దేశంలో ఇంత భారీ ఎత్తున క్రీడలు నిర్వహించి ఈ దేశం సాధించేదేమిటి? ఎవర్ని ఉద్ధరించాలని ?
  • పేదరికాన్ని నిర్మూలించటానికి ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ఢిల్లీ నగరంలో బిచ్చగాళ్ళందరినీ బలవంతంగా తరలించినట్లు, మళ్ళీ ఏ అంతర్జాతీయ కార్యక్రమమో నిర్వహించినప్పుడు పేదల్నందరినీ తరిమేసి,దేశంలో పేదరికాన్ని రూపుమాపామని చంకలు గుద్దుకుంటారా? లేక పేదరికాన్ని నిర్మూలించాలనే చిత్తశుద్ధి నిజంగా ప్రభుత్వానికి ఉందా?
  • కొన్ని వేల కోట్ల రూపాయిలు చేతులు మారిన ఈ కుంభకోణంలో బాధ్యులైన అధికారులు,నాయకుల పై ప్రభుత్వం ఇకనైనా కఠిన చర్యలు చేపడుతుందా లేక షరా మాములుగా ఏ బలవంతపు పదవీవిరమణో, శాఖామార్పిడో చేయించి చేతులు దులుపుకుంటుందా?
  • అన్నిటికన్నా ముఖ్యమైనది,అందరినీ పీడించేది.. కొన్ని కోట్ల మంది రెక్కల కష్టాన్ని అప్పనంగా దోచుకుతిని,దర్జాగా తిరిగే సంస్కృతికి అంతమెప్పుడు?


6 comments

Post a Comment

పెద్దలకోసం ఒక పిట్టకథ

నగనగా ఒక పల్లెటూరి అన్నయ్య.అతనికి చదువబ్బలేదు.ఊళ్ళోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూంటాడు. పెళ్ళై ఒక పిల్లాడు కూడా ఉన్నాడు.అతని చెల్లెలికి మంచి సంబంధం కుదిరింది. వైభవంగా వివాహం జరిగి ఆమె కాపురానికి పట్నం వెళ్ళింది.ఒక శుభక్షణాన పండంటి ఆడపిల్లని ప్రసవించింది. అమ్మలక్కంతా వదిన చుట్టూ చేరి ' నీకు కోడలు పుట్టిందేవ్ ' అని ఊదరగొట్టారు.వాళ్ళ మాటలకు ఉబ్బితబ్బిబైపోయిన ఆమె ఉయ్యాలలో ఉన్నఆ పసిపాపను తన నాలుగేళ్ళ కొడుక్కి చిరునవ్వుతో చూపిస్తూ "అదిగో..అదే  రా, నీ పెళ్ళాం" అంది .చుట్టూ ఉన్న అమ్మలక్కలు ముసిముసి నవ్వులు నవ్వారు.

పిలుచుకోవడానికి పేరు కూడా పెట్టకముందే  ఆ పాపకు భర్త ఎవరో నిర్ణయమైపోయింది....తన ప్రమేయం లేకుండా !
 

అది ప్రారంభం.

*                                                 *                                                   *

రెండేళ్ళు గడిచాయి.
 

చెల్లెలు కూతురుని తీసుకొని సంక్రాంతికి పుట్టింటికొచ్చింది. ఆ పాపకు రెండేళ్ళు.తన మానాన తను ఆడుకుంటూ ఉంది.అన్నయ్య కొడుక్కి చదువంటే అసక్తి లేదు.ఎక్కడో గోళీకాయలాడుకుంటున్న వాడు,' పెళ్ళాం వొచ్చింద ' ని చెబితే పరుగెట్టుకుంటూ ఇంటికెళ్ళాడు.ఆ పాప దగ్గరికి వెళ్ళి ' ఇదిగో ! ఇప్పట్నుంచి నేను చెప్పినట్లు వినాలి..తెల్సిందా ' అని బెదిరించాడు.పాప భయంగా వాడి వైపు చూసింది.చెల్లెలది చూసి సరదాగా ' ఏంట్రోయ్ మా పాపను బెదిరిస్తున్నావ్ ' అని  గదమాయించింది.రోట్లో పచ్చడి దంచుతున్న వదిన ఆ మాటలకు చిన్నగా నవ్వుకున్నా, పక్కనే ఉన్న పొరుగమ్మ అందుకని ' ఏమమ్మా ఆ మాత్రం అనకూడదా నా కోడల్ని.వాడికి హక్కుంది కాబట్టి అన్నాడు.ఇంతలోనే నీ కూతురేం కందిపోదులే.అయినా ఎప్పటికైనా వాడి మాట వినాల్సిందే కదా ' అంది.

