నీ కోసమే మేమందరం

పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం అనగానే అందరికీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది.డిసెంబర్31 నుంచే హంగామా మొదలవుతుంది. ప్రైవేట్ టి.వీ.ఛానల్స్‌లో ఆ రోజు రాత్రి పన్నెండు వరకు వచ్చే ప్రత్యేక కార్యక్రమాలు వీక్షించి ఆ తర్వాత ఒకరికొకరు విషెస్ చెప్పుకుని పడుకునేవాళ్ళు ఇప్పుడూ ఉన్నారు. అలా కాకుండా విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తూ అర్థరాత్రి దాటాక రోడ్ల పై సందడి చేసే యువత ఎప్పుడూ ఉంటారు. మరుసటి రోజు పెందరాళే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం,ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పాటించినా పాటించకపోయినా కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడం, డైరీలు వ్రాసే అలవాటు ఉంటే కొత్త డైరీ కొనుక్కోవటం, కాలెండర్లు కొనటం, బంధుమిత్రులతో సరదాగా గడపడం లాంటివి చేస్తూంటాం. వీలైనంతవరకూ ఆ రోజంతా సంతోషంగా గడపటానికే అందరం మనసా వాచా కర్మణా ప్రయత్నిస్తాం. ఆ రోజు ఎలా గడిస్తే సంవత్సరమంతా అలా గడుస్తుందనే నమ్మకం మనది.

శుభాకాంక్షలు తెలుపుకోటానికి ఇప్పుడైతే సెల్‌ఫోన్లు, ఎస్సెమ్మెస్లు ఉన్నాయి కానీ ఒకప్పుడైతే గ్రీటింగ్‌కార్డులు కొనటం తప్పని సరి. అదొక పెద్ద తతంగంలా జరిగేది. సైకిలేసుకొని స్నేహితులతో కలిసి గ్రీటింగ్‌కార్డ్స్ కోసం షాపులన్నీ తెగ తిరిగేవాళ్ళం.బాగా చిన్నతనంలొ అయితే సినిమా హీరోల ఫోటోలే గ్రీటింగ్‌కార్డ్స్‌గా ఇచ్చేవాన్ని. అవి అర్థరూపాయో ఎంతో ఉండేవి. వాటి వెనుక పేరు, శుభాకాంక్షలు వ్రాసి స్నేహితులకిచ్చేవాళ్ళం. సినిమాల పిచ్చి, హీరోల పిచ్చి విపరీతంగా ఉన్న ఫ్రెండ్స్‌కి అవి బోలెడంత సంతోషాన్ని కలిగించేవి. ఆ అసక్తి లేని ఇతర స్నేహితులకి మాములు గ్రీటింగ్‌కార్డ్స్ ఇచ్చేవాళ్ళం. స్పెషల్ ఫ్రెండ్స్‌ దగ్గర టాలెంట్  చూపించుకోటానికి పోస్ట్‌కార్డ్ టైపు వైట్ కార్డ్స్ పై దేవుళ్ళ బొమ్మలు అవీ పెయింటింగ్ వేసి ఇచ్చేవాన్ని. నాకు వచ్చిన గ్రీటింగ్‌కార్డ్స్, నేను ఇతరులకు పంపిన గ్రీటింగ్ కార్డ్స్ బేరీజు వేసుకునేవాన్ని. కష్టపడి పెయింటింగ్ వేశాక నా శ్రమను, దాని కోసం నేను వెచ్చించిన సమయాన్ని గుర్తించకుండా ఆ వైట్ కార్డ్ వెలను బట్టి తిరుగుటపా పంపించేవారిని చూస్తే నిరాశ కలిగేది. శుభాకాంక్షలు పంపినా ప్రతిస్పందించని ఫ్రెండ్స్‌కి నెక్స్ట్ టైం విషెస్ కట్ అన్నమాట.ఇంటెర్నెట్ యుగం వచ్చాక ఆన్లైన్ గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటయ్యింది.

ఆర్కుట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ఉద్ధృతికి అది కుడా తగ్గిపోయి సంక్షిప్త సందేశాలు పంపటం ఫ్యాషనైపోయింది. దేశం నలుమూలలా ఒకే టారిఫ్ వర్తించే ఈ రోజుల్లో ఎక్కడికైనా ఫోన్ చేసి అత్మీయంగా విషెస్ చెప్పే సౌలభ్యం కూడా ఉంది.

గతకాలము మిన్న వచ్చు కాలము కంటెన్ అని ఎవరన్నారో కానీ అది మన రాష్ట్రానికీ,దేశానికీ వర్తించదు. అనేక సమస్యలతో రాష్ట్రం అతలాకుతలమైపోతే, దిమ్మ తిరిగే స్కాములతో దేశం నివ్వెరపోయింది. కాబట్టి గత సంవత్సరం ఎవరికి ఎలా ఉన్నా ఈ సంవత్సరం మాత్రం అన్ని కష్టాలు తొలగిపోయి మంచే జరగాలని, శాంతి సుహృద్భావం వెల్లివిరియాలని మనసారా కోరుకుందాం. అవి రెండూ మనకిప్పుడు చాలా అవసరం.

ఒక చక్కటి తెలుగుపాటతో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కొత్త సంవత్సరానికి సంబంధించిన పాటలు అనగానే నాకు గుర్తొచ్చే పాటలు రెండే రెండు.

  • మొదటిది మంచుపల్లకి  సినిమాలోంచి నీకోసమే మేమందరం పాట.
  • రెండోది వడ్డే నవీన్, అబ్బాస్, సిమ్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ప్రియా ఓ ప్రియా కమ్మని కలలకు శ్రీకారం  సినిమాలోంచి   పాట.
రెండవ పాట పూర్తిగా హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్.దాన్ని వదిలేసి, వంశీ తోలిసారిగా దర్శకత్వం వహించిన  మంచుపల్లకీ  చిత్రం లోంచి చిరంజీవి అద్భుతంగా నటించిన ఈ క్రింది పాటను ఆస్వాదించండి. సంగీతం రాజన్‌నాగేంద్ర, సాహిత్యం గోపి
.



నందమూరి నామ సంవత్సరం -2010

ప్రతి సంవత్సరం దేశంలోకెల్లా అత్యథిక చిత్రాలు నిర్మించే పరిశ్రమగా తెలుగు సినీపరిశ్రమకు పేరుంది. అప్పుడప్పుడూ బాలీవుడ్ ఈ రికార్డుని తన్నుకుపోయినా అధికశాతం చిత్రాలు మన కంపౌండ్ నుండే విడుదలవుతూంటాయి. అయితే వాసి కంటే రాశి ఎక్కువన్న అపప్రథ మనకు చాలా కాలంగా ఉంది.దాన్నినిజం చేస్తూ ఈ ఏడాది కూడా ఎన్నో సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. అలా వెళ్ళిపోయిన సినిమాలలో చిన్న సినిమాలున్నాయి, కోట్ల రూపాయిల ఖర్చుతో ఏళ్ళ తరబడి షూటింగ్ జరుపుకున్న పెద్ద సినిమాలూ ఉన్నాయి. వందకు పైగా తెలుగు చిత్రాలు ఏటా రిలీజవుతూంటే ఘనవిజయాలు సాధించిన చిత్రాల శాతం కనీసం పదిశాతాన్ని దాటకపోవటం నిజంగా శోచనీయం .


