ప్లేస్కూళ్ళు - కుటీర పరిశ్రమలు




' ఎదగడానికి ఎందుకురా తొందర ' అంటారు ఏఎన్నార్ బాపుగారి ' అందాలరాముడు ' సినిమాలో.అప్పట్లో ఆ మాటలు చెల్లుబాటయ్యాయేమో కానీ,వాటికి కాలం చెల్లిపోయి చాలా ఏళ్ళయింది.ఈ స్పీడ్ యుగంలో పుట్టినదగ్గర్నుంచి పిల్లలకు పోటీతత్వం అలవర్చకపోతే,ఆనక వెనుకబడిపోయి నవ్వులపాలయ్యేది వాళ్ళు,వాళ్ళతో పాటూ తల్లిదండ్రులుగా మనమూ అని తల్లిదండ్రులందరికీ తెలుసు.ఒకప్పుడు ఎల్.కే.జి,యూ.కే.జి తరువాత ఫస్ట్ క్లాస్ ఉండేవి.ఇప్పుడు వాటికంటే ముందుగా ప్రీకేజీ లేదా ప్లేస్కూల్ అని వొకటి తయారయ్యింది.వాటి గురుంచే ఈ టపా.

సాధారణంగా రెండున్నరేళ్ళు లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లల్ని ప్లేస్కూళ్ళలో చేర్చుకుంటారు.A నుంచి Z వరకు,1 నుంచి 10 వరకు ఆ వయసులోనే నేర్పించేస్తారు.ఎల్.కే.జి ని నేరుగా ఆంగ్ల పదాలతో మొదలుపెడతారు.జీవితంలో తిరిగిరానివి బాల్యం,యవ్వనం.ఏ బాదరబందీ లేకుండా,అమ్మానాన్నల గోరుముద్దలు తింటూ,గెంతుతూ ఆడుకోవల్సిన రెండున్నరేళ్ళ వయస్సులో,కాళ్ళు కట్టేసుకొని,అక్షరాలతో కుస్తీపడుతూ,వొత్తిడికీ గురయ్యే చిన్నపిల్లల్ని చూస్తే సున్నిత మనస్కులకు జాలి కలుగకమానదు. భార్యాభర్త ఇద్దరూ సంపాదిస్తే తప్ప రోజులు గడవని రోజులివి.కొన్ని కుటుంబాలలో మూడునెలల పిల్లల్ని సైతం డేకేర్ సెంటర్ లో వేసేసి ఉద్యోగాలకు వెళ్ళే మహిళల గురుంచి కూడా మనం వింటున్నాం,చూస్తున్నాం.సాంకేతిక విప్లవం మిగిల్చిన దుష్పలితాల్లో ఇదీ వొకటి.అవాంఛనీయమైనా అనివార్యమైన పరిణామం ఇది.

సరే,నాకిష్టమున్నా లేకున్నా మా చిన్నారిని ప్రీకేజిలో చేర్పించాల్సిన వయసొచ్చింది కాబట్టి,భార్యభర్తలం ఇద్దరం స్కూళ్ళ వేటలో పడ్డాం.ఇంటికి దగ్గరగా ఉంది కదా అని వో ప్లేస్కూలుకెళ్ళాం.అది రెండంతస్తుల ఇల్లు.గేటు తియ్యగానే కార్ పార్కింగ్ కోసం కేటాయించినట్లుండే స్థలంలో (నట్లు కాదు,నిజంగా అక్కడ ఉదయం ఏడు ఎనిమిది వరకు కార్ పార్క్ చెయ్యబడే ఉండటం ఓ రోజు చూశాను)ముందుకూ వెనక్కూ ఊగే మూడు నాలుగు ప్లాస్టిక్ బాతు బొమ్మలు,గుఱ్ఱం బొమ్మలు,ఒక జారేబండ అమర్చి ఉన్నాయి.కొంతమంది చిన్న పిల్లలు బిక్క మొహం వేసుకొని చూస్తుంటే,జైళ్ళో ఖైదీలను అజామాయిషీ చేసే జైలర్లలా,ఆయాలనబడే ఇద్దరమ్మాయిలు వాళ్ళని పరికిస్తూ కాపలా కాస్తున్నారు.కాస్త పక్కగా కాస్త పెద్ద హాలు,అందులో ఒక బోర్డు,'ABCD'లు తగిలించిన పటాలు,బొమ్మలు,కొన్ని కుర్చీలు,ఒక వైపున టీ.వీ. ఉన్నాయి.అది ఆఫీస్ రూం అనుకున్నా కానీ ప్రిన్సిపల్ వచ్చాక,అది ఆఫీస్ రూం + క్లాస్ రూం అని అర్థం అయ్యింది.అంతేకాదు,ప్రీస్కూల్,ఎల్.కే.జి,
యు.కే.జి పిల్లల్ని అందరినీ కలిపి ఆ స్థలం లోనే కూర్చోబెట్టి పాఠాలు(?) బోధిస్తారని తెలిసి అవాక్కయ్యాను.డేకేర్ పిల్లలకి వరండానే గతి పాపం.

