నీ కోసమే మేమందరం

పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం అనగానే అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది.డిసెంబర్31 నుంచే హంగామా మొదలవుతుంది. ప్రైవేట్ టి.వీ.ఛానల్స్‌లో ఆ రోజు రాత్రి పన్నెండు వరకు వచ్చే ప్రత్యేక కార్యక్రమాలు వీక్షించి ఆ తర్వాత ఒకరికొకరు విషెస్ చెప్పుకుని పడుకునేవాళ్ళు ఇప్పుడూ ఉన్నారు. అలా కాకుండా విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తూ అర్థరాత్రి దాటాక రోడ్ల పై సందడి చేసే యువత ఎప్పుడూ ఉంటారు. మరుసటి రోజు పెందరాళే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం,ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పాటించినా పాటించకపోయినా కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం, డైరీలు వ్రాసే అలవాటు ఉంటే కొత్త డైరీ కొనుక్కోవటం, కాలెండర్లు కొనటం, బంధుమిత్రులతో సరదాగా గడపడం లాంటివి చేస్తూంటాం. వీలైనంతవరకూ ఆ రోజంతా సంతోషంగా గడపటానికే అందరం మనసా వాచా కర్మణా ప్రయత్నిస్తాం. ఆ రోజు ఎలా గడిస్తే సంవత్సరమంతా అలా గడుస్తుందనే నమ్మకం మనది.

శుభాకాంక్షలు తెలుపుకోటానికి ఇప్పుడైతే సెల్‌ఫోన్లు, ఎస్సెమ్మెస్లు ఉన్నాయి కానీ ఒకప్పుడైతే గ్రీటింగ్‌కార్డులు కొనటం తప్పని సరి. అదొక పెద్ద తతంగంలా జరిగేది. సైకిలేసుకొని స్నేహితులతో కలిసి గ్రీటింగ్‌కార్డ్స్ కోసం షాపులన్నీ తెగ తిరిగేవాళ్ళం.బాగా చిన్నతనంలొ అయితే సినిమా హీరోల ఫోటోలే గ్రీటింగ్‌కార్డ్స్‌గా ఇచ్చేవాన్ని. అవి అర్థరూపాయో ఎంతో ఉండేవి. వాటి వెనుక పేరు, శుభాకాంక్షలు వ్రాసి స్నేహితులకిచ్చేవాళ్ళం. సినిమాల పిచ్చి, హీరోల పిచ్చి విపరీతంగా ఉన్న ఫ్రెండ్స్‌కి అవి బోలెడంత సంతోషాన్ని కలిగించేవి. ఆ అసక్తి లేని ఇతర స్నేహితులకి మాములు గ్రీటింగ్‌కార్డ్స్ ఇచ్చేవాళ్ళం. స్పెషల్ ఫ్రెండ్స్‌ దగ్గర టాలెంట్  చూపించుకోటానికి పోస్ట్‌కార్డ్ టైపు వైట్ కార్డ్స్ పై దేవుళ్ళ బొమ్మలు అవీ పెయింటింగ్ వేసి ఇచ్చేవాన్ని. నాకు వచ్చిన గ్రీటింగ్‌కార్డ్స్, నేను ఇతరులకు పంపిన గ్రీటింగ్ కార్డ్స్ బేరీజు వేసుకునేవాన్ని. కష్టపడి పెయింటింగ్ వేశాక నా శ్రమను, దాని కోసం నేను వెచ్చించిన సమయాన్ని గుర్తించకుండా ఆ వైట్ కార్డ్ వెలను బట్టి తిరుగుటపా పంపించేవారిని చూస్తే నిరాశ కలిగేది. శుభాకాంక్షలు పంపినా ప్రతిస్పందించని ఫ్రెండ్స్‌కి నెక్స్ట్ టైం విషెస్ కట్ అన్నమాట.ఇంటెర్నెట్ యుగం వచ్చాక ఆన్లైన్ గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటయ్యింది.

ఆర్కుట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ఉద్ధృతికి అది కుడా తగ్గిపోయి సంక్షిప్త సందేశాలు పంపటం ఫ్యాషనైపోయింది. దేశం నలుమూలలా ఒకే టారిఫ్ వర్తించే ఈ రోజుల్లో ఎక్కడికైనా ఫోన్ చేసి అత్మీయంగా విషెస్ చెప్పే సౌలభ్యం కూడా ఉంది.

గతకాలము మిన్న వచ్చు కాలము కంటెన్ అని ఎవరన్నారో కానీ అది మన రాష్ట్రానికీ,దేశానికీ వర్తించదు. అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలమైపోతే, దిమ్మ తిరిగే స్కాములతో దేశం నివ్వెరపోయింది. కాబట్టి గత సంవత్సరం ఎవరికి ఎలా ఉన్నా ఈ సంవత్సరం మాత్రం అన్ని కష్టాలు తొలగిపోయి మంచే జరగాలని, శాంతి సుహృద్భావం వెల్లివిరియాలని మనసారా కోరుకుందాం. అవి రెండూ మనకిప్పుడు చాలా అవసరం.

ఒక చక్కటి తెలుగుపాటతో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కొత్త సంవత్సరానికి సంబంధించిన పాటలు అనగానే నాకు గుర్తొచ్చే పాటలు రెండే రెండు.

  • మొదటిది మంచుపల్లకి  సినిమాలోంచి నీకోసమే మేమందరం పాట.
  • రెండోది వడ్డే నవీన్, అబ్బాస్, సిమ్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రియా ఓ ప్రియా కమ్మని కలలకు శ్రీకారం  సినిమాలోంచి   పాట.
రెండవ పాట పూర్తిగా హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్.దాన్ని వదిలేసి, వంశీ తోలిసారిగా దర్శకత్వం వహించిన  మంచుపల్లకీ  చిత్రం లోంచి చిరంజీవి అద్భుతంగా నటించిన ఈ క్రింది పాటను ఆస్వాదించండి. సంగీతం రాజన్‌నాగేంద్ర, సాహిత్యం గోపి
.