ఈ ఏడాది విజయం సాధించిన తెలుగు చిత్రాలు ఇవీ (విడుదలైన క్రమంలో) 1. అదుర్స్ 2.బిందాస్ 3.లీడర్ 4.ఏ మాయ చేశావే 5. బెట్టింగ్‌ బంగార్రాజు 6.డార్లింగ్ 7.సింహ 8.మర్యాదరామన్న 9.రోబో 10. బృందావనం .


ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు ప్రతి ఒక్కరికీ లాభాలు తెచ్చిపెట్టిన ఏకైక డైరెక్ట్ తెలుగు చిత్రం సింహ . 2004 లో విడుదలైన లక్ష్మీనరసింహ  తర్వాత ఆరేళ్ళ పాటూ సరైన సినిమా లేక వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలకృష్ణకు ఈ చిత్రం కొండంత ఉత్సాహాన్ని, ఉపశాంతిని కలిగించింది. ఎటువంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా విడుదలైన ఈ చిత్రం మార్నింగ్‌షో నుంచే సూపర్‌హిట్ టాక్
తెచ్చుకొని బాక్సాఫీసు వద్ద  తిరుగులేని

 

 ఆధిపత్యాన్నిప్రదర్శించింది. అర్థశతదినోత్సవాలకే మొహం వాచిపోయిన తెలుగు సినీపరిశ్రమలో తొంభైకి పైగా కేంద్రల్లో శతదినోత్సవాన్ని, 3 కేంద్రాల్లో రజతోత్సవాన్ని, ఒక కేంద్రంలో 200 రోజుల పండుగను జరుపుకొని సంచలనం సృష్టించి Biggest hit of the year గా నిలిచింది.ఈ విజయం నందమూరి అభిమానులకి కొత్త ఊపిరిలూదింది.ఇమేజ్‌కి తగ్గ కథ, సామర్థ్యం ఉన్న దర్శకుడు దొరికితే తన చిత్రాలు సైతం యువహీరోలకు ముచ్చెమటలు పట్టిస్తాయని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించారు. డాక్టర్ నరసింహగా రౌద్రరస పోషణలో పరిణితి చెందిన నటన కనబరిచారు.అసందర్భోచితమైన డైలాగులు పేజీలకు పేజీలు వల్లించకుండా సింపుల్‌గా షార్ట్‌గా ఉన్న సంభాషణలను తనదైన శైలిలో చెప్పి మెప్పించారు. బోయపాటి శ్రీను ప్రతిభ గురుంచి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వై.వి.యస్ చౌదరిలా ఉత్తరకుమార ప్రజ్ఞలు చెయ్యకుండా సినిమా మీద దృష్టి పెట్టి బాలయ్య సినిమాల్లో దొర్లే పొరపాట్లు దొర్లకుండా చూసుకున్నారు.కథ ఎప్పుడో తొంభయ్యో దశకాల్లోని పాత చింతకాయ పచ్చడే అయినా దానికి వయొలెన్సు మసాలాను బాగా దట్టించి పకడ్బందీగా రూపొందించారు. డాక్టర్ నరసింహ గెటప్‌లోని బాలయ్య ఫోటోలు మెల్లమెల్లగా విడుదల చేస్తూ అభిమానుల్లో ఆశలు పెంచి, చక్కటి ట్రైలర్‌తో దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళారు. పెద్దనిర్మాత నిర్మించకపోయినా, హ్యాపెనింగ్ ‌మ్యూజిక్ డైరెక్టర్ బాణీలు సమకూర్చకపోయినా, విదేశాల్లో పాటలు లేకపోయినా, నెంబర్‌వన్ డైరెక్టర్ దర్శకత్వం వహించకపోయినా ఈ చిత్రం విశేష ప్రజాదరణ పొందింది.

వెంకటేష్‌కు ఈ ఏడాది కలిసి రాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన నమో వెంకటేశ  యావరేజ్‌గా మిగిలిపోతే, అందరిలో ఉత్సుకత రేపిన చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి , ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకొంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రీన్‌ప్లేలో మార్పులు చేర్పులు చెయ్యకుండా యాధాతథంగా సినిమా తియ్యడమొక కారణమైతే, అయిదుగురు హీరోయిన్లను పెట్టి కూడా వారికి తగ్గ పాత్రలు ఇవ్వకపోవడం ఇంకొక కారణం. జ్యోతిక అభినయం ముందు రిచా గంగోపాధ్యాయ, అనుష్క తేలిపోయారు. కన్నడ రీమేకులు తెలుగులో వర్కవుట్ కావని వాన (ముంగారు మళె), యోగి (జోగి), తాజ్ మహల్ (తాజ్ మహల్) లాంటి చిత్రాలు నిరూపించాయి.ఈ చిత్రం ఆ సెంటిమెంటును మరింత బలపరిచింది.

నాగార్జునవి రెండు చిత్రాలు విడుదలయ్యాయి. కేడి  డిజాస్టర్ అయ్యింది. ఆనవాయితీ ప్రకారం క్రిస్‌మస్‌కు రిలీజైన రగడ  మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రం మాస్ ‌లా సూపర్‌హిట్ అవుతుందో లేక డాన్, కింగ్‌ ల సరసన చేరుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


యువ హీరోలలో ఏ ఏడాది విజయాన్ని అందుకున్నవాళ్ళు జూనియర్ ఎన్‌టియార్, ప్రభాస్, మనోజ్, నాగచైతన్య, రాణా, అల్లరి నరేష్.


అదుర్స్
‌తో శుభప్రదంగా సంక్రాంతికి స్వాగతం పలికి నవ్వులలో ముంచెత్తిన ఎన్‌టియార్ అదే ఊపును బృందావనం తో కొనసాగించారు. తన ఇమేజ్‌కి భిన్నంగా తొలిసారి ప్రేమికుడిగా నటించారు. పాత కొత్త చిత్రాల కలబోత అయిన ఈ
చిత్రంలో అటు
  కుటుంబబాంధవ్యాలకు పెద్ద పీట వేస్తూనే, ఇటు ఎన్‌టియార్ శైలికి తగ్గ ఫైట్లు, పాటలు ఉంచి కమర్షియల్‌గా సక్సెస్ అయ్యేలా జాగ్రత్తపడ్డారు దర్శకులు వంశీ పైడిపల్లి. ఏన్నాళ్ళుగానో ఊరిస్తున్న విజయాన్ని ఈ చిత్రంతో మళ్ళీ అందుకున్నారు దిల్‌రాజు.


జోష్  తర్వాత, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ఏ మాయ చేశావే చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది. చాలాకాలం తర్వాత, కలకాలం గుర్తుండిపోయే సంగీతాన్ని అందించి కుర్రకారుని ఒక ఊపుని ఊపారు ఏ.ఆర్.రెహమాన్. సంక్లిష్ట భావాలున్న అమ్మాయిగా తన మొదటి సినిమాలోనే సమంత
అద్భుతంగా

 నటిస్తే, ఆ అమ్మయి ప్రేమ కోసం అర్రులు చాచే కుర్రాడుగా నాగచైతన్య తన పరిధిలో మెరుగ్గా చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు జెస్సి , కార్తీక్ అనే రెండు పాత్రలే కనిపిస్తాయి కాని సమంత, నాగచైతన్యలు కనబడరు. నిజజీవితానికి దగ్గరగా ఉన్న అటువంటి పాత్రలు సృష్టించి, ఎటువంటి అశ్లీలత, వెకిలి వేషాలు లేకుండా ఒక ప్రేమకథని ఎంత రొమాంటిక్‌గా ప్రెజంట్ చెయ్యవచ్చో అంతే అందంగా చిత్రీకరించి కే.బాలచందర్ వంటి సినీపండితుల ప్రశంసలు అందుకున్నారు గౌతమ్ మీనన్.


కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అల్లరి నరేష్‌, ఉషాకిరణ్ మూవీస్‌తో జతకట్టి బెట్టింగ్‌ బంగార్రాజు  రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు.ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకొంది. కే.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభప్రదం  ఫెయిల్యూర్‌గా మిగిలిపోతే ఈ.వీ.వీ. దర్శకత్వంలో వచ్చిన కత్తి కాంతారావు  ఫర్వాలేదనిపించుకొంది.


ఛత్రపతి  తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ లేక డీలాపడ్డ ప్రభాస్‌కు డార్లింగ్  రూపంలో కాస్త ఓదార్పు లభించింది.

అలాగే బిందాస్  చిత్రం ద్వారా మంచు మనోజ్‌ మొదటిసారి సక్సెస్ చవిచూశారు .


రామానాయుడు కుటుంబం నుండి వచ్చిన రాణా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. వాచకంలో బాబాయి వెంకటేష్‌ని గుర్తుచేసే ఆయనకు ఈ చిత్రం సంతృప్తికరమైన ఫలితాన్నే ఇచ్చింది.


రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలకు భిన్నంగా రాజమౌళి రూపొందించిన మర్యాదరామన్న ప్రేక్షకుల మన్ననలు పొంది సునీల్‌ని బిజీ హీరోని చేసింది.ఒక ఊరిలో   సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై విజయాలు దక్కక తెరమరుగైపోయిన సలోనికి ఈ చిత్రం టర్నింగ్‌పాయింటే.

 
ఇమేజ్‌కి తగ్గ కథ కోసం మూడేళ్ళ విరామమిచ్చి ఖలేజా తో వీక్షకులను పలుకరించిన మహేష్‌బాబుకి చేదు అనుభవమే మిగిలింది. ఖలేజా   అనగానే ఒక పక్కా మాస్ చిత్రాన్ని ఆశించి థియేటర్లకొచ్చిన ఆభిమానులను పొంతన లేని కథ ఖంగు తినిపించింది. కథ కంటే కామెడీకే ప్రాధాన్యతనిచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అనవసరమైన సన్నివేశాలతో సినిమా మొత్తం నింపేసి అభిమానులను నీరుగార్చేశారు. మహేష్ అనుష్కల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నా అవి చిత్రాన్ని రక్షించలేకపోయాయి.


మెగాఫ్యామిలీకి ఈ సంవత్సరం నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన అల్లు అర్జున్ వరుడు, పవన్‌కళ్యాణ్ కొమరం పులి, రామ్‌చరణ్‌ ఆరెంజ్ బాక్సాఫీసు దగ్గర ఘోర పరాజయాల్ని మూటకట్టుకున్నాయి. వరుడు లో గుణశేఖర్‌కు సెట్స్ మీదున్న మమకారం, కొమరం పులి లో ఎస్.జే.సూర్య పైత్యం ప్రస్ఫుటంగా కనిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ముఖ్యంగా కొమరం పులి లో యాక్షన్ సన్నివేశాలు హాస్యాస్పదం కావడం అభిమానులకి మింగుడుపడని విషయం.అయితే అల్లు అర్జున్, మనోజ్, అనుష్కల కాంబినేషన్‌లో వచ్చిన వేదం ఒక మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు పొందింది. గమ్యం తో అకట్టుకొన్న దర్శకుడు క్రిష్ ఈ సినిమాతో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.ఐదు విభిన్నమైన పాత్రల చుట్టూ కథనల్లుకొని , చివర్లో వాటిని కలుపుతూ మానవతే జీవన వేదం అని చాటిచెప్పారు.
అయితే ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. మల్టిస్టారర్ చిత్రమే అయినా మార్కులు మొత్తం కేబుల్ కుర్రాడుగా నటించిన అల్లు అర్జున్ ఒక్కరే కొట్టేశారు. మగధీర తో ఘనవిజయం సాధించిన రామ్‌చరణ్ ఆరెంజ్  చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడిలో స్పష్టత లేకపోవటం వల్ల ఆరెంజ్ కొంతమందికే పరిమతమయ్యింది. హద్దులు దాటిన నిర్మాణవ్యయం, ప్రచార మాధ్యమాల్లో నాగబాబు వెళ్ళకక్కిన అర్థంలేని ఆవేదన (రుద్రవీణ నుంచి నిర్మాణరంగంలో ఉంటూ ,ఒక సాదాసీదా ప్రేమకథ కోసం ఆస్ట్రేలియా వెళ్ళి మగధీర కంటే ఒక పదిశాతం మాత్రమే తక్కువగా ఖర్చుబెట్టి, ఫెయిలయ్యాక దర్శకుడి మీదో హీరోయిన్ మీదో పడి ఏడవటం నాగబాబు తప్పు) ఈ సినిమాకి ప్రతికూలంగా పరిణమించాయి. నటనలో రామ్‌చరణ్ చూపించిన వైవిధ్యమొక్కటే అభిమానులకి ఊరటనిచ్చే అంశం.


సిద్దార్ధ్ బావ, గోపిచంద్ గోలీమార్ , జగపతిబాబు గాయం-2 పాసు మార్కులు తెచ్చుకోలేకపోయాయి.రవితేజ నటించిన శంభో శివ శంభో ,డాన్ శీను  చిత్రాలు మొదట్లో కాస్త సందడి చేసినా తర్వాత సద్దుమణిగాయి.వరుస ఫ్లాపులతో వరుణ్‌సందేశ్ తడిసిముద్దయ్యారు. మరో చరిత్ర  అతని సినీచరిత్రకే మాయని మచ్చగా మిగిలిపోయింది.


దేవ్ కట్టా దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం , చంద్ర సిద్ధార్థ అందరి బంధువయా, నరసింహ నంది 1940లో ఒక గ్రామం, క్రిష్ వేదం, తాతినేని సత్య భీమిలి కబడ్డీ జట్టు వైవిధ్యమున్న చిత్రాలుగా మిగిలిపోయాయి. ప్రస్థానం సాయికుమార్‌
నట వైదుష్యాన్ని ఆవిష్కరిస్తే,
 అందరి బంధువయా  చంద్ర సిద్దార్థ ఉత్తమాభిరుచుకి అద్దంపట్టింది. రెండు చిత్రాలలోనూ కథానాయకుడు శర్వానందే కావడం అతను ఎంచుకున్న మార్గాన్ని స్పష్టం చేస్తోంది. ఇది అభినందనీయమే అయినా వాచకాభినయాలలో మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం  మూడు నంది అవార్డులు, ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా నేషనల్ అవార్డు గెల్చుకొని పతాక శీర్షికలకెక్కింది. అప్పటికి గాని లాబ్‌ల నుంచి ఈ చిత్రానికి మోక్షం లభించలేదు. రిలీజైన తర్వాత కూడా ఈ చిత్రాన్ని పట్టించుకొన్న నాథుడే లేడు.ఎంచుకున్న కథాంశం చాలా పాతది కావటం ప్రధాన కారణం. బలహీనమైన కథానాయిక, సాగతీత కారణంగా అందరి బంధువయా ఫెయిలయితే, ఇమేజ్‌లేని కథానాయకుడి కారణంగా ప్రస్థానం చతికిలబడింది.స్లో నెరేషన్ , ట్రాజెడి క్లైమాక్స్ భీమిలి కబడ్డీ జట్టు పాలిట ఆశనిపాతాలయ్యాయి.