ప్రిన్సిపల్ యథాప్రకారం గంభీరంగా స్కూలు గురుంచి,ఫీజుల గురుంచి వివరించి,పనిలో పనిగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర గురుంచి చిన్నపాటి లెక్చరు కూడా దంచింది.వాలెంటైన్స్ డే ని కూడా తమ స్కూలు సెలెబ్రేట్ చేసుకుంటుందని,కాకపోతే ఆ రోజున తల్లిదండ్రులని ప్రేమించమని,అన్నదమ్ములను,అక్క చెల్లెళ్ళను ప్రేమించమని పిల్లలకు చెబుతామని ఆవిడ చెప్పింది.పిల్లల పట్ల అంత ప్రేమ,సామజిక బాధ్యత ఉన్న ఆవిడ అంతే శ్రద్ధ ను,పాఠశాలకు ఇంకొక మూడు విశాలమైన గదులను కేటాయించటంలోనో,మెరుగైన సౌకర్యాలు కలిగించటంలోనో చూపించి ఉంటే ఇంకా బావుండేది. రాజకీయనాయకుల వాగ్దానాలనే వినీవినీ అరాయించుకున్న సగటు భారతీయుడు బుర్ర కాబట్టి ఆవిడ ఉపన్యాసం నన్నేం చెయ్యలేకపోయింది.అక్కడి నుంచి బయటపడి ఓ ప్రముఖ కార్పొరేట్ గురు నిర్వహిస్తున్న స్కూల్ కి వెళ్ళాం.ఆ శాఖను అప్పుడే ఏర్పాటు కొత్తగా ఏర్పాటు చేసారు.స్కూలు ఆవరణ విశాలంగానే ఉన్నా,'ఇది బడి ' అని చెప్పడానికి పనికివచ్చే పరికరాలు ఏవీ అక్కడ కనిపించలేదు.స్కూల్ మేనేజ్మెంట్ ని మాటల్లో దింపితే తల్లిదండ్రుల దగ్గర్నుంచి వసూలు చేసే నాన్-రిఫండబుల్ ఫీజులతో పరికరాలని త్వరలోనే కొనుగోలు చెయ్యనున్నట్లు తెలిసింది.మొహం మీద వాళ్ళా విషయం చెప్పకపోయినా, సారాంశం అదే.