అనటమే కాకుండా తన చేతిలో ఉన్న ఏ తాయిలమో ఆ పాప చేతిలో పెట్టి,పిల్లాడికి కూడా కొంచెం ఇవ్వమంది.పాప అమాయకంగా ఆ పని చేస్తే ' అబ్బో ,ఎంత ప్రేమో బావ మీద ' అని దీర్ఘాలు తీసింది.

ఇది కొనసాగింపు.

 
*                                                 *                                                   *

పాపకు పదేళ్ళు వచ్చాయి.పిల్లాడికి పధ్నాలుగు.

పాప చదువులో,ఆటపాటల్లో చురుగ్గా ఉంది.అన్నింటిలో ముందంజ వేస్తోంది.
పిల్లాడు పదవ తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్
పెట్టేశాడు.చదువనేది అతని పాలిట కొరకరాని కొయ్యే అయ్యింది.మితిమీరిన  గారాబం వల్ల ఏ పనీపాటా లేకుండా జల్సారాయుడిలా తిరుగుతున్నాడు.అతను ఎదురైనప్పుడల్లా  పాప పడే భయానికి ' సిగ్గు ' అని భాష్యం చెప్పుకొని సంతోషిస్తున్నారు బంధువులు.ఎదిగే వయసులో ఏది నిజం ఏది అబద్ధం అన్న తార్కిక జ్ఞానం కొరవడి నలుగురు చెప్పిందే నిజమని గుడ్డిగా నమ్ముతున్నారు పిల్లలు. ఆకర్షణ ఏర్పడింది.చవకబారు సినిమాలు సీరియళ్ళు చూసి,సాహిత్యం చదివి అదే ప్రేమనే అంధవిశ్వాసంలో కూరుకుపోయారు.

*                                                 *                                                   * 


పాప అమ్మాయయ్యింది.పిల్లాడు అబ్బాయయ్యాడు.

వీళ్ళ వ్యవహారం బయటపడి ఇంట్ళో పెద్ద దుమారం బయలుదేరింది.చదువులో రాణిస్తూ ఇంజనీరింగ్ లో సీట్ తెచ్చుకున్న అమ్మాయిని,చదువు సంధ్యాలేని ఒక పల్లెటూరి ఆకతాయికి ఇవ్వడానికి చెల్లెలు ఒప్పుకోలేదు.అన్నా చెల్లెళ్ళ సంబంధం బీటలు వారింది.కుర్రది కుర్రాడు మాత్రం తమ పట్టు వదల్లేదు.

కథ చివరి అంకానికి చేరుకున్నాక, ముగింపు ఒక్కో కుటుంబంలో ఒక్కోలా ఉంటుంది.

ఈ మొత్తం వ్యవహారంలో తప్పు బట్టవలసిందెవరినైనా ఉంటే అది ముందుగా ఇరుగమ్మ పొరుగమ్మ లాంటి పెద్దల్నే.
పిల్లలు పుట్టగానే  ఇలా హడవుడిగా వరసలు కలిపేసి భార్యాభర్తలుగా ఎందుకు నిర్ణయిస్తారో నాకర్థం కాదు.బాల్యంలో పిల్లలకు చెప్పాల్సిన మాటలు అవి కావు.' శ్రద్ధగా చదువుకొని,సద్బుద్ధులు అలవర్చుకొని,ప్రయోజకులు కండి' అని చెప్పాలి.అదే వాళ్ళకు మంచి నడవడిని నేర్పుతుంది.పిల్లలు వృద్ధిలోకొస్తే వాళ్ళ జీవిత భాగస్వాముల్ని వాళ్ళే ఎంచుకుంటారు.అలా కాకుండా చిన్నపటి నుంచే అస్తమానం ' అది నీ భార్య ' ,' వీడు నీ మొగుడు'  అని నూరిపోస్తే ఇంక చదువేమెక్కుతుంది.వయసుకు మించిన ఆలోచనలు చేసి,లేనిపోని విషయాలపై ధ్యాస మళ్ళి ఉపద్రావాలను కొనితెచ్చుకుంటారు.బాల్యంలో ఉన్నట్లే ఎల్లకాలం ఉండరు కదా.చిన్నప్పుడు కుదురుగా ఉన్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఒట్టి చవటలు గా తయారవచ్చు.అలాగే ఎందుకూ పనికిరారనుకున్నవాళ్ళు అద్భుతాలు చేయవచ్చు.ఏదో ముచ్చట కోసం వరుసలు కట్టి పెళ్ళి ప్రస్తావనలు తీసుకొచ్చే పెద్దలు ఈ వాస్తవాన్ని గుర్తించాలి.చదువులో ప్రతిభ కనబరుస్తున్న ఒక అమ్మాయి జీవితాన్ని ఏ విధంగా పెద్దలు ప్రభావితం చేశారో పై ఉదాహరణ చెబుతుంది.దీనివల్ల నష్టపోయేది ఆ అమ్మాయే. ' కోడలు', ' అల్లుడు' అని ఎక్కడలేని అప్యాయతలు ఒలకబోసిన పెద్దలు ఆమెకేమీ సహాయం చెయ్యరు.వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే. తాంబూలం సేవిస్తూ ఏ రచ్చబండ దగ్గరో,కొప్పులు సరిచేసుకుంటూ ఏ గిలక బావి దగ్గరో ఇంకో కోడలు,అల్లుడు కోసం ఆత్రంగా వెదకటం.