అనువాద చిత్రాల విషయానికి వస్తే శంకర్-రజనీకాంత్-ఐశ్వర్యారాయ్-ఏ.ఆర్.రెహమాన్ కాంబినేషన్ లో వచ్చిన రోబో బాక్సాఫీసు రికార్డ్లను తిరగరాసింది. విడుదలైన మొదటి మూడువారాలపాటూ థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొందంటే అతిశయోక్తి లేదు. పిల్లా పెద్దా తేడా లేకుండా జనం విరగబడ్డారు.రోబో గా రజనీకాంత్ నటన, ఐశ్వర్యారాయ్ అందచందాలు, అత్యున్నత సాంకేతిక విలువలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి..ఆరుపదుల
వయసులో, కుర్రహీరోలతో పోటీపడుతూ
 దేశమంతా విస్తుబోయే విజయాలు సాధించటం ఒక్క రజనీకే చెల్లింది.రోబో స్థాయిలో కాకపోయినా వేసవిలో వచ్చిన సూర్య యముడు కూడా ఓ మోస్తరు ప్రేక్షకాదరణకు నోచుకుంది .అదే సమయంలో విడుదలైన మణిరత్నం విలన్ అట్టర్‌ఫ్లాపైంది.


ఆరంభం నుంచి పలు వివాదాలకు కేంద్రబిందువవుతూ ఉత్కంఠను రేకెత్తించిన రాంగోపాల్‌వర్మ రక్తచరిత-1,2 చిత్రాలు మంచి టాక్‌ని సొంతం చేసుకున్నా కలెక్షన్లు రాబట్టుకోవడంలో విఫలమయ్యాయి.అమ్ముకొని నిర్మాతలు లాభపడ్డారేమో కాని నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భంగపడ్డారు.శివ లా చరిత్ర సృష్టిస్తాయనుకున్న సినిమాలు వారం రోజులు హడావుడి చేసి నిశ్శబ్దంగా వైదొలగిపోవటం చూసి ' ఒక రాజమౌళో, వి.వి.వినాయకో ఈ కథను తెరకెక్కించి ఉంటే కలెక్షన్ల సునామీ వచ్చేద ' ని యాక్షన్ చిత్రాల అభిమానులు కొందరు వాపోయారు .


ఏతావాతా కథను నమ్ముకోకుండా కాంబినేషన్లను నమ్ముకున్న శింగనమల రమేష్ లాంటి నిర్మాతలు కోలుకోలేని దెబ్బలు తింటే, పక్కా స్క్రీన్‌ప్లేతో ముందుకెళ్ళిన పరుచూరి కిరీటి లాంటి చిన్ననిర్మాతలు జాక్‌పాట్ కొట్టారు.కళ్యాణ్‌రామ్ కత్తి ని మినహాయిస్తే సంక్రాంతి నుంచి క్రిస్‌మస్ వరకు నందమూరి హీరోల హవా కొనసాగింది.తారకరత్నకు ఉత్తమ ప్రతినాయకుడిగా (అమరావతి ) నంది అవార్డు ప్రకటింపబడింది కూడా ఈ సంవత్సరమే.ఇలా ఏ రకంగా చూసినా ఇది నందమూరి నామ సంవత్సరం అని చెప్పక తప్పదు.


5 comments

Post a Comment

దెయ్యాలు భూతాల కబుర్లు


మధ్య నాగవల్లి గురుంచి వింటూంటే దెయ్యాలు భూతాల మీదా ఒక టపా వ్రాద్దామనిపించింది

దెయ్యాలు భూతాలు అనగానే నాకు నా చిన్నప్పటి ' ఓ స్త్రీ రేపు రా ' కథ టక్కున గుర్తొస్తుంది. 1988-89 ప్రాంతంలో అనుకుంటాను, ఒక పెద్ద పుకారు జనాల్ని చాలా భయపెట్టింది. ఒక స్త్రీమూర్తి ప్రేతమైపోయి రాత్రివేళల్లో సంచరిస్తూ నానా భీభత్సం సృష్టిస్తోందని , ఆవిడ బారిన పడకుండా ఉండాలంటే ఇంటి తలుపుల మీదో, గోడల మీదో 'ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాయడమొక్కటే మార్గమని ఒక ప్రచారం బయలుదేరింది. అందరూ తలుపులు బిడాయించుకుని, ముసుగులు తన్నేశాక, రాత్రిపూట తీరిగ్గా వచ్చిన ఆడదెయ్యం అది చదువుకొని తనను చూసి భయపడుతున్నారన్న గర్వంతోనో, లేక ఆ ఇంటి వాళ్ళ మీద జాలితోనో, ఆ పూటకి వాళ్ళనేమీ చెయ్యకుండా విడిచిపెట్టేసి,మరుసటి రోజు వస్తుంది.ఇలా రోజూ వచ్చి, చదివిన వాక్యాలే మళ్ళీ మళ్ళీ చదువుకొని ఈ 'రేపు' అన్నది ఖచ్చితంగా ఎప్పుడొస్తుందో తెలుసుకోలేక తికమకపడి ఆఖరికి విసుగొచ్చి వెళ్ళిపోతుందన్నమాట.ఈ పుకారు ఎవరు ఎలా మొదలుపెట్టారో కానీ చాలా తొందరగా పాపులరైపోయింది.అదిగో పులి అంటే ఇదిగో తోక అని హడావుడిపడిపోయే బాపతు జనం మా కాలనీలో కూడా ఉన్నారు.వాళ్ళు ఈ దెయ్యానికి జడుసుకొని ముందు జాగ్రత్తచర్యగా గోడల మీద,తలుపుల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ' ఓ స్త్రీ రేపు రా ' అని వ్రాసి పడేసారు. మా నాన్నగారు ఇలాంటివన్నీ నమ్మరు కాబట్టి, పైగా మేం అద్దె ఇంట్లో ఉండే వాళ్ళం కాబట్టి మా ఇంటి గోడలు, తలుపులు ఖరాబు కాలేదు.నాలుగైదు రోజులు గడిచి ఎవరికీ ఏమీ జరక్కపోయేసరికి అందరూ ఊపిరి పీల్చుకుని ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.బహుశా ' రేపు రా ' అనగానే బుద్ధిగా తలూపి మరుసటి రోజు వచ్చే ఆడదెయ్యానికి, తుచ్ఛ మానవులు తనను వేళాకోళం చేస్తున్నారని ఆ మాత్రం పసిగట్టలేని తెలివిలేని దెయ్యానికి మనం భయపడటమేమిటని గ్రహించి కాబోలు.