ఇంటికి తిరిగి వస్తూండగా నాకు ఒక విషయం బాగా అర్థమయ్యింది.ఈ దేశంలో ప్లేస్కూళ్ళు కూడా కుటీర పరిశ్రమలు లాంటివి.కావలసిందల్లా లక్ష రూపాయిలు పెట్టుబడి,ఒక చిన్న ఇల్లు.అది అగ్గిపెట్టె లాంటి ఇల్లైనా పర్లేదు.అద్దె ఇల్లైనా పర్లేదు.స్వంత ఇల్లైతే మరీ మంచిది.అద్దె డబ్బులు,అడ్వాన్సు సొమ్ములు మిగులుతాయి.అనుమతుల సంగతి దేవుడెరుగు..కనీస అవసరాలు కూడా లేని ఇటువంటి ప్లేస్కూల్లలో చేరి పిల్లలెంతవరకు ప్రయోజకులవుతున్నారేమో కానీ,నిర్వాహకులకు మాత్రం అవి కాసుల వర్షం కురిపిస్తున్నాయి.మనసు చంపుకుని పిల్లల్ని వదిలి ఉద్యోగాలకు వెళ్ళే ఉద్యోగినుల సెంటిమెంట్లతో వారికి పని లేదు.వారికి కావల్సిందల్లా ఖర్చు-రాబడి,లాభ-నష్టాల బేరీజు పట్టిక మాత్రమే.వీధికి వీధికీ పుట్టగొడుగుల్లా మొలుస్తున్న ఇటువంటి ప్లేస్కూళ్ళ బారి నుండి ఈ దేశాన్ని ఆ భగవంతుడే రక్షించాలి.


8 comments

April 11, 2010 at 2:23 AM

మీ పాప చదువులో వెనకబడినా ఫర్వాలేదు. ఇంకో రెండేళ్ళ తర్వాతనే చేర్పించండి 1 వ తరగతిలో. ముందే A,B,C,D లు నేర్చుకుని చేసేదేమీ లేదు, బాల్యంలో రెండు సంవత్సరాలు వృథా అవ్వడం తప్ప.

Reply

నాగప్రసాద్ గారు

:-)

Reply
April 11, 2010 at 9:24 AM

నాగ ప్రసాద్ కరెక్టుగా చెప్పారు. పాపకు ఖాళీ సమయాల్లో మీరే చెప్పండి. కొంతమంది స్లో లర్నర్స్ మినహాయిస్తే పిల్లలకు అపారమైన గ్రాస్పింగ్ ఉంటుంది. చదువు నేర్పడానికి ప్లే స్కూల్కు మాత్రం పంపకండి. భవిష్యత్తులో చదువు అంటే వారికి అసహ్యం కలిగితే అందుకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని కట్టడి చేయలేని, అసలు పిల్లల స్వేచను పట్టించుకోని ప్రభుత్వాలను, ఉపాధ్యాయ సంఘాలను, మేధావులను...@%*$@@!@$

Reply

జీవని గారు,కృతజ్ఞతలు.

Reply
April 11, 2010 at 7:57 PM

నాగ ప్రసాద్ గారి,జీవని గారి మాటే నాది కూడా! కాకపోతే మీరు నేర్పుకునేటప్పుడు కొంచెం ఓర్పు అవసరం. ’ఈ పాటి రాదా’ అని పిల్లల మీద కోపం తెచ్చుకోవద్దు. ’పిల్లలకి అన్నీ వస్తాయి’ అని నమ్మకంతో నేర్పండి. వాళ్ళు అద్బుతాలు చూపిస్తారు. మీకు ఏ సమస్య అయిన వస్తే మీకు తెలిసిన వాళ్ళతో చర్చించండి, చాలు!

Reply

అమ్మఓడి ఆదిలక్ష్మి గారు,

మీ అమూల్యమైన సలహాకు కృతజ్ఞతలు.మాకు కుదిరినప్పుడల్లా పాపకు నేర్పిస్తూనే ఉన్నాం.ఈ తరం పిల్లల్లాగే తనూ చురుకైనది.త్వరగానే నేర్చుకుంటోంది.

Reply
April 12, 2010 at 4:10 PM

This is personal opinion .....
I feel its not wrong children going to school at younger age (i.e,from 2 n half months).Its not that v cant teach them at home v can but some time they listen n some time not.This is the right age for them to learn eating manners,toilet manners such basic things.C v must keep changing according to new generation,it was our ancestors time where they used to go to school at age of 5 now its not like that.Its matter of only 2 hrs where they learn to mingle with others,learn to share,respecting elders.My final conclusion instead of making them sit at home for 4 yrs n making them spoilt brats with no decent behavior its better to send them to school

Reply

అక్కీని చూస్తే అమాయకంగా వుంటుంది.పాపం,ఎలా తట్టుకుంటుందో!!!

Reply
Post a Comment