1 comment

Post a Comment

మునిపల్లె రాజు - అస్తిత్వనదం ఆవలితీరాన




మేజికల్ రియలిజం ఒక విలక్షణమైన సాహితీ ప్రక్రియ. సృష్టిలో జరిగే దైనందిన కార్యక్రమాలని అధ్యాత్మిక కోణంలో అన్వయించి చూసి మానవుడికి, జరుగుతున్న సంఘటనలకు మధ్యనున్న మార్మిక సంబంధాలని ఆవిష్కరించి, విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. కథలో ముఖ్యమైన సంఘటనలకు మధ్య తార్కికమైన వివరణ గానీ, సైకలాజికల్ వివరణ గానీ ఉండదు. రచయిత రియాలిటీనీ కాపీ కొట్టటం కానీ, దాని చుట్టూ కథను అల్లుకునే ప్రయత్నం గానీ చెయ్యడు.సాధరణ విషయాలని అద్భుతంగా, అద్భుతమైన వాటిని సాధారణంగా వర్ణిస్తూ నిగూఢమైన రహస్యాలని తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు ‘ సెరమోని ‘ అనే పాశ్చాత్య కథలో ఒక యువతి ఆగ్రహంతో నృత్యం చేస్తూంటుంది.ఎన్నో వేల మైళ్ళ దూరంలో, ఆమెను మోసం చేసిన ప్రియుడు రాత్రి వేళలో తన పశువులపాకలో చెలరేగుతున్న అలజడి చూసి విస్తుబోతూంటాడు. ఆవేశంతో ఆ యువతి కదిలిస్తున్న పాదాలకు, పాకలో పశువులు అసహనంగా కదిలిస్తున్న గిట్టలకు రిలేట్ చేస్తాడు రచయిత. చివరకి ఆ పశువుల దాడిలో అతను మరణిస్తాడు.అతను మరణించిన విషయం రచయిత స్పష్టంగా చెప్పడు కానీ ఒక మోసపోయిన యువతి ఆగ్రహానికి, ఆమె అగ్రహంతో నాట్యం చేస్తే,అతని ప్రియుడే ప్రాణాలు కోల్పోతాడనే విషయానికి రచయిత ఇక్కడ ప్రాముఖ్యతనిస్తాడు. తెలుగులో ఈ తరహా రచనలు చేసిన కొద్దిమంది ప్రముఖులలో మునిపల్లె రాజు గారొకరు.