నాకు ఊహ తెలిసాక నేను థియేటర్లో చూసిన మొట్టమొదటి దెయ్యం సినిమా  శ్రీదేవీ కామాక్షీ కటాక్షం . మా ఊళ్ళో ఐ.యస్.మహల్ అని ఒక థియేటర్ ఉంది. అందులో ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలో, హిందీ సినిమాలో వేస్తూంటారు. ఏ అమవాస్యకో, పౌర్ణమికో అందరూ తిరస్కరించిన తెలుగు సినిమానో, లేక వందరోజుల కోసం లాగబడే తెలుగు సినిమానో ఆడించినా మిగతా రోజులన్నీ ఇంగ్లీషు,హిందీ చిత్రాలనే ప్రదర్శించేవాళ్ళు. అటువంటిది హఠాత్తుగా ఆ థియేటర్ ఓనర్‌కి ఏమయ్యిందో కానీ విఠలాచార్య దర్శకత్వంలో కే.ఆర్.విజయ ప్రధానపాత్రధారిణిగా ఒక భక్తిరసచిత్రం తీసి జనం మీదకి వదిలేశాడు.పల్లెటూరు నుంచి వచ్చిన మా తాత ఊరికే ఉండకుండా,ఏడవ తరగతి చదువుతున్న నన్ను కూడా ఆ సినిమాకు లాక్కెళ్ళాడు.ముసలాళ్ళ ద్వారా కూడా ఉపద్రవాలు వచ్చిపడతాయని నాకప్పుడే చూచాయగా తెలిసింది.

ఆ సినిమాలో ప్రతి రాత్రీ పన్నెండయ్యేసరికి దెయ్యం ఆవహించి భర్తపై విరుచుకపడే భార్యగా ముచ్చెర్ల అరుణ నటించింది.తెరపై గోడ గడియారం పన్నెండు కొట్టగానే,ముచ్చెర్ల అరుణ ఇంతింత కళ్ళేసుకుకొని,జుట్టు విరబోసుకొని నాలుక బయటపెట్టి వికృతంగా అరుస్తూ మొగుడు మీదకు ఎగిరి దూకుతూంటే థియేటర్లో కుర్చీలో కూర్చున్న నాకు పై ప్రాణాలు పోయినట్లే అనిపించింది.ఫస్ట్‌షో నుంచి ఇంటికొచ్చాక మా తాతను బాగా తిట్టుకొని సైలెంట్‌గా భోజనం చేసేసుకొని గట్టిగా ముసుగుతన్ని పడుకున్నాను.రాత్రి పన్నేండయ్యేసరికి మా ఇంట్లో గోడగడియారం ఠంగ్ ఠంగ్ మంటూ చప్పుడు చేస్తూంటే భయంతో బిక్కచచ్చిపోయేవాన్ని.టాయిలెట్ కోసం కూడా లేచేవాన్ని కాదు.అప్పట్లోనే చందూసోంబాబు నవల  ది మాన్‌స్టర్  చదివాను.అందులో హీరోయిన్ స్నానం చేస్తూంటే షవర్లోంచి రక్తం కారటం లాంటి సన్నివేశాలున్నాయి.నేను కూడా స్నానం చేస్తూ షవర్ వైపు చూసేవాన్ని.అయితే అదే వయసులో ఈవిల్‌డెడ్ లాంటి సినిమాను నింపాదిగా చూడగలిగాను. నేటివిటి ప్రాబ్లెం వల్ల ఆ సినిమా నన్నంత భయపెట్టలేకపోయింది.

పెరిగి పెద్దయ్యాక  దెయ్యాలు భూతాలంటూ అంతగా భయపడిన సన్నివేశాలు లేవు. రాత్రి, అమ్మోరు , 13బి, అరుంధతి, మంత్ర, చంద్రముఖి  లాంటి సినిమాలలో అక్కడక్కడ వళ్ళు జలదరించినా, తులసీదళం, అష్టావక్ర  లాంటి నవలలు చదివినప్పుడు రోమాలు నిక్కబొడుచుకున్నా ఆ అనుభూతి ఎక్కువకాలం వెన్నంటలేదు.నాగవల్లి తోనైనా వెంకీ ఆ పని చేస్తాడేమో చూడాలి.


2 comments

Post a Comment

బలివాడ కాంతారావు - 'దగాపడిన తమ్ముడు '



మంచి పుస్తకాల కోసం తెలుపు.కాం వెదుకుతూండగా మొదటిసారి  ఈ పుస్తకం గురుంచి చదవటం జరిగింది. అప్పటికి బలివాడ కాంతారావుగారెవరో, ఆయనేమేం పుస్తకాలు వ్రాశారో నాకు తెలియదు. టైటిల్ ఆకర్షణీయంగా ఉండటంతో ఆర్డర్ చేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ పుస్తకం ఒక గొప్ప రచయితని, చిరకాలం మనస్సుపొరల్లో నిక్షిప్తమైపోయే  ఒక చక్కటి కథను పరిచయం చేసింది.దగాపడిన తమ్ముడు ఒక ఆర్ద్రపూరిత విషాదాంత నవల. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆంధ్రదేశంలో రైతులు ఎదుర్కొంటున్న కడగండ్ల  నేపథ్యంలో కథ సాగుతుంది. చెప్పుకోవడానికి ఆనాటిదే అయినా  ఇందులోని కొన్ని సన్నివేశాలు ఈనాటీకీ వర్తిస్తాయి. మన కళ్ళ ముందే మెదులుతూ మనస్సుని వికలం చేస్తాయి. ఇందులో పాత్రలు కనబడవు, మట్టిని నమ్ముకున్న అమాయకమైన  మనుషులే కనిపిస్తారు. జీవం ఉట్టిపడుతున్న రక్తమాంసాలతో వాళ్ళు ఆహ్వానిస్తే, పాఠకుడు వాళ్ళతో కలిసిపోయి వారి సాధక బాధలు పంచుకుంటూ వాళ్ళు నవ్వితే తనూ నవ్వుతాడు, రగిలిపోతే తనూ పిడికిళ్ళు బిగిస్తాడు, గుండెలు బాదుకుంటే తనూ మౌనంగా ఆ శోకాన్ని అనుభవిస్తాడు.

కథ

ఆంధ్రదేశంలో ఉత్తరాన వంశధార నదీతీరాన గల నవిరి అనే కుగ్రామంలో దాసుడికి గ్రామదేవత పూని ఊళ్ళో ఉత్సవాలు చెయ్యాలని శివాలెత్తటంతో కథ ప్రారంభమవుతుంది. గౌరిపున్నమికి ఉత్సవాలు చేస్తారు ప్రజలందరూ.  అక్కడ డప్పువాద్యాలకు ఉత్సాహంగా పాదాలు కదుపుతూ పరిచయమవుతాడు కథానాయకుడు పుల్లయ్య.  పుల్లయ్య సాముగరడిలో ఘటికుడు. ఉక్కులాంటి శరీరం, నల్లటి శరీరంపై నిగనిగలాడే కండలు, గిరజాల జుత్తు, మెలితిరిగిన మీసాలతో పోతపోసిన విగ్రహంలా ఉంటాడు. అతనికున్న ఆస్తల్లా అతని తండ్రి గడించిన యాభై సెంట్ల భూమి మాత్రమే. అది కాకుండా పట్నం దొరకున్న రెండకరాల పొలం కూడా కౌలుకు దున్నుతూ ఏ చీకూ చింతా లేకుండా కులాసాగా బ్రతికేస్తూంటాడు. నవిరి గ్రామంలోనే కాక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అంతటి అందగాడు, డప్పు శబ్దానికి లయబద్ధంగా నృత్యం చేసేవాడు లేడని ప్రతీతి.

