నా మొదటి కథ - కామేశం కవితాపారాయణం

(ఆంధ్రభూమి మాసపత్రికలో 2001-2002 మధ్యకాలం లో ప్రచురితం అయ్యింది.దురదృష్టవశాత్తూ అ కాపీని పోగొట్టుకున్నాను.అందుకే ప్రచురితమైన నెల,సంవత్సరం వివరాలు సరిగ్గా గుర్తులేవు.నా దగ్గరున్న కథ రఫ్ కాపీ నుంచి యిక్కడ పెడుతున్నాను)

కామేశం చిన్నప్పటినుంచి అంతే !

ఏదైనా ఆలొచన వస్తే దాన్ని అమలు జరిపేంతవరకూ ఊర్కోడు.ఆ విషయంలో పట్టూవిడుపులుండవు.తద్వారా ప్రళయం రావచ్చు,ప్రపంచమే తలక్రిందులవచ్చు,ప్రాణ సంకటం కలగవచ్చు.కానీ అతనవేం పట్టించుకోనే రకం కాదు !

అటువంటి కామేశానికి హఠాత్తుగా పెద్ద కవినైపోవాలనే కోరిక పుట్టింది !
మహాత్ముల మస్తిష్కాలలో మాములుగా పుట్టవు కదా ఆలొచనలు.అతనికి ఈ అలోచన రావటం వేనుకా వో రీజనుంది.

సదానందం సాధారణ ప్రభుత్వోద్యోగి.కామేశం అతని మేనేజరు.

సదానందం ఉబుసుపోక కవితలంటూ ఏవో వ్రాస్తూంటాడు.మొన్నామధ్య ఏదో సంఘం వాళ్ళు జిల్లా స్థాయి కవితా సమ్మేళనం నిర్వహించారు.అందులో మనవాడు పాల్గొని ఏకంగా మొదటి ఫ్రైజు కొట్టేశాడు.ఫ్రైజ్ మనీ ఐదువేలు.దాంతో వొక్కసారిగా ఆఫీసులో హీరో అయిపోయాడు.ఆఫీస్ స్టాఫ్ అతన్ని పొగడని రోజంటూలేదు.హఠాత్తుగా అతనికి లభిస్తున్న గౌరవానికి తలమునకలైపోయాడు కామేశం.నిన్నటిదాకా ఆఫీసులో తన కరిస్మాకు ఎదురులేదు.తను అవునంటే అవును,కాదంటే కాదు,అలాంటిది,ఇప్పుడు తన పాపులారిటికీ ప్రతిబంధకంగా సదానందం సాక్షాత్కరించాడు.

సదానందం పెద్దగా చదువుకోలేదు.తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.సాధారణ చదువులు చదివిన సదానందమే సొంత కవిత్వం వ్రాయగాలేంది,పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తను ప్రబంధం వ్రాయలేడా అనుకున్నాడు.అందుకే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు.ముఖ్యంగా కవిత్వం వ్రాయటం పెద్ద గొప్ప విషయమేం కాదని నిరూపించదలచుకున్నాడు.అందుకు కావల్సిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాడు.అయితే ఏ విషయం మీద కవిత్వం వ్రాయాలనే సందేహం కలిగింది.సడెన్ గా పాపులారిటీ పెరిగిన సదానందం మీద అసూయ కలిగింది.అతని మీద కసిగా వ్రాద్దామనుకున్నాడు.కానీ అతనేనాడు తనకు బదులు చెప్పింది లేదు.కయ్ మన్నా,గయ్ మన్నా కామ్ గా పడి వుంటాడు.'పాపం' అనిపించి ఆ ఆలోచన విరమించుకున్నాడు.అంతలోనే 'కుక్కపిల్లా,సబ్బుబిళ్ళా..కాదేదీ కవితకనర్హం' అన్న శ్రీశ్రీ కవిత గుర్తుకు వచ్చింది.వెంటనే తను మెచ్చిన,తనకు నచ్చిన సంగతుల మీద కవితలు వ్రాయటం మొదలుపెట్టాడు.అలా పుంఖానుపుంఖాలుగా పేజీలు నింపాక,తనివితీరా వాటిని చదువుకుని ఎవరెస్ట్ ని యెక్కినట్లుగా ఫీలైపోయాడు.