రాజు గారు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైరయ్యారు. చాలా చిన్న వయసునుంచే అనేక కథలు,కవితలు, వ్యాసాలు వ్రాసి పలు పురస్కారాలు పొందారు.’అస్తిత్వనదం ఆవలి తీరాన’ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన పుస్తకం. ఇందులో మొత్తం పదిహేను కథలు, ఒక మినీ నవల ( ‘పూజారి ‘. ఇదే 1964 లో బి.ఎన్.రెడ్డి గారి దర్శకత్వంలో నాగేశ్వరరావు హీరోగా ‘ పుజాఫలం ‘ సినిమాగా వచ్చింది),కొన్ని స్వగతాలు ఉన్నాయి. గత శతాబ్ది గొప్ప కథలలో ఒకటిగా కీర్తికెక్కిన రాయలసీమ కరువు సమస్యల గాథ ‘ వీరకుంకుమ ‘ కూడా ఇందులో ఉంది. కథ ఏదైనా, ఇతివృత్తం ఎటువంటిదైనా దానిలో మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, తాత్విక శోధన కనిపిస్తుంది. ‘ నైమిశారణ్యంలో సత్రయాగం’ లో విఫల ప్రేమతో అభయానంద గోస్వామి గా మారి నైమిశారణ్యంలో అధ్యాత్మిక పరివేదనలో మునిగిపోయి ఏళ్ళు గడిపి ఆఖరుకి అదే అరణ్యంలో ఒకప్పటి తన ప్రియురాలిని అంత్యదశలో కలుసుకొనే చక్రి , ‘ చేనేత చిత్రం’ లో కుగ్రామం నుంచి ఎంతో ఉత్సాహంగా ముంబయిలోని హస్తకళలపోటికి వచ్చి ద్వితీయ బహుమతి గెలుచుకొని, ఆ తర్వాత నగరంలోని జౌళిమిల్లులు, బట్టల ఖార్ఖానాలు చూసి వాటి ముందు తన చేనేత వృత్తి నిలబడగలదా అని పరితాపం చెందే ఓబయ్య, ’ స్తపతి మహోత్సవం’ లో యానాది కుష్టుమహిళకు ఆలయంలోని బంగారు పంచామృత పాత్రలో పాయసం తినిపించే సీతారాం’, ‘ఒక బాకీ తీరలేదు’ లో బాల్యంలో తనకు అన్నం పెట్టి ఆదుకున్న కమలమ్మ రుణం తీర్చుకోవడం కోసం విదేశాలనుంచి వచ్చే డాక్టర్ మురళి,వారు గతించారని చెప్పి మళ్ళీ అతనికి ఆతిథ్యమిచ్చే ఆ ఇంటి ముసలమ్మ, ‘మహాబోధి ఛాయలో ‘ లో చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి చెరువు గట్టునున్న ఒక మహావృక్షంతో అనుబంధాన్ని అల్లుకొని, ఆ వృక్ష ఛాయలోనే తన జీవితాన్ని మలచుకొని ,అనేక ఆటుపోట్లకు తట్టుకొని పరాయి రాష్ట్రంలో స్థిరపడి, చివరికో పని మీద మళ్ళీ స్వగ్రామం వచ్చి ఆ చెట్టు కనబడక తల్లడిల్లే కథానాయకుడు..ఇలా ప్రతి పాత్రా మానసాకాశంలో కారుమబ్బులా కదిలిపోతూ భావుకత్వపు కుంభవృష్టిలో మనల్ని తడిపి ముద్ద చేస్తుంది. మనం కూడా కాసేపు సన్యాసులమై, కమండలాలు ధరించి,శాంతి వచనాలు వింటూ రావిచెట్టు నీడలో యోగముద్రలోకి వెళ్ళిపోతాం. నోరున్న మానవులే కాదు, నోరులేని చెట్టు,ఎద్దు, కుక్క, కూడా ఈయన కథలలో ముఖ్య పాత్రలు పోషించాయి. అంతులేని పోరాటాలతో,అంతరంగిక వేదనలతో అలసిపోయి చీకట్లో మ్రగ్గుతున్న సగటు మానవుడి జీవన విధానానికి వేదాంతపు వీవెన విసిరి, అస్తిత్వపు ఆసరానిచ్చి ఆవలి ప్రశాంత ప్రకాశ తీరాలను చేర్చే యత్నం కనిపిస్తుంది. ఆయనే అన్నట్లు ‘ కథలు రెండు రకాలు. మేధస్సుతో ప్రభావితమైనవి. హృదయంతో ప్రభావితమైనవి. ఎక్కడ మేధస్సు ప్రధానమో అక్కడ అనుభూతి తక్కువ. ఎక్కడ పునాది హృదయమో ఆ కథ కళాబంధురం.’

హృదయపు పునాదుల మీద కట్టిన కథలు చాలానే ఉన్నాయి ఇందులో.

అన్ని పెద్ద బుక్ షాపుల్లో ఈ పుస్తకం దొరుకుతుంది.దొరక్కపోతే ఈ క్రింది అడ్రస్సును సంప్రదించవచ్చు

నవోదయ బుక్ హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ,హైదరాబాద్ -17
వెల:100/-
తొలి ప్రచురణ  పుస్తకం. నెట్ లో


4 comments

Post a Comment