‘నా’ అనే వాళ్ళు లేని పుల్లయ్య, పేదింటి పిల్లైన నీలిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆమె చేతికి ఎముక ఉండదు. అపకారికి ఉపకారం చేసే రకం.చిన్నప్పుడు చెడు సావాసాలు  చేసి  ప్రస్తుతం గుడ్డివాడైన ముసలి వెంకన్నకే కాకుండా, తన ఇంటి గడప తొక్కిన లేనివాళ్ళందరికీ కలోగంజో పోసి కడుపు నింపి పంపుతూంటుంది . ఆమె కడుపు పండి కొడుకు పుడతాడు. ’అయ్యే పుట్టాడ ‘ని సంబరపడిపోయిన పుల్లయ్య అ పిల్లవాడికి తన అయ్య పేరే పెడతాడు ‘మల్లునాయుడ ‘ని.  వాడితోనే అతని లోకం.  వాడు పెరిగి పెద్దయ్యి తనలాగే డప్పు వాద్యాలకు అద్భుతంగా చిందులెయ్యాలని, న్యాయం ధర్మం నిలిపే మారాజు కావాలని, అయ్య పేరు, తన పేరు నిలబెట్టాలని కలలు కంటూ సంతోషపడిపోతూంటాడు.

కాలం గడుస్తుంది. ఎప్పటిలాగా పంటలు పండటం లేదు.  అయినా కౌలు ధాన్యం కొలిచి ఇవ్వాల్సిందే కాబట్టి మిగిలిన దాంతోనే సరిపెట్టుకుంటారు పుల్లయ్య,నీలి.  రేషన్ కోసం గవర్నమెంటు ధాన్యం సేకరణ ప్రారంభిస్తుంది.  ధరలు మండిపోతాయి.  ఊళ్ళో పెద్దలు,  పేదల కోసం పైసా విదిలించకపోయినా  కోపరేటివ్ స్టోర్సు సరుకుల్ని రాత్రికి రాత్రే  పట్నం తరలించి రెట్టింపు ధరలకు అమ్ముకుంటూంటారు.  ఆ పెద్దమనుషుల్లో రాజిగాడు ఒకడు.  ఈ అన్యాయం గురుంచి ప్రశ్నించిన గ్రామదేవత దాసుణ్ణి, రాజిగాడు కొట్టబోతే పుల్లయ్య అడ్డుకొని అవతలకి విసిరేస్తాడు . రాజిగాడు అదను చూసి రేషన్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్లని వెంటబెట్టుకొని వస్తాడు.  తనకు మిగిలింది తనకే సరిపోదు. అలాంటప్పుడు ఏ మాత్రం గిట్టుబాటు కాని ధరలకి ధాన్యం ఎలా ఇవ్వాలని ఎదురు తిరుగుతాడు పుల్లయ్య. పోలీసులు కల్పించుకుంటే పుల్లయ్య తన బాణకర్రతో వాళ్ళ వొళ్ళు హూనం చేస్తాడు. అంతలోనే ‘ కండ లేని వాళ్ళను కొట్టానే ‘ అని బాధపడిపోతే పోలీసులు అతనికి సంకెళ్ళు తగిలిస్తారు. అతన్ని బెయిలు మీద విడిపించటానికి, వకీలు ఖర్చులకు, కోర్టు విధించిన 100 రూపాయిల జరిమానా చెల్లించటానికి రాజిగాడి పెళ్ళాం దగ్గర పుల్లయ్య పొలం తాకట్టు పెడుతుంది నీలి.

ఊళ్ళో పరిస్థితులు దిగజారిపోతాయి. చిన్నా చితకా రైతుల పరిస్థితి అధ్వానమైపోతుంది. దొంగతనాలు పెరిగిపోతాయి. ఒకప్పుడు బాగా బ్రతికిన పీస లాంటి వాళ్ళు ఊళ్ళో దొంగతనాలకు తెగబడతారు. పోషించే దిక్కులేక  దాసుడు మరణిస్తాడు. దైన్యం కమ్ముకొంటూంటే  జరుగుబాటు కోసం ధాన్యం వర్తకం ప్రారంభిస్తాడు పుల్లయ్య. అతనికి  ఇష్టం లేకపోయినా నీలి కూడా కూలికి  వెళ్ళటం  ప్రారంభిస్తుంది . తన కొడుకు పెరుగుతూంటే రోజులిలా తయారయ్యాయేమిటని విసుక్కుంటాడు పుల్లయ్య. పిల్లవాడైన మల్లు క్షణం కూడా తండ్రిని వదలకుండా తిరుగుతూ అజమాయిషీ చేస్తూంటాడు. నీలి ఈ మారు ఆడపిల్లకు జన్మనిస్తుంది.  పుల్లయ్య కౌలుకి సాగు చేసుకుంటున్న భూమిని, పట్నం దొర రాజిగాడికి అమ్మేస్తాడు. పుల్లయ్య బ్రతిమాలుకున్నా లాభం లేకపోతుంది. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటూ వస్తున్న భూమి పరులపాలైపోతూంటే మూడేళ్ళ మల్లుని కావలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు పుల్లయ్య. యవ్వనంలో తన చెడు తిరుగుళ్ళకు ఫలితంగా పుట్టిన రాజిగాడు, పుల్లయ్యకు అన్యాయం చేశాడని తెలిసి కోపంతో అతన్ని శిక్షించటానికి వెళ్ళి అందరికీ దొరికిపోతాడు గుడ్డివెంకన్న.పుల్లయ్యే అతన్నీ పనికి పురమాయించాడని ఊరంతా అనుమానిస్తుంది. నీలి నచ్చజెబితే పుల్లయ్య గుండె దిటవు చేసుకొని కూలికి వెళ్తాడు. కట్టెల వ్యాపారం చేస్తాడు. ఏదీ కలసిరాదు. తాకట్టు పెట్టడానికి ఏమీ లేకపోవటంతో ఊళ్ళో అప్పు పుట్టదు. ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మనసొప్పక పట్నం వెళ్ళి బాగుపడదామని నిశ్చయించుకుంటాడు. భార్య పిల్లలతో కలిసి వాల్తేరు వెళ్తాడు.