కవిత్వం వ్రాస్తే సరిపోదు.వ్రాసినట్టు అందరికీ తెలియాలి.అందుకే కామేశం వో ఉపాయం అలోచించాడు.ఓ సండే సాయంకాలం తన ఇంట్లో చిన్న పార్టీ అనౌన్స్ చేశాడు.పార్టీ చివర్నో సర్ ప్రైజ్ వుంటుందని కుడా సెలవిచ్చాడు.పిల్లికి బిచ్చంపెట్టని కామేశం పిలిచి పార్టీ యిస్తాననేసరికి,ఆఫీస్ స్టాఫ్ అంతా మొదట్లో అదిరిపడినా,తర్వాత తేరుకొని హుషారుగా వచ్చారు.పార్టీ కోసం కాకపోయినా,చివర్న ప్రకటించబడే 'సర్ ప్రైజ్' కోసం కొంతమంది కుతూహలజీవులు కాళ్ళీడ్చుకుంటూ వచ్చారు.అతిథి మర్యాదలు అద్భుతంగా జరిగాయి.అందరు సుష్టుగా లాగించి తీరిగ్గా ఆసీనులయ్యాక,గొంతు సవరించుకుని,ఓ పేపర్ కట్టతో వారి ముందు ప్రత్యక్ష్యమయ్యాడు కామేశం.

"మరేం లేదు! నేను కొన్ని కవితలు వ్రాశాను.వాటిలో మచ్చుకు కొన్ని మీకు వినిపించాలని నా కోరిక" అంటూ చావు కబురు చల్లగా చెప్పాడు.

ఊహించని ఈ ఉత్పాతానికి అంతా ఉలిక్కిపడి ఒకరినొకరు చూసుకున్నారు !

టీవీ కొన్నాక అడ్డమైన సీరియల్స్ భరించక తప్పదు.అందరూ ధైర్యం చిక్కబట్టుకొని తప్పదన్నట్లుగా కుర్చున్నారు.

కామేశం ఈలోగా కాగితపు కట్టను దులిపి మొదటి పేజిని అందుకున్నాడు.
"వేయించి తిన్నాక దొండ
తాగాలి నీళ్ళు వో కుండ" అన్నాడు.

వెంటనే ధభీమన్న శబ్దం వినపడింది.వెనుక వరుస లో కూర్చున్న వామనరావు వెల్లకిల్లా విరుచుకుపడిపోయాడు.బిత్తరపోయి అంతా అటువైపు చూశారు.

"అబ్బే ఏంలేదు.నేను యింత అద్భుతంగా కవిత్వం వ్రాస్తానని అతను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు.అందుకే ఆనందాతిశయంతో స్పృహ కోల్పోయాడు.అల్పజీవి కదా " తేల్చేశాడు కామేశం.

స్టాఫ్ కు ముచ్చెమటలు పట్టేశాయ్.

కామేశం మరో లైను అందుకున్నాడు
"శ్రీరాముని భార్య సీత !
సముద్ర తీరాన పీత !! " అన్నాడు.

మధ్యవరుసలో కూర్చున్న మాణిక్యానికి మతి స్థిమితం తప్పింది.సంధి ప్రేలాపనలు ఆరంభించి చేతికందిన వస్తువులు క్రిందవేస్తూ చిందులు తొక్కడం మొదలు పెట్టాడు.అతన్ని కంట్రోల్ చేసేసరికి ఆఫీస్ స్టాఫ్ కి తలప్రాణం తోకకొచ్చింది.