వాల్తేరులో  మురుగుకాల్వ పక్కన ఒక పాక అద్దెకు తీసుకొని కాపురముంటారు నీలి, పుల్లయ్య. పొట్టకూటి కోసం పుల్లయ్య నానా అగచాట్లు పడతాడు. మార్కెట్లో కూలిపనికి వెళ్తాడు. చదువు రాకపోయినా ఉద్యోగం ఇప్పిస్తారేమోనన్న ఆశతో ఎంప్లాయిమెంటు ఎక్స్‌ఛేంజ్ ఆఫీసరు కాళ్ళు పట్టుకుంటాడు. కడుపు నిండా తిండి పెట్టి నాలుగు డబ్బులిప్పిస్తారంటే ఎన్నికల ప్రచారానికి వెళ్తాడు. ఎన్ని చేసినా నలుగురు మనుషుల నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళటం అంతంతమాత్రంగానే ఉంటుంది. దాంతో అభిమానం చంపుకొని పిల్లల ఆకలి తీర్చటంకోసం  దొంగగా మారతాడు. ఆ డబ్బుతో కొన్నాళ్ళు కుటుంబానికే  లోటు లేకుండా చూసుకుంటాడు. పేకాట, బ్రాకెట్టు మరిగి డబ్బులు నాశనం చేసుకుంటాడు. ఎలాగైనా పెద్దమొత్తం దొంగతనం చేసి మళ్ళీ తన స్వగ్రామం వెళ్ళి పాత పుల్లయ్యలా దర్జాగా బ్రతకాలని అనుకుంటాడు.  ప్రయత్నం వికటించి, కొడుకు మల్లునాయుడు కారణంగా పోలీసులకు పట్టుబడిపోతాడు. నిజం తెలిసి నీలి కొయ్యబారిపోయినా ధర్మానికి కట్టుబడి కోర్టులో నిజమే చెబుతుంది. బరువెక్కిన హృదయంతో పుల్లయ్య కూడా  నేరం అంగీకరిస్తాడు. మూడు-నాలుగేళ్ళు ఖైదు తప్పదని ఇన్‌స్పెక్టర్ చెబుతాడు. పిల్లలిద్దరితో కలిసి నిండు చూలాలైన నీలి రోడ్డున పడటంతో కథ సమాప్తమవుతుంది.

బలివాడ కాంతారావు గారి రచనా శైలి ఆకట్టుకుంటుంది. ఆణిముత్యాల్లాంటి అచ్చమైన తెలుగు సామెతలను విరివిగా వాడుకొని, వాస్తవికతకు దగ్గరగా రకరకాల  మనస్తత్వాలని ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.చినుకు రాలినప్పుడు చిగురించే మట్టివాసన లాంటి పరిమళం, సంభాషణల్లో గుభాళిస్తుంది . చిన్నప్పుడు దొంగతనాలు చేశాడని గుడ్డి వెంకన్నను ఈసడించుకున్న పుల్లయ్య, కొడుకు ఆకలి తీర్చటం కోసం ఒక బిచ్చగత్తె దగ్గర తనూ అదే పని చెయ్యాల్సి వచ్చినప్పుడు పడే అంతర్మథనాన్ని, దొంగలించిన సొమ్ము వడ్డీతో సహా తిరిగి ఇచ్చేసి అతను పొందే ఆనందాన్ని చక్కగా వర్ణిస్తారు రచయిత. అలాగే పుల్లయ్య అతని కొడుకు మల్లునాయుడుల మధ్య ఉన్న బంధాన్ని కూడా హృద్యంగా మలచారు. చెడులో కూడా మంచిని చూడమని చెప్పే నీలి, ఆమె ముసలితల్లి  మూర్తీభవించిన మానవత్వానికి  ప్రతీకలుగా నిలిచిపోతే, విలువలకు కట్టుబడి, మారుతున్న కాలంతో రాజీపడలేక నిత్యం అంతః సంఘర్షణకు  లోనయ్యి తుదకి పతనమైపోయే సగటు మానవుడిగా పుల్లయ్య మిగిలిపోతాడు.’ నరజాతి చరిత్ర మొత్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఆ పీడిత వర్గపు ప్రతినిధుల గుండెచప్పుళ్ళే ఇందులో ప్రతిఫలిస్తాయి. ప్రతి పాఠకుడి పర్సనల్ గ్రంథాలయంలో పదిలంగా ఉండాల్సిన పుస్తకం ఇది.  ప్రజాదరణ పొందిన ఈ నవలని నేషనల్ బుక్ ట్రస్టు వారు అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు.

ప్రతులకి విశాలాంధ్ర  బూక్‌హవుస్‌ని సంప్రదించండి.
వెల :75 రూపాయిలు.

(తొలి ప్రచురణ  పుస్తకం.నెట్ లో )

తాచెడ్డ కోతి


నం బావుండాలి పక్కనోడూ బావుండాలి అనుకోవడం ఒక పద్దతి. మనమే బావుండాలి, పక్కనోడు నాశనమైపోయినా ఫర్వాలేదనుకోవడం ఇంకో పద్దతి. మొదటిది ఉదార స్వభావమయితే, రెండోది ఉన్మాద స్వభావం. ఉన్మాద ప్రవృత్తి ఉన్న వ్యక్తులకి చికిత్స అవసరం. వాళ్ళు ఉంటే ఇంటి నాలుగుగోడల మధ్య ఉండాలి లేద మానసిక వైద్యుల పర్యవేక్షణలోనన్నా ఉండాలి. అలా కాకుండా జనంలో స్వేచ్చగా తిరగనిస్తే తాచెడ్డకోతి వనమంతా చెరిచినట్లవుతుంది పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్నది అదే.

' తనను తన కుటుంబాన్ని అవమానిస్తున్నార ' ని జగన్ ప్రధాన అభియోగం.పదవీ కాంక్షతో తండ్రి శవం పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేల చేత బలవంతపు సంతకాలు చేయించుకొని, అది చాలదన్నట్టు పి.ఆర్.పీ నేతలతో మంతనాలు సాగించిన జగన్, తన తండ్రినే ఘోరంగా అవమానించారు. ' తండ్రి కోసం అసువులు బాసిన అభిమానుల కుటుంబాలని ఓదార్చటం పుత్రుడిగా తన ధర్మం' అని మనుధర్మాలు వల్లించే జగన్‌కి ఇది తెలియకపోవడం శోచనీయం. నిజానికి వైయస్ మరణాంతరం కూడా ఆయన కుటుంబానికి తగిన గుర్తింపు ఇచ్చే ప్రయత్నమే చేసింది అధిష్ఠానం. అందులో భాగంగానే రెండు ప్రతిపాదనలు చేశారు. ఒకటి విజయమ్మకు పులివెందుల టికెట్ ,రెండోది జగన్‌కు కేంద్ర మంత్రి పదవి . సీ.ఎం.పదవి తప్ప మరో ధ్యాసలేని జగన్‌కు సహజంగానే రెండు ప్రతిపాదనలూ నచ్చలేదు. తన ధ్యేయం రాష్ట్రపీఠమైనప్పుడు, అసెంభ్లీకి వెళ్ళాలి కానీ కేంద్ర మంత్రిత్వం చెయ్యడమేంటన్నది ఆయన ఆలోచన. అసెంబ్లీకి వెళ్తే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి మరో అధికార కేంద్రాన్ని తయారుచెయ్యవచ్చు. సుముహూర్తం చూసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తను గద్దెనెక్కవచ్చు. కేంద్రమంత్రిగా ఉంటూ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించటం కష్టసాధ్యం. అందుకే ససేమిరా అన్నారు. కానీ ఒత్తిడికి తలొగ్గి తన తల్లిని అసెంబ్లీకి పంపక తప్పలేదు. అధిష్ఠానం కుడా జగన్ అసెంబ్లీకి వెళ్తే జరుగబోయే విపరీత పరిణామాలు దృష్టిలో ఉంచుకొనే ఆ ప్రతిపాదనలు చేసింది.ఇక వైయస్ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? విజయమ్మ ఎమ్మెల్యే, జగన్ స్వయానా ఎం.పి. వైయస్ సోదరుడు వివేకానందరెడ్డి ఎమ్మెల్సి. బామ్మర్ది కడప మేయర్. పులివెందులలో సర్పంచ్,మున్సిపల్ ఛైర్మాన్ లాంటి ప్రధానమైన పదవులన్నీ వారివే. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ గనులశాఖామాత్యులు బలినేని శ్రీనివాసరెడ్డి, వైయస్ తోడల్లుడు వైయస్ సుబ్బారెడ్డికి దగ్గర బంధువు.ఇక వైయస్సార్ ఆత్మగా చెప్పబడే కే.వి.పి, రోశయ్య ప్రభుత్వంలో కూడా శాంతి భధ్రతల సలహాదారుగా కొనసాగి మొన్నమొన్ననే రాజీనామా చేశారు. అయన దగ్గర బంధువైన పార్థసారథికి ఎమ్మార్ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర ఉంది.ఇలా ఒకరా ఇద్దరా..ఆశ్రిత పక్షపాతం,అవినీతికి మారుపేరైన వైయస్ పాలనలో ఆయన్ను 'నమ్ముకున్న ' వారందరూ నిబంధనలతో నిమిత్తం లేకుండా కొన్ని తరాల వరకూ సరిపోయే కోట్లాది రూపాయిలు వెనకేసుకున్నారు.కాంగ్రెస్ పార్టీలో ఉంటూ,అధిష్టానం అండదండలతోనే ఇదంతా చేయగలిగారే కానీ స్వంతంగా కాదు . అంత సామర్థ్యమే ఉంటే 2004 ఎన్నికలకు ముందు వైయస్ కుటుంబం ఆర్థికంగా దివాళా తీసే స్థాయిలో ఉండేదా? ఇన్నాళ్ళూ సీతగా కీర్తించిన సోనియాని ఇప్పుడు హఠాత్తుగా శూర్పణఖ అంటే ప్రజలు నవ్విపోతారు.