ఇంత జరుగుతున్నా కామేశంకు చీమ కుట్టినట్లు కూడా లేదు.మరో గంట నిర్విఘ్నంగా కవితాపారాయణం సాగించాడు.అతని కవిత్వం ధాటికి ఆఫీస్ స్టాఫ్ అంతా కుదేలైపోయారు.కొంతమంది ఎలాగోలా మెల్లగా జారుకుని,ఆ కంగారులో,గేటు తెరిచే వున్నా గోడ దూకి పారిపోయారు.మరికొందరు పక్షవాతం వచ్చిన రోగుల్లా కుర్చీలకు అతుక్కుపోయారు.
మొత్తానికి ఆ రోజు ప్రాణాలతోనే బయటపడ్డారు అందరు.

కామేశం చేపట్టిన కవితా వ్యాసంగం ఆ ఆదివారంతో ఆగిపోలేదు.
ఆంజనేయుడి తోకలా అలా సాగుతూపోయింది.ప్రతి ఆదివారం యిలా స్టాఫ్ నో,బంధువులనో,ఫ్రెండ్స్ నో ఎవరినో పిలవటం వాళ్ళకు తన కవితలు వినిపించి హడలుకొట్టటం అతనికి రివాజు గా మారిపోయింది.వచ్చిన వాళ్ళకు వండిపెట్టలేక,ఆ పై వాళ్ళు చేసే హాహాకారాలు భరించలేక అతని భార్యకు చిర్రెత్తుకొచ్చేది.అతని సంగతి తెలిసి ఆ యింటివైపు రావటం మానేశారు చాలా మంది.ఇది చాలదన్నట్లు కామేశం పదేళ్ళ పుత్రరత్నం అతని కవితలు కంఠతా పట్టేసి వాటిని బడిలో పిల్లలపై ప్రయోగించటం మొదలుపెట్టాడు.ఇవేవో కొత్త రకం తిట్లనుకొని పిల్లలు జడుసుకొని స్కూలుకు రావటం మానేశారు.ప్రిన్సిపల్ కి విషయం తెలిసి అతని తల్లిని పిలిపించి 'పిల్లాడి చేత ఆ పాడు మాటలు మానిపించేంతవరకు స్కూలుకి పంపకండని ' ముక్కు చీవాట్లు పెట్టాడు.ఆమెకు సహనం నశించి ఆ రాత్రి కామేశంతో తగువులాడి ,పిల్లాడితో సహా పుట్టింటి రైలుబండి ఎక్కేసింది.

పిడుగులు పడి,జడివానలు కురిసినా భగీరథుడు తన తపస్సు వదలనట్లు,కామేశం యివేవి మనసులో పెట్టుకోకుండా తన కవితా యజ్ఞం కొనసాగించాడు.అతని దెబ్బకు కొంతమందికి అదివరకు ఎన్నడూ లేని గుండె దడ ఆయాసం లాంటి అవలక్షణాలు పొడసూపాయి.ఇంకొంతమంది ఫైల్స్ లో ఆఫీస్ విషయాలకు బదులు అన్నమయ్య కీర్తనలు వ్రాయటం స్టార్ట్ చేశారు.ఇలా అయితే లాభం లేదని సదానందం వో మార్గం ఆలోచించి,ధైర్యం చేసి కామేశం కేబిన్లో దూరాడు.

అతన్ని చూడగానే కవితలు వ్రాసుకుంటున్న కామేశం సంతోషంతో మీదపడిపోయి కౌగిలించుకున్నంత పని చేశాడు."రావోయ్ సాదానందం.సరిగ్గా సమయానికొచ్చావ్.ఇప్పుడే వొక బ్రహ్మాండమైన కవిత వ్రాశాను.విసరమంటావా? " అన్నాడు

పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్లుగా అయిపోయింది సదానందం పరిస్థితి.అనవసరంగా లోపలికి వచ్చాననుకొని తనను తానే తిట్టుకొని "వద్దు సార్,ఇప్పుడు లంచ్ టైం.తర్వాత వినిపించండి" అన్నాడు ప్రాధేయపడుతున్నట్లుగా.

కామేశం శాంతించి,అప్పుడే ఏదో వెలిగినవాడిలా

"ఈ మధ్యకాలం లో నేను ఎడాపెడా కవితలు వ్రాసేశాను.అన్నీ అద్భుతమైనవేననుకో ! కానీ వాటిలో అత్యద్భుతమైనవి,పత్రికల వాళ్ళ పల్స్ కు అనుగుణంగా వుండేవి పంపిస్తే బావుంటుంది కాదా.అందుకే నువ్వీ ఆదివారం మా ఇంటికి రావాలి" అన్నాడు.

అప్పుడే సున్నం కొట్టిన గోడ లా సదానందం మొహం తెల్లగా మారిపోయింది.కామేశం కవితల కట్టలు తలచుకోగానే అతని నాలుక తడారిపోయింది.తప్పించుకోకపోతే తనకీ భూప్రపంచంతో సంబంధాలు మిగలవని అనుకున్నాడు.చిన్నప్పుడెప్పుడో చనిపోయిన తాతయ్య ఈ మధ్యే హరీమన్నట్లు కథనల్లి ఈ ఆదివారం పెద్దకర్మ చేస్తున్నట్లు చెప్పి బావురుమన్నాడు.రాలేనని మొరపేట్టుకున్నాడు.

"మరైతే నా కవితల సంగతి ?!?" అడిగేడు కామేశం.

"మీకు ఏవి బాగా నచ్చితే అవే పంపండి సార్ ! మళ్ళీ నేనెందుకు" అన్నాడు సదానందం.

"అలాక్కాదోయ్ సదానందం.పోస్ట్ లో కవితలు పంపడం కాదు.పర్సనల్ గా మనమిద్దరమే వెళ్ళి పత్రికల వాళ్ళను కలుద్దాం.నా కవిత్వాన్ని నువ్వొక్కడివే బాగా అర్థం చేసుకున్నావు.నా సంక్లిష్ట భావాలు,కఠిన సమాసాలు ఒకవేళ ఎడిటర్ కి అర్థం కాకపోతే అతనికి విషయం విడమరచి చెప్పగల ఏకైక వ్యక్తివి నువ్వే.అందుకే నువ్వు తప్పకుండా నాతో రావాలి." అన్నాడు కామేశం.

"నీ బొంద !" నీరసంగా అనుకున్నాడు సదానందం.అతనికి వొప్పుకోక తప్పింది కాదు.

ఓ రోజు సాయంకాలం ఇద్దరూ పత్రికాఫీసు కు వెళ్ళారు.ఎడిటర్ తో సదానందానికి మంచి పరిచయం వుంది.నేరుగా ఆయన కేబిన్లోకి వెళ్ళిపోయారు.కామేశాన్ని పరిచయం చేసి వచ్చిన విషయం విశిదం చేసాడు సదానందం.

ఆయన సంతోషించి కామేశం వైపు ఎగాదిగా చూసి
"ఓహో అలాగా !ఏవి మచ్చుకు కొన్ని కవితలు వినిపించండి" అన్నాడు.

అనడమే ఆలశ్యం అన్నట్లు కామేశం తన సంచిలో నుంచి ఓ కట్ట ను బయటికి లాగి
"దురదగా వుంటుంది కంద !
నా జేబులో వుంది ఓ వంద !!" అన్నాడు.

వెంటనే ఎడిటర్ ముఖవళికలు మారిపోయాయి.నీళ్ళు నములుతూ సదానందం వైపు చుశాడు.విచిత్రంగా అతని మొహం చిరునవ్వుతో వెలిగిపోతోంది.

కామేశం రెండో కవిత అందుకున్నాడు.
"ముప్పుటలా మేస్తాను ములక్కాయ!
అప్పుడప్పుడు తింటాను ఆవకాయ!" అన్నాడు.

లాగిపెట్టి ఒక్కటిచ్చుకొని 'దీన్నంటారు లెంపకాయ '' అందామన్నంత కోపం వచ్చింది ఎడిటర్ కి.