'సాక్షి' దినపత్రికలో వచ్చే వార్తలు చదివితే అదొక వార్తాపత్రికా లేక, జగన్ ట్విట్టర్ అకౌంటా అనిపిస్తుంది. 'ఇడుపులపాయ పుణ్యక్షేత్రం, ఇడుపులపాయ జనసంద్రం, మహానేత వైయస్, యువనేత జగన్, పోటెత్తిన జనం, అభిమానుల గుండెపోట్లు ' ఇవే ప్రధాన వార్తలు.' జగన్ ముఖ్యమంత్రి కావాలని వయసుతో సంబంధం లేకుండా ధర్నా చేసే చిన్నారులు, జగన్ రాలేదని నడిరోడ్లపై బైఠాయించే ప్రజలు, వచ్చాక తలనిమిరే ఒక ముసలవ్వ,తల పక్కకు వాల్చి ఆ ముసలవ్వ బుగ్గలనే కాకుండా,వచ్చిన వారి బుగ్గలనన్నీ పిసుకుతూ అటు ఏడుపు ఇటు నవ్వు, రెండు కాని భావాన్నొకటి మొహంపై పలికించే జగన్ ' ఇవి ఫోటో ఫీచర్‌లో కనువిందు చేసే ఫోటోలు. తండ్రి గతించి ఏడాది దాటినా ఇంకా ఓదార్పుయాత్ర అంటూ హడావుడి చేసి నలుగురిలో నానే ప్రయత్నం చేస్తున్న జగన్ అజెండా ఏమిటో విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసు. పరామర్శలు, ఓదార్పులకి పరిమితం కావల్సిన యాత్రలో రోశయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రాజకీయ ఉపన్యాసలు దంచి, అనుచరుల చేత రెచ్చగోట్టే ప్రకటనలు ఇప్పించి, అధిష్టానాన్ని యుద్ధానికి కవ్వించి, రాష్ట్రంలో తనను మించిన నాయకుడు లేడనే భ్రమలు కలిగించిన ఆయన, ఇప్పుడు అదే అధిష్టానం అస్త్రశస్త్రాలతో  సైయ్యంటే గగ్గోలు పెడుతున్నారు.'కుటుంబాన్ని చీల్చేయత్నం చేస్తున్నార' ని ఆశ్చర్యం వొలకబోస్తున్నారు. రాజకీయ రంగప్రవేశం చేసిన ఏడాదిన్నరకే సీ.ఎం కావాలని తహతహలాడుతున్న ఆయన, ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో పాతుకుపోయి మొదటిసారి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన తన స్వంత చిన్నాన్న పైన మాత్రం నిప్పులు చెరిగారు( పరిస్థితి కొట్టుకునేవరకు వెళ్ళబోతే అక్కడివారు సర్దిచెప్పారని PTI- Press Trust of India కథనం ). రామోజీరావు తోడల్లుడి కథనాలు, సుమన్ ప్రభాకర్‌ల ఇంటర్వ్యూలూ మొదటిపేజీలలో ప్రచురించి రామోజీ కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించిన జగన్ ఇప్పుడు అదే పరిస్థితి తనకూ వచ్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు.

ఏడాదిన్నర కాలంగా మొద్దునిద్రలో ఉన్న రాష్ట్రపాలనా యంత్రాంగాన్ని నిద్రలేపి పరుగులు పెట్టించే బాధ్యతను భుజాన వేసుకున్నారు కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. అయితే బొడ్డూడకుండానే బిర్యానీ తినాలనుకునే మనస్తత్వం కలిగిన జగన్, అతని అనుచరగణం ఆయనను ప్రశాంతంగా పనిచేసుకోనివ్వకపోవచ్చు.
 ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు ముమ్మరం చెయ్యవచ్చు. బలం లేక ఇప్పుడు వెనక్కితగ్గారు కానీ 'వైయస్ తెచ్చిన ప్రభుత్వం' అనే గౌరవంతో కాదు. తనకు మద్దతుగా పదుల సంఖ్యలో  కార్యకర్తలు, ఛోటా మోటా నాయకులు రాజీనామా చేసిన సంగతి అంకెలతో సహా తన పత్రికలో వేసుకున్నప్పుడే ఈ విషయం రూఢి అయ్యింది. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతివాదుల్ని, టీ.డీ.పీ, పీ.ఆర్.పీ లోని అసంతృప్తుల్ని జగన్ తనవైపు త్రిప్పుకోగలిగితే మధ్యంతర ఎన్నికలు అనివార్యమవుతాయి. మాటవినని మొండిఘటాలను శ్రేయోభిలాషులైన పెద్దలే దారిలో పెట్టాలి. అటువంటి వారెవరూ జగన్‌ దరిదాపుల్లో ఉన్నట్టు లేరు. ఉన్నా వినే ఓపికా సహనం జగన్‌కి లేదు. ఐతే కల్లు తాగిన కోతిని సైతం కట్టిపడేసే సత్తా కాలానికి ఉంది. రాబోయే కాలం ఒక్క కిరణ్‌కుమార్‌రెడ్డి కే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షా సమయమే.



7 comments

Post a Comment