కామేశం తన లోకంలో పడిపోయి 'కూరలో కావాలి టమోటా,నాకేమో యిష్టం సపోటా, వంటకి కావాలి గ్యాసు,బస్సులో వుండాలి పాసు లాంటి కవితలు తన్మయత్వంతో చెప్పుకుంటూపోతున్నాడు.

ఎడిటర్ కు ఏంచెయ్యాలో అర్థంకాలేదు.కుర్చీలో అసహనంగా కదిలాడు.గ్లాసులో నీళ్ళు ఖాళీ చేసి గట్టిగా దగ్గాడు.కాసేపు పైకిలేచి గదిలో అటూఇటూ పచార్లు చేశాడు.కొంతసేపు కుర్చీని టేబుల్ ను బరబరా యిడ్చాడు.చివరికి తిక్కరేగి పేపర్ వేయిట్ తీసి నేలకేసి విసిరికొట్టాడు.

..అయినా కామేశం కవితాపారాయణం ఆగలేదు.హతాశుడైపోయిన ఎడిటర్ కామేశం రెండు చేతులు పట్టుకొని "మహా ప్రభో! ఆపండి,దయచేసి ఇక ఆపండి." అంటూ వేడుకున్నాడు.

అప్పటికి కామేశం ఉపశమించాడు.

మరో గ్లాసు నీళ్ళు త్రాగేక కానీ మాములు మనిషి కాలేకపోయాడు ఎడిటర్.సదానందం తన చెవులలోంచి దూదిపింజలు తియ్యటం అప్పుడు గమనించాడతను.ఒళ్ళుమండి అతని కాలర్ పట్టుకొని
"ఏమయ్యా! దినీకంతటికీ కారణం నువ్వు కాదు?పోనీలే బాగా వ్రాస్తావని చనువిస్తే ఈ పిల్లినొకటి చంకనేసుకుని వస్తావా?ఇంకో సారి యిలా చేశావంటే నీ కవిత కాదు,కర్మకాండ ప్రచురిస్తాను" అంటూ హెచ్చరించాడు.

సదానందం భయంతో బిక్కచచ్చిపోయాడు.

కామేశానికి అవేశం వచ్చింది.
"మీకర్థం కాకపోతే మానేయండి! అంతే గానీ నా కవితల్ని యిన్సల్ట్ చెయ్యద్దు" అన్నాడు.

ఎడిటర్ కోపం నషాళానికి అంటింది.
"నోర్ముయ్! ఇవి కవితలా! నువ్వు రోజు తినే కూరగాయలు,నలుగురికీ తెలిసిన సంగతులు వాక్యాలుగా పేర్చి కవితలంటావా?..ఏమిటీ ?..'దురదగా ఉంటుంది కంద,నీ జేబులో వుంది వో వందా?'..నీ బొంద..వెళ్ళు.ముందు బయటికి వెళ్ళు..ఇంకోసారి ఈ పరిసర ప్రాంతాలలో తచ్చాడుతున్నాట్టుగా తెలిసిందో..న్యూసెన్స్ కేసు కింద జైళ్ళో వేయిస్తాను.జాగ్రత్త" అంటూ దులిపేశాడు.

కామేశానికి పౌరుషం పొడుచుకొచ్చింది.
"చాల్చాల్లేవయ్య ! నీ పత్రిక కాకపోతే,దాన్ని మించింది యింకొకటి' అంటూ తన కవితల సంచి తగిలించుకుని బయటికి వచ్చేశాడు.

సదానందం ఎడిటర్ కాళ్ళావేళ్ళాపడి క్షమాపణ కోరుకుని 'బ్రతుకు జీవుడా ' అంటూ బయటపడ్డాడు.

కొసమెరుపు: సదానందం వేరే బ్రాంచికి ట్రాన్స్ఫర్ చేయించుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు.కామేశం మాత్రం విరామెరుగని ధరిత్రిలా,పట్టువదలని విక్రమార్కుడిలా కవితల సంచి పట్టుకుని పత్రికల ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

అతని కోరిక ఫలించాలని ఆశిద్దామా ?!?



3 comments

Post a Comment